అక్కడ సానుకూలం ఇక్కడ ప్రతికూలం
బీజేపీ రెండు నాల్కుల ధోరణి..తలలు పట్టుకుంటున్న ఏపీ కమలం నేతలు
-జగన్ 3 రాజధానుల ప్రకటన వెనుక బీజేపీ హస్తం
-అమిత్‌షా అనుమతితోనే జగన్ ముందడుగు!!
-రాజధానుల అంశం రాష్ట్రాల పరిధిలోనిదే
-ఏపీ జగన్ వైఖరిపై నిర్ణయం చెప్పేసిన కేంద్రం
– ఏం జరుగుతోందో తెలియక రాష్ట్ర బీజేపీ నేతల గందరగోళం
-మండలిరద్దు కు సైతం కేంద్రం సానుకూలమే..
-రాజ్యసభలో వైసీపీ బలం పెరగడమే కారణం
-కేంద్రం ప్రకటనతో వైసీపీ నేతల సంబరాలు
న్యూఢిల్లీ:
ఏపీ రాజధాని అంశంపై కేంద్రం తొలిసారిగా స్పందించింది. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. దాన్ని రాష్ట్ర పరిధిలో ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపింది. లోక్‌సభలో తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ”ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ నోటిఫై చేసింది. 2015 ఏప్రిల్ 23న విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం ఏపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు మీడియా కథనాల ద్వారానే తెలిసింది. రాష్ట్ర పరిధిలో రాజధానిని ఎక్కడైనా ఏర్పాటు చేసుకునే అధికారం ఆ ప్రభుత్వానికి ఉన్నది” అని నిత్యానందరాయ్ సమాధానమిచ్చారు.
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును నిర్ణయించింది. ఈ నిర్ణయం పట్ల రాష్ట్రంలో పలుచోట్ల నిరసన ప్రదర్శనలు జరిగాయి. ముఖ్యంగా అమరావతిలో రైతులు, మహిళలు ఉద్ధ తంగా ఆందోళన కొనసాగిస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తుకోసం భూములిచ్చిన తమకు అన్యాయం చేయడమేంటని మండిపడుతున్నారు. ఓవైపు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ముందుకెళ్లింది. శాసనసభలోనూ పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు ఆమోదం పొందేలా చేసింది. మరోవైపు శాసన మండలిలో మాత్రం ఆ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపుతూ ఛైర్మన్ షరీఫ్ నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ లోక్‌సభలో మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావిస్తూ అమరావతి రైతుల ఆందోళనను సభ ద ష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో రాజధాని ఎక్కడ ఉండాలనే అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికే అధికారముంటుందని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లిఖితపూర్వకంగా జయదేవ్‌కు సమాధానమిచ్చారు.
అయితే జగన్ మూడు రాజధానుల ప్రకటన వెనుక బీజేపీ ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ సపోర్ట్ తోనే ఏపీలో టీడీపీని దెబ్బకొట్టడానికి జగన్ మాస్టర్ ప్లాన్ వేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
2019 ఎన్నికల తరువాత వైసీపీ, బీజేపీల మధ్య దూరం పెరిగిందని.. అందుకే ఇటీవల జగన్ ఢిల్లీ వెళ్తే అమిత్ షా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని మీడియాలో తెగ వార్తలొచ్చాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదని అంటున్నారు. ఢిల్లీ వెళ్లినప్పుడు జగన్ అమిత్ షాని కలిశారని విశ్వసనీయవర్గాల సమాచారం. ఆ సమయంలో మూడు రాజధానుల అంశం గురించి చర్చించారట. అమిత్ షా అంగీకారంతోనే జగన్ మూడు రాజధానుల అంశం తెరపైకి తీసుకొచ్చారని అంటున్నారు. దీనికి తెరవెనుక విజయసాయి రెడ్డి చక్రం తిప్పారని తెలుస్తోంది. అందుకే మూడు రాజధానుల నిర్ణయంపై బీజేపీ నుండి అంతగా వ్యతిరేకత వ్యక్తమవట్లేదని అంటున్నారు. నిజానికి అమరావతి భూమి పూజకి ప్రధాని మోడీ వచ్చారు. పవిత్ర మట్టిని, గంగ జలాన్ని ఇచ్చి.. అమరావతిని ఢిల్లీ కంటే పెద్ద నగరంగా తీర్చిదిద్దటంలో