తెలంగాణలో బలపడదాం

టీ.టీడీపీ నేతలకు చంద్రబాబు పిలుపు

హైదరాబాద్‌: తెలంగాణలో తెదేపాను మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. తెలంగాణలో నూతన నాయకత్వం తయారవ్వాలన్నారు. తెదేపా ఆవిర్భవించింది హైదరాబాద్‌లోనేనని, అందుకే పార్టీకి ఇక్కడ పునర్‌ వైభవం తీసుకురావాలని సూచించారు. హైదరాబాద్‌ విచ్చేసిన ఆయన ఎన్టీఆర్‌ భవన్‌లో పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో శనివారం భేటీ అయ్యారు. తాజా రాజకీయాలు, తెలంగాణలో పార్టీ బలోపేతం వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కొందరు నాయకులు స్వార్థం కోసం పార్టీని వీడారని చంద్రబాబు అన్నారు. ఒక నాయకుడు పోతే వంద మందిని తయారు చేసుకునే శక్తి తెదేపాకు ఉందన్నారు. తెదేపా కార్యకర్తలను అణగదొక్కాలని చూసినా ఎదురొడ్డి నిలిచారని గుర్తుచేశారు. మెచ్చా నాగేశ్వరరావు వంటి నేతలు మనకు కావాలని చంద్రబాబు అన్నారు. ఎంతగా ప్రలోభపెట్టినా తెదేపాను వీడేది లేదని మెచ్చా నాగేశ్వరరావు చెప్పారని వివరించారు. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే పార్టీ మళ్లీ బలపడుతుందన్న నమ్మకం తనకుందని విశ్వాసం వ్యక్తంచేశారు.