అబలలకు అభయమేది?

తెలంగాణలో బెదురు పుట్టిస్తున్న వరుస అత్యాచార సంఘటనలు
  • -ఔటర్‌ పరిధిలో కొరవడిన పోలీసు నిఘా
  • -దాబాల వద్ద అందుబాటులో లిక్కర్‌
  • -మద్యం మత్తులో అత్యాచారాలకు పాల్పడుతున్న డ్రైవర్లు
  • -ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు అత్యాచారం
  • -నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లే మహిళలూ జరభద్రం
  • -తోడుగా అయినవారిని లేదా పోలీసు సహాయం అవసరం
  • -ఒంటరిగా ప్రయాణం చేసే మహిళలూ..అప్రమత్తం
  • -డయల్‌-100, 9490617111 నంబర్‌కు సమాచారం ఇవ్వాలి
  • -అందుబాటులో టోల్‌ ఫ్రీ నంబర్లు 112, 1090, 1091 నంబర్లు
  • -పోలీసులకు సమాచారం ఇస్తే చాలా మంచిది

హైదరాబాద్‌:
బిడ్డగా.. తోబుట్టువుగా, స్నేహితురాలిగా, భార్యగా, కోడలిగా, అమ్మగా.. ఓ స్త్రీ పాత్ర సమాజంలో వెలకట్టలేనిది. అలాంటిది కొందరు ఆడబిడ్డను పురిట్లోనే చంపేస్తున్నారు. ఒకవేళ తల్లిదండ్రులు తమ బిడ్డను ప్రేమగా పెంచుకొని కాపాడుతున్నా.. వయసొచ్చేనాటికి మానవ మగాలు వదలడం లేదు. వెరసి.. స్త్రీ సమాజంలో బతికేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నది..తెలంగాణ బంగారు తెలంగాణ ఎప్పుడవుతుందో తెలీదు కానీ ఆడపిల్లల ఉనికికి ఎలాంటి రక్షణ లేని తెలంగాణ మన కళ్లముందు సాక్షాత్కరిస్తూ తల్లిదండ్రులను, పిల్లలను భీతావహులను చేస్తోంది.
గత కొన్ని రోజులుగా అమ్మాయిలను ట్రాప్‌ చేసి మరీ అత్యాచారాలు చేస్తున్న, నిలువునా చంపేస్తున్న ఘటనలకు పరాకాష్ట ప్రియాంక రెడ్డి దారుణ హత్య. చెల్లెలుకు భయమేస్తోందని, రాత్రిపూట రోడ్డు మీద ఒంటరిగా ఉన్నానని స్కూటీ టైరు పంక్చర్‌ వేయించుకువస్తానని తీసుకెళ్లిన వాడు తిరిగి రాలేదని, టోల్‌ గేట్‌ వైపుకు వెళ్లుతుంటే పోవద్దని వెంటబడ్డారని విలపించిన ఆ స్వరం కొన్ని నిమిషాల్లోపే ఆగిన ఫోన్‌ స్విచ్చాఫ్‌ సాక్ష్యంగా శాశ్వతంగా మూగపోయింది.
‘చాలా భయంగా ఉంది. ఈ దెయ్యం మొహపోడు నా బండి ఇంకా తీసుకురాలేదు. ఇక్కడ అస్సలు నిలబడాలని లేదు. బైక్‌ వచ్చే వరకు కాసేపు మాట్లాడు’ అంటూ సోదరితో ఫోన్‌లో మాట్లాడిన పశువైద్యురాలు ప్రియాంకకు అవే ఆఖరు క్షణాలయ్యాయి. భయాందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ మండలం చటాన్‌పల్లి గ్రామ శివారులోని రోడ్దు బ్రిడ్జి కింద పూర్తిగా తగలబడిన స్థితిలో ప్రియాంకరెడ్డి మతదేహాన్ని గుర్తించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
పశువైద్యాధికారిగా విధులు నిర్వర్తిస్తున్న మహిళపై గుర్తుతెలియని దుండగులు హత్యాచారానికి పాల్పడ్డారు. టోల్‌బూత్‌కు 50 మీటర్ల దూరంలో.. లారీల మాటున ఆమెపై అత్యాచారం చేసి, చంపేసి.. అక్కణ్నుంచి 28 కిలోమీటర్ల దూరానికి ఆమె మతదేహాన్ని తీసుకెళ్లి, పెట్రోలు పోసి నిప్పంటించేశారు!! ఆస్పత్రికి వెళ్లి వస్తానన్న కుమార్తె.. మ తదేహమై కనిపించడంతో ఆమె తల్లిదండ్రులు కంటికీమంటికీ ఏకధాటిగా విలపిస్తున్నారు!!
