వాయుసేనలో నారీ భేరి

తొలి మహిళా ఫ్లయిట్‌ కమాండర్‌గా షలీజా 

న్యూఢిల్లీ: అన్ని రంగాల్లో సత్తా చాటుతున్న మహిళామణులు త్రివిధ దళాల్లోనూ తమకు తిరుగులేదని నిరూపించుకుంటున్నారు. తాజాగా వింగ్‌ కమాండర్‌ షలీజా ధామీ భారత వాయుసేనలో ఫ్లయింగ్‌ యూనిట్‌ ఫ్లయిట్‌ కమాండర్‌ హోదా సంపాదించారు. ఈ బాధ్యతలు స్వీకరించనున్న తొలి మహిళా కమాండర్‌గా ఆమె ఖ్యాతిని ఆర్జించారు. హెలికాప్టర్లను నడపడంలో 15ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన ధామీ.. తొలి మహిళా ఫ్లయింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌, శాశ్వత ప్రాతిపదికన ఎయిర్‌ఫోర్స్‌ ఫ్లయింగ్‌ విభాగంలో చేరిన తొలి మహిళగా కూడా రికార్డుల్లోకెక్కారు. షలీజా ధామీ 2003లో హైదరాబాద్‌లోనే శిక్షణ పొందడం విశేషం. పంజాబ్‌లోని లూధియానాలో జన్మించిన షలీజా ధామీ చిన్నప్పటి నుంచే పైలెట్‌ కావాలని కలలుగన్నారు. అనుకున్నట్లుగానే పట్టుదలతో చదివి ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం సంపాదించారు. వైమానిక దళంలోని చెతక్‌, చీతా హెలికాప్టర్లలో ఇన్‌స్ట్రక్టర్‌గా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆమెకు ఓ ఏడేళ్ల బిడ్డ కూడా ఉంది. 1994లో మహిళలను మొదటిసారి ఐఏఎఫ్‌లోకి అనుమతించారు. పురుషులతో సమానంగా గుర్తింపు పొందడానికి, శాశ్వత కమిషన్‌ కోసం మహిళా అధికారులు దిల్లీ హైకోర్టులో సుదీర్ఘ కాలం పోరాడి విజయం సాధించారు.