3 వేలకు చేరువలో భారత్ కరోనా 24 గంటల్లో 600 కేసులు నమోదు

68కి చేరిన మృతుల సంఖ్య..ప్రకటించిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ తీవ్రత భారత్ లో రోజురోజుకు పెరుగుతోంది. శనివారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 2902కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. వీరిలో 68మంది మరణించగా 2650మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని ప్రకటించింది. మరో 184మంది కొవిడ్-19 నుంచి కోలుకున్నారని తెలిపింది. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో కొవిడ్-19 తీవ్రత కొనసాగుతోంది. తాజాగా ఇక్కడ మృతుల సంఖ్య 19కు చేరగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 423గా ఉంది. గుజరాత్ లో ఈ వైరతో మరణించిన వారిసంఖ్య 9కి చేరింది. దిల్లీ, మధ్యప్రదేశ్ లలో కొవిడ్-19 మృతుల సంఖ్య 6కు చేరింది. దిల్లీలో బాధితుల సంఖ్య 386కు చేరగా ఇది మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. పంజాబ్ లో 53కేసులు నమోదుకాగా ఐదుగురు మ రణించారు. తమిళనాడులో వైరస్ అత్యంతవేగంగా వ్యాపిస్తోంది. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 411కు చేరింది. మహారాష్ట్ర తరువాత అత్యధిక కేసులో తమిళనాడులోనే నమోదయ్యాయి. కర్ణాటక, పశ్చిమబెంగాల్ లో ముగ్గురు చొప్పున మరణించారు. జమ్మూ కశ్మీర్ లో కొవిడ్ 19 కారణంగా ఇద్దరు మరణించారు. కేరళలో కొవిడ్ తీవ్రత కొనసాగుతోంది. ఇప్పటికే ఇక్కడ 295కి పైగా పాజిటివ్ కేసులు నమోదుకాగా ఇద్దరు మరణించారు. ఉత్తర్ ప్రదేశ్ లో 174 కేసులు నమోదు కాగా ఇద్దరు మరణించారు. ఆంధ్రప్రదేశ్, బిహార్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడులో ఒకరు చొప్పున మరణించారని ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో 229మంది వైరస్ బారినపడగా 11మంది మరణించిట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.