నెరవేరిన పంతం
మాజీ హోం వెర్సెస్ ప్రస్తుత హోం
నాడు అమిత్‌షా జైలుకు..నేడు చిదంబరం జైలుకు
హైదరాబాద్:
ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి చిదంబరాన్ని సీబీఐ, ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు, సుప్రీం కోర్టు నిరాకరించడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. బుధవారం రాత్రి ఏఐసీసీ ఆఫీసులో ప్రత్యక్షమైన చిదంబరం.. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో తాను దోషిని కాదన్నారు. ఏఐసీసీ ఆఫీసుకి సీబీఐ, ఈడీ అధికారులు చేరుకునే లోపే ఆయన అక్కడి నుంచి వెళ్లిపోవడంతో… చిదంబరం నివాసానికి వెళ్లిన దర్యాప్తు అధికారులు గోడ దూకి మరీ ఆయన్ను అరెస్ట్ చేశారు. యూపీఏ అధికారంలో ఉన్న పదేళ్లపాటు చిదంబరం ఓ వెలుగు వెలిగారు. హోం మంత్రిగా, ఆర్థిక మంత్రిగా కీలక బాధ్యతలను నిర్వర్తించారు. 2005లో అప్పటి గుజరాత్ మంత్రి, ప్రస్తుత కేంద్ర హోం మంత్రి అమిత్ షాను సోహ్రాబుద్దీన్ షేక్ ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులు విచారించారు. సోహ్రాబుద్దీన్‌పై 60 కేసులు పెండింగ్‌లో ఉండేవి. పోలీసు కస్టడీలో ఉన్న అతడు హత్యకు గురయ్యాడు.
అప్పుడు గుజరాత్ హోం మంత్రిగా ఉన్న అమిత్ షా అనుమతితోనే సోహ్రాబుద్దీన్‌ను ఎన్‌కౌంటర్ చేశారని ఆరోపణలు వచ్చాయి. సుప్రీం ఆదేశాలతో ఈ కేసును 2010 జనవరిలో సీబీఐకి బదిలీ చేశారు. ఆరు నెలల తర్వాత.. అంటే జూలై 2010లో సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసులో సీబీఐ అమిత్ షాను అరెస్ట్ చేసింది. అప్పట్లో చిదంబరం కేంద్ర హోం మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు చిదంబరానికి ఢిల్లీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ కోరినట్టుగానే.. అప్పట్లో అమిత్ షాకు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ గుజరాత్ హైకోర్టును కోరింది. రాజకీయ బలంతో అమిత్ షా సాక్షులను భయపెట్టి ఆధారాలు లేకుండా చేసే ప్రమాదం ఉందని సీబీఐ ఆందోళన వ్యక్తం చేసింది.
మూడు నెలల తర్వాత 2010 అక్టోబర్ 29న అమిత్ షాకి గుజరాత్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరుసటి రోజే కోర్టు వారంతాపు సెలవు రాగా.. సీబీఐ జస్టిస్ అఫ్తాబ్ ఆలమ్‌ను ఆశ్రయించింది. అమిత్ షా 2010 నుంచి 2012 వరకు గుజరాత్‌లో అడుగు పెట్టకుండా బహిష్కరిస్తూ ఆయన ఆదేశాలు జారీ చేశారు.
హోం మంత్రి చిదంబరం, కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని, రాజకీయ ప్రత్యర్థులపై దాడుల కోసం సీబీఐని దుర్వినియోగం చేస్తోందని అప్పట్లో అమిత్ షా ఆరోపించారు. 2014లో కేంద్రంలో మోదీ సర్కారు అధికారంలోకి వచ్చింది. అదే ఏడాది డిసెంబర్లో అమిత్ షాకు కేసుల నుంచి ఉపశమనం లభించింది. అమిత్ షా నిర్దోషి అని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన్ను హింసించిందని బీజేపీ ఆరోపించింది. ఇప్పుడు సేమ్ టు సేమ్ ఇవే తరహా ఆరోపణలను కాంగ్రెస్, చిదంబరం చేస్తుండటం గమనార్హం.
నగరానికి నేడు అమిత్‌షా రాక
కేంద్ర హోంమంత్రి,బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేడు రాష్ట్రానికి రానున్నారు. ఉదయం హైదరాబాద్‌లో పోలీస్ పాసింగ్ ఔట్ పరేడ్‌లో ఆయన పాల్గొననున్నారు. అయితే, ఈ కార్యక్రమం అనంతరం బీజేపీ కార్యాలయానికి రావాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. అమిత్ షా రాకసందర్భంగా పలువురు ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు రాష్ట్రంలో బీజేపీ లేదంటున్న వారు పార్లమెంట్ ఎన్నికల్లో కవిత ఎలా ఓడిపోయారో తెలుసుకోవాలని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి.కిషన్ రెడ్డి కామెంట్ చేశారు. గతంలో కంటే బీజేపీ చాలా బలంగా ఉందని, లోక్ సభ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనం అంటున్నారు బీజేపీ నేతలు.
కర్నాటక తర్వాత తెలంగాణే తమ లక్ష్యమని బీజేపీ నేతలు చెబుతున్నారు. 2023లో రాష్ట్రంలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా తమ పార్టీ కార్యకలాపాలు ఉంటాయని చెప్తున్న బీజేపీ.. అందుకు అనుగుణంగా పావులు కదుపుతోంది.
గత నెల 6న పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించగా, మూడు రోజుల క్రితం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా పార్టీ తెలంగాణ టీడీపీ నేతల చేరిక కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రతి నెలా బీజేపీ జాతీయ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్‌లో ఎవరో ఒకరు తెలంగాణలో పర్యటిస్తూ క్యాడర్ ని పటిష్టం చేస్తున్నారు.
బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ తో బీజేపీలో చేరికలతో టీటీడీపీ దాదాపుగా క్లీన్‌స్వీప్ అయింది. తాజాగా అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఎవరెవరు పార్టీలో చేరతారోనని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.
ఇదిలా ఉంటే… తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచుతుండటంతో, ఇకపై కమలం పార్టీని లక్ష్యంగా చేసుకుని పావులు కదిపేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ప్రతివ్యూహంతో ముందుకెళ్లాలని భావిస్తోంది.