చిదంబరానికి చుక్కెదురు

ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేసిన ధర్మాసనం 

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ ఆర్ధికమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి. చిదంబరానికి సోమవారం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ముందస్తు బెయిల్‌ రద్దు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత ధర్మాసనం కొట్టేసింది. చిదంబరం వేసిన పిటిషన్‌ నిష్ప్రయోజనమైనదని జస్టిస్‌ ఆర్‌ భానుమతి, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్నలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. రెగ్యులర్‌ బెయిల్‌ కోసం చిదంబరం దరఖాస్తు చేసుకోవాలంటూ సూచించింది. చిదంబరం ఐదురోజుల సీబీఐ కస్టడీ నేటితో ముగియనున్న నేపథ్యంలోనే తాజా తీర్పు వెలువడింది. ఈ నెల 22 నుంచి ఆయన సీబీఐ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. 
కాగా సుప్రీంకోర్టులో ఇవాళ చిదంబరానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ కస్టడీని సవాల్‌ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణకు స్వీకరించలేదు. ”చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతే” ఈ పిటిషన్‌పై విచారణ చేపడతామని చిదంబరం తరపు న్యాయవాది కపిల్‌ సిబల్‌కు ఓ ధర్మాసనం పేర్కొన్నట్టు తెలుస్తోంది. 
ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణం కేసులో అరెస్టయిన కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఇప్పటికే చిదంబరాన్ని సీబీఐ అధికారులు అరెస్టు చేసినందున ఈ పిటిషన్‌ చెల్లదని కోర్టు వెల్లడించింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణం కేసులో చిదంబరం దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు గతవారం తోసిపుచ్చింది. ఈ కుంభకోణం మొత్తానికి చిదంబరమే ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు అర్థమవుతోందని హైకోర్టు అభిప్రాయపడింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ చిదంబరం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ పిటిషన్‌పై తక్షణ విచారణ జరిపేందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. దీంతో గత బుధవారం సీబీఐ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. అయితే అరెస్టు కంటే ముందే తాము ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశామని, అందువల్ల దానిపై విచారణ జరపాలని చిదంబరం తరఫు న్యాయవాది నేడు కోర్టుకు తెలిపారు. దీనికి ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. చిదంబరం అరెస్టైనందున ఇప్పుడు ఆ పిటిషన్‌కు అర్హత లేదని పేర్కొంది. మరోవైపు సీబీఐ అరెస్టును సవాల్‌ చేస్తూ చిదంబరం సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ప్రస్తుతం ఆయన సీబీఐ కస్టడీలో ఉన్నందున కస్టడీ వ్యవహారంపై జోక్యం చేసుకోబోమని గతవారం న్యాయస్థానం స్పష్టం చేసింది. నేటితో ఆయన కస్టడీ ముగియనుంది. దీంతో అరెస్టు తర్వాత దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై నేడు విచారణ జరగాల్సి ఉండగా.. అది ఇంకా లిస్ట్‌ కాలేదని ధర్మాసనం వెల్లడించింది.