శంషాబాద్‌కు చెందిన డాక్టర్‌ పి.ప్రియాంక రెడ్డి(26).. మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేట మండలం కొల్లూర్‌ గ్రామంలో పశు వైద్యాధికారిగా పనిచేస్తున్నారు. తన తల్లి విజయమ్మ, చెల్లెలు భవ్యతో కలిసి కొన్నేళ్లుగా శంషాబాద్‌లో ఉంటున్న ప్రియాంక.. రోజూ విధుల నిమిత్తం కొల్లూర్‌కు వెళ్లివస్తున్నారు. గచ్చిబౌలిలోని ఒక చర్మవ్యాధి నిపుణుడి వద్ద లేజర్‌ చికిత్స తీసుకుంటున్న ప్రియాంక.. బుధవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో ఇంటి నుంచి బయల్దేరి శంషాబాద్‌ పక్కన ఉన్న తొండుపల్లి గ్రామంలో మోపెడ్‌ని పార్క్‌ చేసి, క్యాబ్‌లో ఆస్పత్రికి వెళ్లారు. నిజానికి, ఇలా వెళ్లిన ప్రతిసారీ ఆమె తన మోపెడ్‌ని టోల్‌గేటు వద్ద పెట్టేవారు.
కానీ, బుధవారం అక్కడ ఉన్న టోల్‌గేట్‌ సిబ్బంది అందుకు అభ్యంతరం చెప్పారు. అక్కడ పార్క్‌ చేసిన వాహనాలను పోలీసులు తీసుకెళ్లిపోతున్నారని చెప్పడంతో.. ఆమె అక్కడికి సమీపంలో లారీలు పార్క్‌ చేసే చోట తన మోపెడ్‌ని పెట్టి, క్యాబ్‌లో ఆస్పత్రికి వెళ్లారు. చికిత్స అనంతరం రాత్రి 9.15 గంటలకు అక్కడికి తిరిగివచ్చి మోపెడ్‌ని తీయగా.. టైర్‌ పంక్చరై కనిపించింది. ఆ సమయంలో అక్కడ ఉన్న కొందరు లారీ డ్రైవర్లు ప్రియాంక వద్దకు వెళ్లి.. పంక్చర్‌ వేయిస్తామని చెప్పి ఆమె మోపెడ్‌ని తమ క్లీనర్‌కు ఇచ్చి పంపించారు. కొద్దిసేపటి తర్వాత వచ్చిన క్లీనర్‌.. పంక్చర్‌ దుకాణాలు లేవని చెప్పాడు.
లారీ డ్రైవర్ల వ్యవహార శైలి అనుమానంగా ఉండడంతో భయపడిన ప్రియాంక.. తన చెల్లెలు భవ్యకు ఫోన్‌ చేసి మోపెడ్‌ పంక్చర్‌ అయిందని చెప్పడంతో పాటు లారీ డ్రైవర్ల వ్యవహారం అనుమానంగా ఉందని, వాళ్లను చూస్తే భయమేస్తోందని చెప్పారు. మోపెడ్‌ని అక్కడే పెట్టి టోల్‌ప్లాజా వద్దకు వెళ్లి నిలబడాలని భవ్య సలహా ఇచ్చినా వెళ్లలేదు. తర్వాత కొద్దిసేపటికి భవ్య తన సోదరి ప్రియాంకకు ఫోన్‌ చేయగా.. అది స్విచాఫ్‌ అయిపోయింది. దీంతో ఆందోళనకు గురైన భవ్య.. తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. రాత్రి 10 గంటల తరువాత శంషాబాద్‌ ఆర్‌జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
టోల్‌గేటు వద్ద దొరికిన ఆనవాళ్లను బట్టి దుండగులు మద్యం సేవించినట్లు స్పష్టమైంది. టోల్‌బూత్‌కు 50 మీటర్ల దూరంలో.. ప్రియాంక లోదుస్తులు, చిరిగిన పైదుస్తులు కనిపించాయి. దీంతో.. ఆమెను కంటెయినర్‌ లారీ పక్కకు లాక్కెళ్లి అత్యాచారం చేసి, చంపేశారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అక్కడ వాహనాల రద్దీ ఉండడంతో ఆమె కేకలు వేసినా కూడా వినిపించడం కష్టం. అసలు.. ఆ లారీ డ్రైవర్లే మోపెడ్‌కి కావాలని పంక్చర్‌ చేశారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
