ఇమ్రాన్‌పై కేసు నమోదు

యుఎన్‌ఓ సమావేశాలలో అభ్యంతర వ్యాఖ్యలపై బీహార్‌ కోర్టులో పిటిషన్‌

పాట్నా : పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై బీహార్‌లోని ముజఫర్‌పూర్‌ కోర్టులో శనివారం కేసు నమోదైంది. ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ సమావేశాల్లో ఇమ్రాన్‌ ఖాన్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ముజఫర్‌పూర్‌ చీఫ్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో న్యాయవాది సుధీర్‌ కుమార్‌ ఓజా కేసు నమోదు చేశారు. ఇమ్రాన్‌ తన ప్రసంగంలో భారత్‌పై అణుయుద్ధం దిశగా బెదిరింపు వ్యాఖ్యలు చేశారని తన ఫిర్యాదులో ఓజా పేర్కొన్నారు. తన ఫిర్యాదు ఆధారంగా ఇమ్రాన్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు. జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో దేశంలో మత సామరస్యం దెబ్బతినేలా పాక్‌ ప్రధాని వ్యాఖ్యానించారని తన పిటిషన్‌లో ఓజా ప్రస్తావించారు. మరోవైపు ఇమ్రాన్‌ ప్రసంగంపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాక్‌ అంతర్జాతీయ వేదికపై కశ్మీర్‌లో పరిస్ధితులపై మొసలి కన్నీరు కారుస్తోందని దుయ్యబట్టింది. ఐరాస ప్రసంగంలో భాగంగా ఇమ్రాన్‌ వ్యాఖ్యలను భారత నేతలు తీవ్రంగా తప్పుపట్టారు.