ఏ తీరుగ నను..దయచూసెదవో

పట్టించుకోని పర్యాటక శాఖ..దయచూపని దేవాదాయ శాఖ
తెలంగాణ వాగ్గేయకారుడికి అడుగడుగునా అనాదరణ

  • -మొక్కుబడి నిధులు తప్ప పట్టించుకోని సర్కారు
  • -భద్రాద్రిపై ఉన్న భక్తి దాన్ని కట్టించిన భక్తుడిపై లేని ఆసక్తి
  • -అరకొర నిధులతోనే సరిపెడుతున్న ప్రభుత్వం
  • -ధూపదీప నైవేద్యాలకే చాలీచాలని నిధులు
  • -1974నుంచి భక్తరామదాసు స్మారక ఉత్సవాల నిర్వహణ
  • -కేంద్రంలో బీజేపీ సర్కారు దృష్టికైనా తీసుకెళ్లని కార్యకర్తలు
  • -దక్షిణాది అయోధ్యగా తీర్చిదిద్దాలని కోరుతున్న స్థానికులు
  • -ఆంధ్రాలో అన్నమయ్య క్షేత్రానికి అపార నిధులు
  • -అన్ని ప్రాంతాలనుంచి బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని వినతులు

(నండూరి రవిశంకర్‌)

హైదరాబాద్‌:
భక్తరామదాసు నిర్మించిన భద్రాద్రి రామాలయం దక్షిణ భారతదేశ వ్యాప్తంగా పేరుగాంచింది. కానీ, భక్తరామదాసు మందిరానికి ఆ మేరకు ప్రచారాన్ని కల్పించడంలో పర్యాటకశాఖ, దేవాదాయశాఖ పూర్తిగా విఫలమైంది. సీతారామ చంద్రస్వామి దేవాలయం ఎంత ప్రఖ్యాతిగాంచిందో ఆ ఆలయం నిర్మించిన కంచర్ల గోపన్న(శ్రీరామదాసు) అంత ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి. ప్రముఖ కవిగా, వాగ్గేయకారునిగా, రాముని పరమభక్తునిగా చరిత్రలో నిలిచిన రామభక్తున్ని మాత్రం ప్రజాప్రతినిధులు, అధికారులు విస్మరిస్తున్నారు. భద్రాచలంలోని రామాలయంలో రూ.లక్షలు ఖర్చు పెట్టి ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వాలు, సంబంధిత అధికారులు నేలకొండపల్లి మండల కేంద్రంలోని భక్త రామదాసు ధ్యాన మందిరాన్ని ఇన్నేళ్లుగా పూర్తిగా విస్మరించారు. ఆరాధనోత్సవాలు, జయంత్యుత్సవాల సమయంలో హడావుడి చేసి చేతులు దులుపుకుంటున్నారు. గతేడాది జయంత్యుత్సవాలు నిర్వహిస్తున్నప్పటికీ నేలకొండపల్లిలోని భక్తరామదాసు మందిరానికి కనీసం సున్నం కూడా వేయలేదు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేసేందుకు రెండు శిలాఫలకాలను హడావుడిగా సిద్ధం చేశారు. కానీ, మందిరానికి వూడిన సిమెంటు పెచ్చులకు మరమ్మతులు కూడా చేయకపోవడం గమనార్హం. రంగులు కూడా వేయలేదంటే… భక్తి ఏపాటితో అర్థం అవుతుంది.
రామునికి గుడి కట్టిన రామభక్తునికిపై మాత్రం అధికారులు, ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యం వహించారు. భక్త రామదాసు నిర్మించిన ఆలయంలో సకల సదుపాయాలతో నిత్యం పూజలు అందుకుంటున్నప్పటికీ రామదాసు మందిరం ఏవిధమైన అభివద్ధికీ నోచుకోలేదు. 2007లో భద్రాచల దేవస్థానం వారు దీనిని దత్తత తీసుకొని రాములోరి కల్యాణానికి కొంత నగదు అందిస్తున్నారు. ప్రభుత్వం రాష్ట్రంలోని పలు దేవాలయాల అభివద్ధికి రూ.కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ తెలంగాణవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన భక్తరామదాసు మందిరానికి దూపదీప నైవేద్యాలు మినహా ఎలాంటి నిధులను మంజూరు చేయడంలేదు. 2017 నుంచి భక్త రామదాసు ఉత్సవాలను ప్రభుత్వం అధికారకంగా నిర్వహిస్తుంది. 2017 తిరుమలాయపాలెం బహిరంగసభకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేలకొండపల్లిలో భక్త రామదాసు మెమోరియల్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు.
చలువ పందిళ్లేవీ?
నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ అంటూ రామదాసు సీతమ్మ తల్లిని కోరగా రాముడు దర్శనమిచ్చి రామదాసు కోరిక మీద తనలో ఐక్యం చేసుకున్నాడు. కానీ, నేడు భక్తులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రం స్పందించడం లేదు. రామునికి పరమ భక్తురాలైన పోకల దమ్మక్క 16వ శతాబ్దంలో చలువ పందిళ్లు వేసి రాముని కల్యాణం జరిపించగా భద్రాచలం సహా ప్రసిద్ధ రామాలయాల్లో నాటి నుంచి చలువ పందిళ్లు అనాదిగా ఆచారంలా వస్తున్నాయి. కానీ, నేలకొండపల్లిలో మాత్రం నిధులు లేక చలువ పందిళ్లు కూడా కలగానే మిగిలిపోయాయి.
పర్యాటకులను ఆకర్షించాలంటే…
రామదాసు మందిరంలో వందల సంవత్సరాల కిందట భక్త రామదాసు వాడిన బావి ఉంది. వీటిని సందర్శించేందుకు వచ్చే భక్తుల సంఖ్య ప్రస్తుతానికి తక్కువగా ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధులు, అధికారులు శ్రద్ధ వహిస్తే చుట్టుపక్కల ప్రాంతాల నుంచేగాక దూర ప్రాంతాల నుంచి సైతం పర్యాటక ప్రేమికులను ఆకర్షించవచ్చు. ఈ విషయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవ చూపించాలని భక్తులు కోరుతున్నారు.
భక్తరామదాసు మరువలేని ఆయన పుట్టిన గ్రామస్తులు సుమారు 60 సంవత్సరాల క్రితం (1955-61) నేలకొండపల్లిలో, రామదాసు నివసించిన స్థలంలో ఆనాటి గ్రామ సర్పంచ్‌ స్వర్గీయ పెండ్యాల సత్యనారాయణరావు నేతత్వంలో భక్త రామదాసు ధ్యాన మందిరం నిర్మించారు. రామదాసు వాడిన బావి కూడా నేటికీ ఆ స్థలంలోనే వుంది. అయితే కారణాలు ఏవైనా, ఆ మందిరం చాలాకాలం ఖాళీగా ఉండిపోయి, సామాజిక అవసరాలకు ఉపయోగించారు. దరిమిలా, పెండ్యాల సత్యనారాయణరావు మరికొందరు గ్రామస్తులు కలిసి రామదాసు స్మారక కమిటీని ఏర్పాటుచేసి, 1974నుంచి భక్తరామదాసు స్మారక ఉత్సవాలను జరిపించసాగారు. నాల్గవ వార్షికోత్సవంలో, అంటే 1977వ సంవత్సరంలో శ్రీ సీతారామ చంద్ర లక్ష్మణ స్వామి వారి శిలా విగ్రహాలను, రామదాసు శిలా విగ్రహాన్ని 1986లో స్వర్గీయ భీకంసింగ్‌, స్వర్గీయ రావులపాటి రంగారావు, స్వర్గీయ గండికోట శేషభూషణరావు, స్వర్గీయ గండికోట రాజేశ్వరరావు, పెండ్యాల రాంమోహన్‌రావు, మరికొందరు భక్తులు కలిసి ‘శ్రీ భక్త రామదాసు విద్వత్‌ కళాపీఠం’ అనే సంస్థను స్థాపించి ఆరాధనోత్సవాలను చేయడం ప్రారంభించారు. అదే సంస్థ ఈనాటికీ మాఘశుద్ధ తదియ రోజున రామదాసు జయంతిని, వైశాఖ మాసం ప్రారంభంలో ఆరాధనోత్సవాలను నిర్వహిస్తున్నారు. అప్పుడప్పుడూ కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.
2000 సంవత్సరంలో నాటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రోత్సాహంతో, అప్పటి ఖమ్మం జిల్లా కలెక్టర్‌ ఎ.గిరిధర్‌ చొరవతో ధ్యాన మందిరం ఆధునీకరించబడి ప్రఖ్యాత సంగీత విద్వాంసులు స్వర్గీయ బాలమురళీకష్ణ చేతులమీదుగా పునఃప్రారంభించబడింది. 2007 సంవత్సరంలో భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం దీన్ని దత్తత తీసుకొని నిర్వహిస్తున్నారు. ఒక అర్చకున్ని నియమించి నిత్య పూజలు, దూప, దీప నైవేద్యాది కైంకర్యాలు జరిగేట్లు చూస్తున్నారు. శ్రీరామనవమి, దసరా, ధనుర్మాస ఉత్సవాలను కూడా నిర్వహిస్తున్నారు.
