కరోనా నిధులు కఠినంగా సమీకరించండి
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ
న్యూఢిల్లీ: కరోనా (కొవిడ్-19) వైరస్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి సంఘీభావం తెలుపుతూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కరోనా పై మరింత సమర్థవంతంగా పోరు కొనసాగించేందుకు అవసరమైన నిధుల సమీకరణకు ప్రధాని మరింత కఠినంగా వ్యవహరించాలని లేఖలో పేర్కొన్నారు. అందులో భాగంగా పార్లమెంట్ భవనంతోపాటు, సెంట్రల్ విస్టా, మంత్రులకు సంబంధించిన కాంపోజిట్ కాంప్లెక్స్ ఆధునీకరణ ప్రాజెక్టును నిలిపివేసి అందుకు కేటాయించిన రూ. 20 వేల కోట్ల నిధులను కరోనా పై పోరులో భాగంగా కొత్త ఆస్పత్రుల నిర్మాణానికి, వైద్య సిబ్బంది వ్యక్తిగత రక్షణకు ఉపయోగించే పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ (పీపీఈ) కిట్ల కొనుగోలుకు ఉపయోగించాలని కోరారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు, గవర్నర్లు, ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి జీతాల్లో 30 శాతం కోత విధిస్తూ సోమవారం కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ఆమె సమర్థించారు. కరోనా పై మరింత సమర్థవంతంగా పోరాడేందుకు సూచనలు చేయాలని ప్రతిపక్ష పార్టీలను ప్రధాని మోదీ కోరిన నేపథ్యంలో సోనియా ఈ లేఖ రాసినట్లు తెలిపారు. అందులో భాగంగా ప్రభుత్వం టి.వీ.. ప్రింట్, ఆన్లైన్ మీడియాలకు ఇచ్చే అడ్వర్టైజ్ మెంట్ లలో కరోనా సంబంధిత సమాచారానికి సంబంధించినవి మినహా మిగతా అన్ని యాడ్స్ ను రెండు సంవత్సరాలపాటు నిలిపివేయాలని సూచించారు. ప్రభుత్వం కూడా 30 శాతం ఖర్చులు తగ్గించుకొని ఆ మొత్తాన్ని వలన కూలీలు, కార్మికులు, రైతులు, చిన్న పరిశ్రమలకు ఆర్థిక భద్రతను కల్పించే విధంగా కేటాయింపులు జరపాలని కోరారు. దానితో పాటు రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్రాల మంత్రులు, అధికారుల విదేశీ పర్యటనలను కొంత కాలం పాటు నిలిపివేసి, ఆ సొమ్మును కరోనా పై పోరుకు వినియోగించాలని సూచించారు. పీఎం-కేర్స్ నిధిని ప్రధానమంత్రి సహాయ నిధికి బదిలీ చేసి అందులో పారదర్శకత, జవాబుదారీతనం, ఆడిట్ ఉ ండేలా చూడాలని కోరారు. ఇప్పటికే ప్రధానమంత్రి సహాయ నిధిలో ఉన్న రూ.3,800 కోట్ల నిధి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రతి ఒక్క భారతీయుడు కరోనా పై పోరులో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను సమర్థిస్తూ, పాటిస్తూ గొప్ప వ్యక్తులుగా నిలుస్తున్నారని అభినందించారు. శాసనసభ్యులు, అధికారులు కూడా పరస్పరం సహకారం అందించుకుంటూ ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించాలని లేఖలో పేర్కొన్నారు.