అదుపుతప్పుతున్న

‘మైనర్లు’ 
తరచుగా రోడ్డు ప్రమాదాలకు కారకులవుతున్న ర్యాష్‌ డ్రైవింగ్‌ చోదకులు 

  • -సత్ఫలితాలివ్వని పోలీసు కౌన్సెలింగ్‌లు 
  • -తీరు మార్చుకోని తల్లిదండ్రులు 
  • -అతివేగం, నిర్లక్ష్యంతో బండ్లు నడుపుతున్న యువత 
  • -వారాంతరపు పార్టీ జోష్‌లో యాక్సిడెంట్లు 
  • -డ్రైవింగ్‌ లైసెన్సులు లేకుండానే రోడ్లపైకొస్తున్న యూత్‌ 
  • -పట్టుబడితే పెనాల్టీలు కట్టి తప్పించుకుంటున్నారు 
  • -తూ.తూ.మంత్రంగా తనిఖీలు 
  • -కొన్ని చోట్ల రోడ్లపైనే బైక్‌ రేసింగ్‌లు 
  • -బోయినపల్లిలో ఇద్దరి మరణానికి కారకులయిన మైనర్‌ 
  • -ప్రధాన సెంటర్లలో తప్ప ఇతర ప్రాంతాలలో చెకింగులు కరువు 

హైదరాబాద్‌: 
మైనర్లు వాహనాలు నడపకుండా చేసేందుకు పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. పిల్లలకు వాహనాలు అప్పగిస్తున్న తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌తో పాటు కేసులు నమోదు చేస్తున్నారు. పెద్ద మొత్తంలో జరిమానా విధిస్తున్నారు. అయినా ఆశించిన స్థాయిలో సత్ఫలితాలు రాకపోవడం వల్ల పిల్లలకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించే దిశగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 
మైనర్ల సరదా ఓ కుటుంబంలో విషాదం నింపింది. వచ్చీ రాని డ్రైవింగ్‌తో కారులో షికార్లు కొట్టిన మైనర్లు.. ఇద్దర్ని పొట్టనపెట్టుకున్నారు. హైదరాబాద్‌ బోయిన్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఘటన చర్చానీయాంశమైంది. బంధువుల ఇంటికి వెళదామని ఆటోలో బయలుదేరిన కుటుంబ సభ్యులకు మైనర్ల రూపంలో మత్యువు ఎదురొచ్చింది. అతివేగంగా కారు నడుపుతూ వారు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొని 14 నెలల బాలుడితో పాటు 65 సంవత్సరాల మహిళ ప్రాణాలు బలిగొన్నారు. బోయిన్‌పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. మైనర్లే కారణం..! హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 14 నెలల బాలుడితో పాటు అమ్మమ్మ ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా విషాదం నింపింది. 
మైనర్ల డ్రైవింగ్‌పై ప్రత్యేక నిఘా జంట నగరాల్లో మైనర్లు వాహనాలు నడపకుండా పోలీసులు తీసుకుంటున్న చర్యలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోతున్నాయి. వాహనాలతో రోడ్లపైకి వస్తున్న మైనర్లతో పాటు వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌? ఇస్తున్నా, కేసులు నమోదు చేస్తున్నా ఏ మాత్రం మార్పు రావడం లేదు. ఫలితంగా వాహనదారులతో పాటు ఇతరులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ట్రాఫిక్‌? పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా రయ్‌? రయ్‌? మంటూ రోడ్లపైకి దూసుకొస్తున్నారు మైనర్లు. తల్లిదండ్రుల గారాబంతో ప్రమాదాల బారిన పడి, కటకటాల పాలవుతున్నారు. రాత్రి సమయాల్లో మైనర్ల వాహన విన్యాసాలు మరీ అధికమవుతున్నాయి. అతి వేగంతో వాహనాలు నడుపుతూ… బ ందాలుగా ఏర్పడి నగరంలో చక్కర్లు కొడుతున్నారు. బంజారాహిల్స్‌?, జూబ్లీ హిల్స్‌?, మాసబ్‌? ట్యాంక్‌?, నెక్లెస్‌? రోడ్‌?, పాత