పుట్టినరోజు కలుద్దాం అంటూ ఇంటి బయటకు పిలిపించుకున్న స్నేహితురాలిని కారులోనే అత్యాచారం జరిపి చంపేసిన ప్రబుద్ధుడు, అమ్మాయిపై అత్యాచారం జరిపి తలను, మొండేన్ని వేరు చేసి పడేసిన కీచకులు, ఆర్టీసీ బస్సులతో, టిప్పర్‌లతో గుద్ది చంపుతున్న ముష్కరులు వీరందరూ చేసిన ఘోరం కన్నా ఘోరాతిఘోరమైనది ప్రియాంక రెడ్డి సజీవ దహనం ఘటన. నిందితులు దొరికితే ఉరితీయాలన్నంత కోపాన్ని ఆమె కుటుంబంతో బాటు యావత్‌ తెలంగాణ సమాజం ఒక్క గొంతుతో నినదిస్తోంది. ఇలా నిందితులను మట్టుబెట్టడం సరైంది కాదని అంతరాత్మ చెబుతున్నా సమాజం సామూహికంగా విషాదాన్ని ఫీలవుతున్న చోట ఎలాంటి లాజిక్కులూ పనిచేయవు.
తెలంగాణ బంగారు తెలంగాణగా కాదు… అత్యాచారాల, హత్యల, సజీవదహనాల తెలంగాణగా తయారవుతోందన్న దానికి తాజా సాక్షం ప్రియాంకరెడ్డి ఘటన. విలపిద్దాం.. వ్యక్తులుగా కాదు. సమూహంగా.. సామూహిక గీతమై విలపిద్దాం. బతికే అర్హత లేని పందులు మొర విడుచుకుని తిరుగుతున్న చోట ఏమీ చేయలేకపోయినా ఒక ఘోర దురంతం పట్ల కాస్త సానుభూతిని ప్రదర్శిద్దాం.
వెటర్నరీ వైద్యురాలు ప్రియాంక దారుణహత్య ఘటన నేపథ్యంలో డీజీపీ మహేందర్‌ రెడ్డి పలు సూచనలు చేశారు. రాత్రివేళ ప్రయాణాల్లో మహిళలు, వద్ధులు తమ వాహనాలు చెడిపోయినప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. రాత్రివేళల్లో ముప్పు పొంచివుందనుకున్నప్పుడు డయల్‌-100, 9490617111 నంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా షీ టీమ్స్‌ వాట్సాప్‌ నంబర్లు ట్వీట్‌ చేశారు. రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ కూడా ఇవే సూచనలు చేశారు. ప్రమాదంలో ఉన్న మహిళలు డయల్‌-100కు సమాచారం అందించవచ్చు. షీ టీమ్స్‌ ల్యాండ్‌ లైన్‌ నంబరు 040-2785 2355, వాట్సాప్‌ నంబరు 9490616555కు సమాచారం ఇచ్చినా వారు వెంటనే సాయం అందిస్తారు. టోల్‌ ఫ్రీ నంబర్లు 112, 1090, 1091 నంబర్లకు కూడా అత్యవసర సమయంలో ఫోన్‌ చేసి సాయం కోరవచ్చు.
సాంకేతిక ముసుగులో వశం తప్పిన మనసు అశ్లీలత నిండిన వయసు, వ్యసనాలకు బానిసై, ఆలోచన కోల్పోయి తొమ్మిది నెలలు నిండని పసివారిని మొదలు తొంభై సంవత్సరాలు నిండిన ముసలివారిని సైతం వదలని మానసికరోగిగా ప్రవర్తిస్తున్నారు. ఆడపిల్లలకు రక్షణ కల్పించలేని చట్టాలు. మ గాళ్ల మత్యుకేళిని అడ్డుకోలేకపోతున్నాయి. ఈ రాక్షసత్వానికి చరమగీతం పాడాలంటే పసిహ దయాల ఆర్తనాదాలు హాహాకారాలు ఆగాలంటే చట్టాలు సవరించాల్సిందే. కఠిన శిక్షలు అమలు కావాల్సిందేనన్నది నేటి సమాజ నినాదం. రేపటి జగతి నడక తీరు సవ్యంగా సాగాలంటే తప్పు చేసినవారిని ఆలస్యం చేయకుండా వెంటనే దండించాలన్నది అందరి అభిప్రాయం.
