50-60 కోట్ల మందికి
తల్లిదండ్రుల పుట్టిన తేదీలు తెలియవు
కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్
న్యూఢిల్లీ: నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ)పై కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ దేశంలోని 50 నుంచి 60 కోట్ల మంది ప్రజలకు తమ తల్లిదండ్రుల పుట్టిన తేదీలు తెలియమని అన్నారు. సోమవారంనాడిక్కడ మీడియాతో ఆజాద్ మాట్లాడుతూ, పౌరసత్వ సవరణ బిల్లు చట్టం అయినప్పటి నుంచి ప్రభుత్వం అనేక సందర్భాల్లో ఎన్‌పీఆర్ తర్వాత ఎన్‌ఆర్‌సీ వస్తుందని చెబుతూ వచ్చిందన్నారు. గతంలోనూ ఎన్‌పీఆర్ నిర్వహించడం జరిగిందని, అయితే అప్పుడు ప్రశ్నలు సహజంగా ఉండేవని, బీజేపీ మాత్రం ఇప్పుడు తప్పుడు పద్ధతిలో ఎన్‌పీఆర్‌ను తీసుకొస్తోందని అన్నారు. ‘హిందువా, ముస్లిమా అనే గుర్తింపుతో ఎన్‌పీఆర్‌కు సంబంధం లేదని మేము నమ్ముతున్నాం. ఈ దేశంలోని 50 నుంచి 60 కోట్ల మంది ప్రజలకు వాళ్ల తల్లిదండ్రుల పుట్టిన తేదీలు తెలియవు’ అని ఆయన అన్నారు. ఇచ్చిన హామీలను నిలుపుకోలేకనే బీజేపీ సారథ్యంలోని కేంద్రం ప్రభుత్వం ఇలాంటి అంశాల్లోకి జనాలను లాగుతోందని ఆజాద్ విమర్శించారు.