కాకపోతే ఇవన్నీ ఏదో మొక్కుబడిగా జరుగుతున్నాయని అంటున్నారు. చేయాల్సిన పనులెన్నో వున్నాయని, నేలకొండపల్లిలోని భక్తరామదాసు ధ్యాన మందిరాన్ని తీర్చిదిద్దాలని, భక్తులను, పర్యాటకులను అక్కడికి వచ్చేట్లుగా చేయాలని, మందిరాన్ని పూర్తిస్థాయి దేవాలయంగా అభివద్ధి చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. లోగడ ఒకసారి రామాలయ నిర్మాణానికి ప్రయత్నం కూడా జరిగింది. సంగీత, సాహిత్య, భక్తి కార్యక్రమాల నిర్వహణకు అనుగుణంగా సమావేశ మందిరాన్ని, అతిథులు, భక్తులు, కళాకారుల సౌకర్యం కోసం కొన్ని విశ్రాంతి గదులను నిర్మించాలని, ఒక చక్కని పార్కుని అభివద్ధి చేసి రామాయణ కథలకు, రామదాసు జీవిత విశేషాలకు సంబంధించిన విగ్రహాలను ఏర్పాటుచేయాలని, చిత్రకారులతో రామదాసు జీవిత విశేషాలను, కొన్ని కీర్తనలకు అనుగుణంగా వుండే చిత్రాలను వేయించి ప్రదర్శనశాలను ఏర్పాటుచేస్తే బాగుంటుందని గ్రామస్థుల అభిప్రాయం. వివిధ గ్రంథాలయాలలో నిక్షిప్తమై వున్న రామదాసు సాహిత్యాన్ని, గ్రంథాలను వ్యాసాలను సేకరించి ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటుచేస్తే బాగుంటుందని స్థానికుల అభిప్రాయం. ఈ సంవత్సరం చేస్తున్నట్లే ప్రతి సంవత్సరం మాఘశుద్ధ తదియ రోజు నుండి మూడు రోజులు రామదాసు జయంతి ఉత్సవాలు, వైశాఖ మాస ప్రారంభంలో మూడు రోజుల రామదాసు ఆరాధనోత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయి ఉత్సవాలుగా ఇపుడు నిర్వహిస్తున్నట్లే నిర్వహించాలి.
రామదాసు కీర్తనలను, భజనలు పాడేవారిని గుర్తించి వారిని ప్రోత్సహించాలి. సంగీత విద్వాంసులతో కొన్ని బందాలు ఏర్పాటుచేసి జిల్లా కేంద్రాలు, పట్టణాలు, గ్రామాలలో రామదాసు కీర్తనలను ప్రచారం చేయాలి. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏ విధంగానైతే అన్నమయ్యకు విశేష ప్రాధాన్యాన్ని కలిగిస్తున్నారో, తమిళ ప్రజలు త్యాగరాజుకు ఏ విధంగా బ్రహ్మరథం పడుతున్నారో, అలాగే తెలంగాణ ప్రజలు రామదాసుకు తగిన గుర్తింపు ఇస్తే గ్రామస్తులు సంతోషిస్తారు. నేలకొండపల్లిలోని శ్రీ భక్త రామదాస ధ్యాన మందిరాన్ని, బౌద్ధ స్థూపాన్ని కలిపి ఒక మంచి పర్యాటక స్థలంగా తీర్చిదిద్దితే మంచిది.
గ్రామస్థుల ఆలోచనలను అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాలమేరకు ప్రతి సంవత్సరం రామదాసు జయంతి ఉత్సవాలను మూడు రోజులపాటు అధికారికంగా నిర్వహించడానికి ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వ ఖర్చుతో చేయించిన రామదాసు శిలావిగ్రహ ప్రతిష్ఠ కూడా జరిగింది.
ముఖ్యమంత్రి ప్రత్యేక అభివద్ధి నిధినుండి రామదాసు ధ్యాన మందిరాన్ని ఆధునీకరించడానికి 3 కోట్ల రూపాయలు మంజూరు చేశారు కెసిఆర్‌గారు. నిధులు కూడా విడుదలయ్యాయి. భవిష్యత్తులో నేలకొండపల్లిలోని రామదాసు ధ్యాన మందిరం ఒక అపురూపమైన ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకోవడాన్ని మనం చూడాలని కోరుకుందాం.
రామదాసు మందిరం నుండి భద్రాచలానికి అలాగే భద్రాచలం నుండి యాదాద్రి వరకూ ప్రభుత్వం టూరిజం ప్యాకేజీ కింద రోడ్డు, బస్సు సౌకర్యాలు ఏర్పాటు చేస్తే రాష్ట్ర సర్కారుకు ఆదాయం కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే ఇక్కడి స్థానిక బీజేపీ నేతలు సైతం పూనుకుని కేంద్రం దృష్టికి తీసుకువచ్చి అ