బస్తీ వంటి ప్రాంతాల్లో మైనర్లు స్టంట్లు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇలాంటి వారి కోసం ట్రాఫిక్‌? పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. గత రెండు మూడేళ్లుగా ఇలాంటి ప్రమాదాలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. జరిమానాలు, హెచ్చరికలతో మార్పు తీసుకురావాలని భావించినా అవేవి సత్ఫలితాలను ఇవ్వలేదు. చివరకి మైనర్లకు వాహనాలు అప్పగిస్తున్న తల్లిదండ్రులపైనే చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 1800 మైనర్ల డ్రైవింగ్‌? కేసులు నమోదయ్యయి. వారి నుంచి రూ.12.32 లక్షలు వసూలు చేశారు. గత మూడేళ్లలో ఈ మొత్తం రూ.30 లక్షలకు చేరుకుంది. డ్రంక్‌? అండ్‌? డ్రైవ్‌? తనిఖీల్లో పట్టుబడినా కఠినంగా వ్యవహరిస్తున్నారు పోలీసులు. గతేడాది పిల్లలకు వాహనాలిచ్చిన 45 మంది తల్లిదండ్రులను జైలుకు పంపగా.. వాహనం నడిపిన మైనర్లను జువైనల్‌ హోంకు తరలించారు. రోడ్డు భద్రతా నియమాలపై విద్యార్థుల్లో అవగాహన తీసుకురావడానికి పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 
మైనర్ల డ్రైవింగ్‌ను నిషేధించాలి 
ఈ మధ్య పసిపిల్లల నుంచి టీనేజర్ల వరకు చాలా మంది ద్విచక్ర వాహనాలను, కార్లు నడుపుతూ దర్శనమిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా వారిని ప్రోత్సహించడం శోచనీయం. డ్రైవింగ్‌ లైసెన్సులకు నిర్దిష్ట నిబంధనలున్నా వాటన్నింటినీ తుంగలో తొక్కి వాహనాలు నడుపుతుంటే చూస్తున్న మనకే భయమేస్తోంది. కొందరు హోదా కోసం, ఇంకొందరు సరదా కోసం ఈ సాహసాలకు ఒడిగడుతున్నారు. మోపెడ్లు, బైకులు, స్కూటర్లే కాకుండా కార్లను కూడా చిన్న పిల్లలు దర్జాగా నడి పేస్తున్నారు. చిన్న పిల్లల చేత డ్రైవింగ్‌ చేయించడం వల్ల వారే గాక, రోడ్డు మీద నడిచేవారు కూడా ప్రమాదాలకు గురయ్యే ఆస్కారముంది. ఇది ఆయా పిల్లల తల్లిదండ్రులకు చెలగాటం కావచ్చు. కానీ రోడ్డు మీద నడిచే వారికి ప్రాణసంకటం. మైనర్లు రోడ్లపై వాహనాలు నడుపుతున్న విషయం తెలిసీ సంబంధిత అధికారులు చేతులు ముడుచుకు కూర్చోవటం తగదు.చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. 
హైదరాబాద్‌ నగరంలో బైక్‌లు..కార్లు వేగంగా నడుపుతున్న మైనర్లు వేగాన్ని నియంత్రించుకోలేక ప్రమాదాల బారిన పడుతున్నారు. కొత్తకారు…బైక్‌లో వెళ్లాలన్న ఉరకలెత్తే ఉత్సాహం..లైసెన్సు లేకున్నా..అనుభవం సరిపోకపోయినా వాహనాలు నడిపితే వచ్చే మజాయేవేరు అనుకోవడం.. దీంతోపాటు రహదారులపై దూసుకెళ్లాలన్న ఉల్లాసం..వారాంతాల్లో విందు..వినోదం కొందరు మైనర్లు, విద్యార్థులు, యువకుల కుటుంబాల్లో విషాదాన్ని పంచుతోంది. తల్లిదండ్రులను బలవంత పెట్టి బెదిరించి బైకులు, కార్లు కొంటున్న కొందరు యువకులు వాటిపై వేగంగా దూసుకెళ్తూ ప్రమాదాలు చేస్తున్నారు. నగరంతో పాటు శివారు ప్రాంతాలు, బాహ్యవలయ రహదారులపై రేసులు నిర్వహిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఒక్కోసారి వీరి దూకుడు ప్రాణంమీదికి తెస్తుండగా..మరికొన్ని సందర్భాల్లో సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. 