పసిపిల్లలకో, పండు ముదుసలికో కాదు.. అత్యంత భద్రమైన అమ్మ కడుపులోని ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది. ఒకవేళ ఈ లోకంలోకి వచ్చినా ఎదురింటి అంకుల్‌ గానో, ఇంటి పక్కన అన్నగానో, ఇంట్లో తాతలానో..లోకం తెలియని పసిపిల్లలను ఎంగిలి పడుతున్నారు. భరతమాత ఒంటిపై భరించలేని గాయాలు చేస్తున్నారు. చాక్లెట్‌ కొనిపెడతానంటూ ఒకడు, ఆడిస్తానంటూ ఒకడు, చదువు చెప్తానంటూ ఒకడు, కుటుంబ కక్షలతో ..ఆఫీసుల్లో, పార్కులో, రెస్టారెంట్స్‌లో, బస్టాండ్స్‌లో మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు కామాంధులు. కఠిన చట్టాలు, నిందితులపై చర్యలు కేవలం కంటి తుడుపు చర్యలుగా మిగిలిపోతున్నాయి. ఎందుకు ఈ బాధ్యతా రాహిత్యం, ఎందుకింత ఉన్మాదం..ఊపిరి పోసే మహిళా జాతిపై ఏమిటీ ఆటవిక పర్వం. పుట్టినప్పటి నుంచి ఆడపిల్లలకు ఎన్నో కష్టాలు. జాతి నిర్మాణానికి ‘ఆమె’ మూలకారణం. అటువంటి మహిళలకు ఎందుకీ కష్టాలు.
ప్రేమించపోతే యాసిడ్‌ పోస్తారా..? అర్థరాత్రి ఒంటరిగా కనిపిస్తే మానాలు తీసేస్తారా..?. అమ్మ పాలు తాగే కదా పెరిగింది. మరి ఎందుకింత ఉన్మాదం. ఎంత క్రూరత్వం కాకపోతే అత్యాచారం చేసి, హతమార్చి కిరోసిన్‌ పోసి తగలబెడతారు. ఒక ప్రియాంక రెడ్డి ఘటనే కాదు, రోజు నిత్యం ఏదో ఒక మూలన ఇలాంటివి పునారావ తం అవుతూనే ఉన్నాయి. ప్రభుత్వాల మీద నింద వేసేస్తే సరిపోదు. జనాల ఆలోచనా ధోరణి మారాలి. ప్రతి ఇంట్లో ఆడాళ్లు ఉంటారు. మనవాళ్లకి కూడా ఇలాంటి సందర్భాలు ఎదురవుతూనే ఉంటాయి. మార్పు ప్రతి మనిషిలో మొదలవ్వాలి. ప్రియాంక రెడ్డిది తప్పు, వాళ్ల పేరెంట్స్‌ తప్పు.. అసలు జడ్జ్‌ చెయ్యడానికి మనం ఎవరం. అక్కడ తను మాత్రమే ఉంది. ఆ సందర్భాన్ని తను మాత్రమే ఫేస్‌ చేసింది. ఒకవేళ పోలీసులకు కాల్‌ చేసినా..వాళ్లు వచ్చే వరకు ఆ అమ్మాయిని అక్కడే ఉండనిస్తారా..?. ఉన్మాదులకు ఎలా అడ్డుకట్ట వెయ్యాలా అని ఆలోచించాల్సింది పోయి..చనిపోయి, సంజాయిషీ ఇచ్చుకోలేని ఆడకూతురుపై పడి ఏడ్వడం ఎంతవరకు సమంజసం. సమాజంలోని ప్రతి వ్యక్తి ..ఆడపిల్లలను చూసే ధ క్కోణం మారాలి. కులాలకు, మతాలకు, తత్వాలకు వ్యతిరేకంగా తప్పు చేసినవారికి శిక్ష పడాలని దేశం మొత్తం ఏకమై నినదించాలి. పాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల ద్వారా సత్వరమే శిక్షలు ఖరారు చెయ్యడమే కాదు వాటిని మరింత కఠినతరం చెయ్యాలి.