పెదవి విరిచిన ప్రతిపక్షం

కేసీఆర్‌ బడ్జెట్‌పై విమర్శలు గుప్పించిన విపక్షాలు

హైదరాబాద్‌:
ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం ఉదయం అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. అయితే ఆయన బడ్జెట్‌పై తెలంగాణ కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్మన్‌ విజయశాంతి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేసీఆర్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వాస్తవాలు కనిపించడం లేవని ఎద్దేవా చేశారు. పేదలకు ఆపన్నహస్తం అందించడంలో కేసీఆర్‌ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
”చంద్రయాన్‌-2లో ల్యాండర్‌ విక్రమ్‌ జాడను కనుక్కోవచ్చేమో గానీ, కెసిఆర్‌.. తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో కేటాయింపులకు సంబంధించిన వాస్తవాలను కనుక్కోవడం ఎవరి తరం కాదేమో అన్న అనుమానం కలుగుతోంది. గత ఏడాది కూడా లక్షన్నర కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్‌ను టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటికీ.. అక్షరాస్యత కల్పించడంలో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ అట్టడుగులో ఉందని సర్వేలో తేలింది. తెలంగాణలోని పేదలకు వైద్యం అందించే విషయంలో కూడా టిఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అందరూ చూశారు. విష జ్వరాలు విజ ంభిస్తున్నా ప్రభుత్వ ఆసుపత్రులలో కనీస సదుపాయాలు లేకపోవడం.. ఆరోగ్యశ్రీ బిల్లులను పెండింగ్‌లో పెట్టడం వంటి నిర్లక్ష్య ధోరణితో.. పేద రోగుల జీవితాలతో ఏ రకంగా ఆడుకున్నారో అందరికీ అర్థం అయింది. చివరకు రైతులకు యూరియా అందించే విషయంలో కూడా కెసిఆర్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది.

ఇలా విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు గత బడ్జెట్‌లో పెద్దపీట వేశామని ప్రగల్బాలు పలికిన కేసీఆర్‌ ప్రభుత్వం.. ప్రధాన రంగాలను ఏ రకంగా గాలికి వదిలేసిందనే విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించారు. మరి, ఈ కీలక రంగాలకు కేటాయించిన బడ్జెట్‌ నిధులు ఏమయ్యాయి? అనే ప్రశ్నకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. గత బడ్జెట్‌ లెక్కలు తేలకముందే.. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్‌ గారు కొత్త బడ్జెట్‌ పేరుతో గారడికి సిద్ధమయ్యారు. కెసిఆర్‌ గారి లెక్క, పద్దుల విషయం ఏమోగానీ.. గత బడ్జెట్‌లో కేటాయించిన నిధుల వినియోగంలో జరిగిన అవకతవకలపై లెక్క తేల్చేందుకు బీజేపీ నేతలు సిద్ధమయ్యారని వారి ప్రకటనల ద్వారా అర్ధం అవుతోంది. మరి ఎవరి లెక్క ముందు తేలుతుందో వేచి చూడాలి” అని తన ఫేస్‌బుక్‌ అధికారిక ఖాతాలో రాసుకొచ్చారు.
వైఫల్యాలకు నిదర్శనం: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలకు సీఎం కేసీఆర్‌ సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ నిదర్శనమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌ తన వైఫల్యాలను కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రుణమాఫీపై బడ్జెట్‌లో స్పష్టత ఇవ్వలేదని ఆరోపించారు. ఉపాధి కల్పన, నిరుద్యోగ భ తిపై బడ్జెట్‌లో ప్రస్తావించ లేదన్నారు. ఆరోగ్యశ్రీ అమలుచేస్తూ ఆయుష్మాన్‌ నిధులను తీసుకోవాలని జీవన్‌రెడ్డి ప్రభుత్వానికి సూచించారు.
వాస్తవానికి దూరం: మల్లు భట్టి విక్రమార్క
టీఆర్‌ఎస్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ వాస్తవానికి దూరంగా ఉందని, అవగాహన లోపం, ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వల్లే ఇలా జరిగిందని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఈ బడ్జెట్‌లో ఏమీ లేదని, ప్రభుత్వం చేతులెత్తేసిన బడ్జెట్‌లా ఉందని విమర్శించారు. ఆరు నెలల కోసం అవసరం లేకపోయినా ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టారని, ఆ తర్వాత ఆరు నెలల బడ్జెట్‌ ప్రవేశపెట్టి చేతులు దులుపుకున్నారని ధ్వజమెత్తారు.
గత ప్రభుత్వ మిగులు బడ్జెట్‌ ఫలాలు ఐదేళ్ల వరకూ సాగాయని, ఇప్పుడు ఈ ప్రభుత్వ వాస్తవ ఫలితాలు కనిపిస్తున్నాయని అన్నారు. అందుకే కోతలు పెడుతున్నారని, బడ్జెట్‌లో నిరుద్యోగ భతి, మూడెకరాల ఊసూ లేదని, డబుల్‌ బెడ్రూం, ఊసు అసలే లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీపాద, ఎల్లంపల్లితో హైదరాబాద్‌కు నీళ్లు తెచ్చింది కాంగ్రెస్‌ అని, కానీ కేసీఆర్‌ గొప్పతనంగా చెప్పుకుంటున్నారని మల్లు మండిపడ్డారు. కాళేశ్వరం ప్యాకేజీలు కాంగ్రెస్‌ నిర్మిస్తే, జలకళ అని టీఆర్‌ఎస్‌ ప్రచారం చేసుకుంటోందని భట్టివిక్రమార్క ఆరోపించారు.
కోతల బడ్జెట్‌: ఎమ్మెల్యే సీతక్క
ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోతల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించారు. దేశంలోనే అగ్రశ్రేణి రాష్ట్ర్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్‌ ఆర్థిక మాంద్యం దిశగా తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వాలు మిగిల్చిన సంపదను ఆయన విచ్చలవిడిగా ఖర్చు చేశారని ఆరోపించారు. కేసీఆర్‌ పరిపాలన తీరుతోనే ఆర్థిక మాంద్యం వచ్చిందన్నారు. దాన్ని కేంద్రం మీదకు రుద్దుతున్నారని తూర్పారబట్టారు.
ఇందిరమ్మ ఇళ్లను డబ్బా ఇళ్లు అని ముఖ్యమంత్రి విమర్శించారని..ఆయన ఎంతమందికి డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు కట్టించారో సమాధానం చెప్పాలని సీతక్క డిమాండ్‌ చేశారు. బడ్జెట్లో కేటాయింపులు అద్భుతం గా ఉన్నాయని.. కాని చేతలు బాగోలేవన్నారు. ఉన్న నిధులన్నీ ఖర్చుపెట్టి..నేడు భూములు అమ్ముతానంటూ ప్రజలను మోసం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఖజానా ఖాళీ అయితే నూతన సచివాలయం, అసెంబ్లీ భవనాలెందుకని ప్రశ్నించారు. ఒక్క కొత్త గురుకుల భవనం కూడా కేటాయించాలేదని మండిపడ్డారు. ప్రజలు డెంగీ,మలేరియాతో బాధపడుతుంటే ఆసుపత్రులకు బడ్జెట్‌ కూడా పెంచలేదని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.