కుర్రకారు కేకలు..మందు..విందు 
ద్విచక్రవాహనాలు, కార్లను నడుపుతున్న ఇంటర్మీడియేట్‌, డిగ్రీ విద్యార్థుల్లో 40శాతం మంది వారాంతాల్లో విందులు, వినోదాల్లో పాల్గొంటున్నారు. విందులో మద్యం తప్పనిసరి. మోతాదుకు మించి మద్యంతాగి వాహనాలు నడుపుకొంటూ ఇళ్లకు వెళ్తున్నారు. మద్యంమత్తులో జరిగే ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్‌ పోలీసులు నిర్వహిస్తున్న డ్రంకెన్‌ డ్రైవ్‌లో ఏటా వేల సంఖ్యలో యువకులు పట్టుబడుతున్నారు. ఇందులో మైనర్లు కూడా ఉన్నారు. రెండేళ్ల నుంచి వీరి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2016లో 17వేల మంది, 2017లో 20వేల మంది తనిఖీల్లో దొరికిపోయారు. ఇందులో 17ఏళ్ల నుంచి 20ఏళ్లలోపున్న యువకులు 14శాతం మంది ఉన్నారు. పోలీసులకు పట్టుబడుతున్న యువకుల్లో 99శాతం మందికి మద్యంతాగి వాహనం నడపడం తప్పు అని తెలుసు. తెలిసినా సరే.. మోతాదుకు మించి మద్యంతాగుతున్నారు. వీరిలో చాలామంది బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, ఎస్సార్‌నగర్‌, మాదాపూర్‌, సికింద్రాబాద్‌, బేగంపేట ప్రాంతాల్లో నివాసముంటున్న యువకుల్లో చాలామంది మోతాదుకు మించి మద్యం తాగి బైకులు, కార్లలో వెళ్తున్నారు. వారంతాల్లో నిర్వహిస్తున్న డ్రంకెన్‌డ్రైవ్‌లలో వీరు పట్టుబడుతున్నారు. 
మారాం చేస్తున్నారంటూ కొనిపిస్తే… 
మారాం చేస్తున్నారు..సరదా పడుతున్నారు..ఇప్పుడు కాకపోతే పెద్దయ్యాక బైకులు నడుపుతారా? అని కొందరు తల్లిదండ్రులు మైనర్లకు బైకులు, స్పోర్ట్స్‌ కార్లు కొనిస్తున్నారు. మధ్యతరగతికి చెందిన వారు బైకులు కొనే స్థోమత లేకున్నా వాయిదాల పద్ధతిలో కొంటున్నారు. మైనర్లు కార్లు, బైక్‌లతో రహదారులపైకి వచ్చాక మితిమీరిన వేగంతో నడుపుతూ ప్రమాదాలు చేస్తున్నారు. రహదారులపై ప్రమాదాలు తగ్గించేందుకు తాము అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నా కొందరు మాత్రమే ప్రమాదాల తీవ్రతను అర్థం చేసుకుని పిల్లలకు వివరించి బైకులు, కార్లు కొనివ్వడం లేదని వివరిస్తున్నారు. 18 ఏళ్లు నిండిన యువతీ,యువకులకు తాము ట్రాఫిక్‌ శిక్షణ కేంద్రాల్లో ఉచితంగా డ్రైవింగ్‌ నేర్పుతున్నామని వివరించారు. 
నాలుగింటిలో ఒక ప్రమాదం మైనర్ల వల్లే… 
హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధుల్లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో ప్రతి నాలిగింటిలో ఒకటి మైనర్ల కారణంగానే అవుతున్నాయి. హైదరాబాద్‌ నగరం, శివార్లలోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు, పాతబస్తీలోని యువకులు కొత్తబైక్‌లు, ఖరీదైన వాహనాలను కొంటున్నారు. చాంద్రాయణగుట్ట-సంతోష్‌నగర్‌, చాంద్రాయణగుట్ట-కాటేదాన్‌ మార్గంలో రాత్రివేళల్లో బైక్‌ రేసులు నిర్వహిస్తున్నారు. దీంతోపాటు నార్సింగి, రాజేంద్రనగర్‌, హయత్‌నగర్‌ ప్రాంతాల్లో ఉదయం వేళల్లో వంద కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నారు. నెక్లెస్‌ రోడ్‌లో పోలీసులు, మౌంటెడ్‌ పోలీసుల నిఘా ఉన్నా..ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు. దీంతో మూడు కమిషనరేట్ల పరిధుల్లో నమోదవువుతున్న మొత్తం ప్రమాదాల్లో 60శాతం ప్రమాదాలు ద్విచక్రవాహన చోదకులవల్ల సంభవిస్తున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడంతా ట్రాఫిక్‌ పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు సంఘటన స్థలాలకు వెళ్లి ప్రమాదాలకు గల కారణాలను తెలుసుకుంటున్నారు. ప్రమాదాలు తగ్గేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇక ఏటా గణాంకాలు చూస్తే ప్రమాదాల సంఖ్య తగ్గుతున్నా తీవ్రత పెరుగుతోంది. వీటిని మరింత తగ్గించేందుకు పోలీస్‌, రవాణా, జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.