పూర్తీ సహకారం అందిస్తామని చెప్పుకొచ్చారు. ప్రధాని హోదాలో మోడీ మాట ఇచ్చారు. ఇప్పుడూ ప్రధానిగానే ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ప్రధాని మాటని మట్టిలో కలిపేస్తూ జగన్ నిర్ణయం తీసుకుంటున్నారు. కానీ బీజేపీ సపోర్ట్ లేకుండా జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకోలేరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మూడు రాజధానుల నిర్ణయం వల్ల బీజేపీకి ఒరిగేదేముంది అనుకోవచ్చు. కానీ దాని వెనుక ఓ మాస్టర్ ప్లాన్ ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఉత్తరాది రాష్ట్రాలలో బీజేపీ ప్రభ తగ్గుతోంది. పలు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ విషయాన్ని స్పష్టం చేశాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో అధికారం కోల్పోయింది. జార?ండ్ లో కూడా బీజేపీకి చేదు ఫలితాలు తప్పవని ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయపడ్డాయి. ఉత్తరాదిలో మొదలైన వ్యతిరేకతను దక్షిణాదితో భర్తీ చేయాలని బీజేపీ భావిస్తోంది. దక్షిణాదిలో బలపడేలా వ్యూహాలు రచిస్తోంది. దానిలో భాగంగానే ఏపీపై ప్రత్యేక ద ష్టి పెట్టింది. ఏపీలో జగన్ ని పావుగా వాడుకొని పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ భావిస్తోందని అంటున్నారు. జగన్ మెడకి బెయిల్ కత్తిని వేలాడదీసి గ్రిప్ లోకి తెచ్చుకుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కొద్దిరోజులుగా జగన్ ని జైలుకి పంపి ఏపీలో బీజేపీ బలపడాలని చూస్తోందని ప్రచారం జరిగింది. కానీ బీజేపీ మాత్రం.. జగన్ జైలు కి వెళ్లడం కంటే.. బయట ఉంటేనే తమ పార్టీకి ప్రయోజనమని భావిస్తోందట. ఇప్పుడు వైసీపీలో ఉన్న వారిలో మెజారిటీ కార్యకర్తలు, నాయకులు ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉన్నవారే. ఒకవేళ జగన్ జైలుకి వెళ్లి.. వైసీపీ భవిష్యత్తు ప్రశ్నార్థకమైతే.. వారంతా కాంగ్రెస్ వైపు చూస్తారు కానీ బీజేపీ వైపు చూడరు. అంటే ఏపీలో కాంగ్రెస్ కి బీజేపీనే జీవం పోసినట్టు అవుతుంది. అసలు కాంగ్రెస్ బలపడటం బీజేపీకి ఏమాత్రం నచ్చదు. అందుకే జగన్ ని తమ గ్రిప్ లో పెట్టుకొని గేమ్ ఆడాలని చూస్తోందట. ఏపీలో టీడీపీ ప్లేస్ ని భర్తీ చేయాలని బీజేపీ ప్లాన్ చేస్తోందట. ఈ మూడు రాజధానుల ప్రకటనతో టీడీపీ ఇరుకున పడింది. వ్యతిరేకించినా నష్టమే, సమర్ధించినా నష్టమే. ఒక్కమాటలో చెప్పాలంటే టీడీపీ మనుగడకే ప్రమాదం వచ్చి పడింది. అదే బీజేపీకి కలిసొచ్చే అంశం. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు బీజేపీలో చేరారు. ఈ మూడు రాజధానుల దెబ్బతో మరింతమంది టీడీపీ నుండి బీజేపీకి క్యూ కడతారు. ఓ రకంగా ఏపీలో వైసీపీకి ప్రత్యమ్నాయ శక్తిగా ఎదిగే అవకాశముంది. జగన్ మెడ మీద బెయిల్ కత్తి వేలాడుతుండటంతో.. ఆయన బీజేపీ చెప్పినట్టు నడుచుకుంటున్నారని అంటున్నారు. ఓ రకంగా బీజేపీ అజ్ఞాత మిత్రుడిగా మారిపోయి సాయం చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఈ మూడు రాజధానుల ప్రకటనతో టీడీపీ పునాదులను కలిదించి ఆ ప్లేస్ లోకి రావాలని బీజేపీ చూస్తోందని.. టీడీపీని లేకుండా చేయడం జగన్ కి ఇష్టం, జైలుకి వెళ్లడం కష్టం కాబట్టి పూర్తిగా సహకరిస్తున్నారని అంటున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ తిరుగులేని పార్టీ. విభజనకు ముందు రెండు పర్యాయాలూ కాంగ్రెసే అధికారంలో ఉంది. అలాంటి పార్టీ ఆంధ్రప్రదేశ్ విడిపోయాక.. ఒక రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోయింది. ఆ తర్వాత ఏ దశలోనూ పుంజుకోలేదు. ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ ఉనికే లేకుండా పోయింది.
