స్వేచ్ఛాయుత లోకం

స్త్రీలు ఉద్యోగాలు చేయాలా వద్దా? ఈ రకమైన ప్రస్తావనలకి సైతం ఇప్పుడు తావులేదు. ‘ఉద్యోగం పురుష లక్షణం’ అన్న నానుడి పాతబడిపోయింది..ఇలాంటి ప్రశ్నలకీ, చర్చలకీ కాలం చెల్లి చానాళ్లయింది. ఇవాళ్టి మహిళ జీవితంలో ఉద్యోగం ఒక భాగమైంది. ఉద్యోగం చేయటం స్త్రీల లక్షణం, లక్ష్యంగా మారింది. కానీ ప్రేమ వివాహం మంచిదా లేక పెద్దలు కుదిర్చిన పెళ్లి మంచిదా? అన్న చర్చలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఇలా పెళ్లి దగ్గరికి రాగానే స్త్రీ స్వేచ్ఛ, స్వయం నిర్ణయాధికారాలకి అవరోధాలు ఏర్పడుతున్నాయి. చదువు, ఉద్యోగం విషయంలో అమ్మాయి స్వేచ్ఛని మన్నించే తల్లిదండ్రులు, పెళ్లి విషయానికి వచ్చేసరికి తమ మాటనే నెగ్గాలన్న రీతిన ఇంకా కొందరు వ్యవహరిస్తూనే ఉన్నారు. ఆర్థిక స్వాతంత్య్రం ఉన్నా తన జీవితాన్ని తనకు నచ్చిన రీతిన మలుచుకోలిగే స్థానంలో స్త్రీ ఇంకా నిలబడలేదనే చెప్పాలి. స్త్రీల జీవితంలో అతి పెద్ద మలుపు పెళ్లి. ఇలాంటి కీలక విషయంలో స్వయం నిర్ణయాధికారం లేకపోవడం స్త్రీల స్వేచ్ఛకి పెద్ద అవరోధం. ఈ పరిస్థితి ఎందుకు వుంది. అవలోకిస్తే కనిపించే కారణం అనేకం. ఈ కాలం ఆడవాళ్ళ జీవితంలో చదువులు, ఉద్యోగాలు అనివార్యమై కుటుంబం, ఆర్థిక భారం పంచుకోవడంలో ఒక భాగమైంది.

స్త్రీ జీవితంలో ఇది పెద్ద ముందడుగు. కానీ వివాహం విషయానికి వస్తే మాత్రం ఇంకా స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారంటూ ఈతరం యువతులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా తాము నిర్ణయం తీసుకొంటే తప్పేమిటని ప్రశ్నిస్తున్నారు. అయితే దాన్ని సమాజంలో ఇంకా కొంతమంది తప్పుపడుతూనే ఉంది. ఇవాళ సుదూర ప్రాంతాలకు వెళ్లి చదువుకొని ఉద్యోగాలు చేసే అమ్మాయిలు సైతం పెళ్లి దగ్గరికి వచ్చేసరికి స్వయం నిర్ణయాలకన్నా పెద్దల మాటకే చాలామంది కట్టుబడుతున్నారు. ధైర్యం చేసి వారి నిర్ణయాలను పెద్దలకు, తల్లిదండ్రులకు చెప్పే సాహసం చేయలేకపోతున్నారు చాలామంది యువతులు. కారణం తాము పెరిగిన కుటుంబ నేపథ్యం. కులం, ఆచారాలు, సంప్రదాయాలు స్త్రీలని వెనక్కి లాగుతున్నాయి.

చదువులో కెరీర్‌లో అత్యున్నత ప్రతిభను కనబరిచిన అమ్మాయి పెళ్లి విషయానికి వచ్చేసరికి తన మనస్సులోని అభిప్రాయాలను స్వేచ్ఛగా పెద్దల ముందుంచలేకపోతున్నారు. అంతే ఏదో ఒక లోపం తనలో వుంటుందనే ఆలోచన వారిలో రేకెత్తిస్తుంది. బాగా చదువుకున్న అమ్మాయిలు, మంచి ఉద్యోగం చేసేవారు డాక్టర్లయినా, సాఫ్ట్‌వేర్‌ నిపుణులయినా పెళ్లి విషయంలో అమ్మా నాన్నల నిర్ణయాలమీదే ఆధారపడుతున్నారు. కొన్నేళ్లుగా స్త్రీవాద భావజాలం, మహిళా ఉద్యమాల ప్రభావం స్త్రిలకి సంబంధించిన ఎన్నో అంశాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఈతరం స్త్రీలు అనేక ఉద్యమాల్లో పాల్గొంటున్నారు అయితే జీవితంలో అతి పెద్ద మలుపైన వివాహ విషయానికి వచ్చేసరికి మాత్రం ప్రేమను, భావాలను, నిర్ణయాలను ధైర్యంగా బయటకు వ్యక్తం చేయలేకపోతున్నారు. ఒకవేళ వ్యక్తం చేసినా కొందరు తల్లిదండ్రులు స్వాగతించలేకపోతున్నారు. దీనికి కులం, మతం, కట్టుబాట్లు, సంప్రదాయాలు అడ్డుపడుతున్నాయి. దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అంటారు. అలాగే మనిషికి ఉన్నది జీవితం ఒక్కటే కనుక ఆ జీవితాన్ని అభివద్ధి చెందిన ఈ ఆధునిక కాలంలో కట్టుబాట్ల పేరిట నరకం చేసుకోవడంలో అర్థం కనిపించదు. ‘స్వేచ్ఛ’ అనేది ఒకరిస్తే తీసుకునేది కాదు. కుటుంబ సభ్యుల కోసమో, సమాజం కోసమో కాకుండా తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకొనే విధంగా స్వేచ్ఛ వుండాలి. ఆ స్వేచ్ఛను కూడా పిల్లలకు తల్లిదండ్రులు ఇవ్వాలి. పెద్దలు కుదిర్చిన సంబంధమైనా, ప్రేమ పెళ్లయినా.. ఏదైనా సరే మనుషులు కలవాలి. మనుగడ అందంగా, ఆనందంగా సాగాలి. ఇప్పటి యాంత్రిక జీవితానికి ఆనందంగా గడిపే సమయం కూడా చాలా తక్కువే. ఉన్న సమయాన్ని ప్రేమ, అభిమానం, ఆప్యాయత, అనురాగం మధ్య హాయిగా జీవితాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా సుఖ సంతోషాలతో గడపాలి. జీవితాన్ని నందనవనంగా తీర్చిదిద్దుకోవాలి. ఇదంతా ఎప్పుడు సాధ్యం? తన మనసుకు నచ్చిన, మెచ్చిన రీతిలో స్వేచ్ఛగా వ్యవహరించే ఆత్మస్థైర్యం స్త్రీకి ఉన్నపుడే మనుగడ వుంటుంది.అందుకే ఓ మహిళా మేలుకో! ఓ అడుగు ముందుకేయ్‌!