కార్టూనిస్టులకు పనికల్పిస్తున్నారు

రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

ముంబయి: ప్రతి దేశం తలుపు తట్టి పాక్‌ ప్రధానమంత్రి సాధించింది ఏమీ లేదని.. కేవలం కార్టూనిస్టులకు పని కల్పిస్తున్నారని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. స్కార్పీన్‌ శ్రేణికి చెందిన అత్యాధునిక జలాంతర్గామి ఖండేరీ, ఐఎన్‌ఎస్‌ నీలగిరి యుద్ధనౌకని రాజ్‌నాథ్‌ సమక్షంలో శనివారం నావికాదళంలో చేర్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాక్‌ కుట్రలను దీటుగా తిప్పికొట్టేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని చెప్పారు. భారత తీరప్రాంతాల్లో ముంబయి తరహా దాడులు జరిపేందుకు దాయాది దేశం ప్రయత్నిస్తోందన్నారు. వారి కుట్రల్ని భారత సైన్యం భగ్నం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఖండేరీ చేరికతో భారత నావికాదళం మరింత బలోపేతం అయ్యిందని పాక్‌ను హెచ్చరించారు. భారత త్రివిధ దళాలను మరింత పటిష్ఠం చేసేందుకు నిరంతరం కషి చేస్తూనే ఉంటామన్నారు. ప్రాంతీయంగా శాంతికి భగ్నం కలిగిస్తున్న శక్తుల్ని నావికాదళం నిర్వీర్యం చేస్తుందని హెచ్చరించారు.
సొంతంగా జలాంతర్గాముల్ని తయారు చేసుకొనే సత్తా ఉన్న కొన్ని దేశాల్లో భారత్‌ ఒకటని ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ గుర్తుచేశారు. నావికాదళ సామర్థ్యాన్ని మరింత పెంచుకొనే చర్యల్లో భాగంగా ఆరు స్కార్పీన్‌ శ్రేణి జలాంతర్గాముల్ని చేర్చేందుకు భారత్‌ సిద్ధమైంది. 2017 డిసెంబర్‌లో ప్రవేశపెట్టిన ఐఎన్‌ఎస్‌ కల్వరీ మొదటిది కాగా, తాజాగా చేరిన ఖండేరీ రెండోది. ఫ్రాన్స్‌కు చెందిన నావల్‌ గ్రూప్‌ ఖండేరీ ఆకతిని రూపొందించగా.. తయారీ మాత్రం భారత్‌లోనే చేపట్టారు.