ఇలా ఆ పార్టీ భూస్థాపితం అయిపోవడానికి విభజనకు ప్రధాన కారణంగా నిలుస్తూనే ఒక స్టాండ్‌తో లేకపోవడం.. నాయకుల్లో చిత్తశుద్ధి కొరవడటం.. గందరగోళ ప్రకటనలు.. ఇలా చాలా కారణాలే ఉన్నాయి. నాటి తప్పిదాలకు ఈ స్థాయిలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఏపీ కాంగ్రెస్ నాయకులు అప్పుడు ఊహించి ఉండరు. ఇక వర్తమానంలోకి వస్తే ఏపీలో రాజధాని మార్పు విషయంలో ఒక స్టాండ్ అంటూ లేకపోవడం వల్ల భారతీయ జనతా పార్టీ కూడా రాష్ట్రంలో అలాగే దెబ్బ తింటుందేమో అన్న సందేహాలు రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు హయాంలో ఏపీకి కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో సాయం అందకపోవడం, ప్రత్యేక హోదా విషయంలో మొండిచేయి చూపడం రాష్ట్రంలో భాజపాను గట్టి దెబ్బే కొట్టింది. ఇప్పుడు జనసేనతో కలిసి మళ్లీ పుంజుకునే ప్రయత్నం చేస్తుండగా.. రాజధాని అంశంపై ఆ పార్టీ అధినాయకత్వం, స్థానిక నాయకుల మధ్య సమన్వయం కొరవడటం.. గందరగోళ ప్రకటనలు పార్టీకి బాగానే డ్యామేజ్ చేసేలా ఉన్నాయి. కేంద్రంలోని భాజపా అధినాయకత్వం ఏమో అసలు మూడు రాజధానుల విషయం తెలియదన్నట్లు వ్యవహరిస్తోంది.
రాష్ట్ర బీజేపీ 3 రాజధానుల ప్రతిపాదనకు తాము వ్యతిరేకం అంటోంది. పార్టీ అధ్యక్షుడు ఈ మాట అంటూనే.. కర్నూలులో హైకోర్టు పెట్టడం కరెక్టే అంటున్నారు. మరోవైపు రాష్ట్ర బీజేపీలో కీలక నాయకుడైన సోము వీర్రాజు 3 రాజధానులకి అనుకూలం అంటున్నారు. ఎంపీ సుజనా చౌదరి ఏమో ఈ ప్రతిపాదనకు వ్యతిరేకం. మరో ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఒక్కోసారి ఒక్కో రకమైన ప్రకటన చేస్తున్నారు. పార్టీ వైఖరి ప్రకారం అయితే.. శాసన మండలిలో బీజేపీ ఎమ్మెల్సీలు మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగ ఓటేయాలి. కానీ వాళ్లు తటస్థంగా ఉండిపోయారు. ఈ గందరగోళం ఇలాగే కొనసాగితే ఏపీలో బీజేపీ పుట్టి మునగడం ఖాయం.