లింగన్న మృతదేహానికి

  • రీపోస్టుమార్టం పూర్తి 
  • గాంధీ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగిన నిరసన కారులు 
  • విమలక్క, సంధ్యలతో పాటు పలువురి అరెస్ట్‌ 
  • 5న హైకోర్టుకు రిపోర్టును అందజేయనున్న అధికారులు
  •  నా తండ్రిది బూటకపు ఎన్‌కౌంటర్‌ 
  • లింగన్న కుమారుడు హరి ఆరోపణ 

హైదరాబాద్‌, ఆగస్టు2- : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో జులై 31న జరిగిన ఎన్‌కౌంటర్‌లో న్యూడెమోక్రసీ దళ సభ్యుడు లింగన్న మృతిచెందిన విషయం విధితమే. కాగా ఆయన మృతదేహానికి శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికిలో ముగ్గురు వైద్యుల బృందం రీ పోస్టుమార్టం నిర్వహించారు. తెల్లవారు జామున 4గంటలకు గాంధీ ఆస్పత్రికి తరలించగా, 8గంటల వరకు మృతదేహానికి రీ పోస్టుమార్టం పూర్తిచేసి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఈనెల 31న గుండాల మండలం అడవుల్లో న్యూడెమోక్రసీ అజ్ఞాత దళానికి, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ నేపథ్యంలో న్యూడెమోక్రసీ అజ్ఞాత దళ నాయకుడు లింగయ్య మృతిచెందాడు. ఆయన మృతదేహాన్ని తరలించే క్రమంలో గ్రామస్తులు అడ్డుకున్నారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. వారిని చెదరగొట్టి పోలీసులు లింగన్న మృతదేహాన్ని ఇల్లందు ఆస్పత్రికి తరలించారు. ఇల్లందు ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. లింగన్న ఎన్‌కౌంటర్‌ బూటకమని ఆరోపిస్తూ ప్రజా సంఘాల నేతలు పలుచోట్ల ఆందోళనకు దిగారు. లింగన్న మృతిపై రాష్ట్ర పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌ హైకోర్టులో అత్యవసర ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం లింగన్న మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో లింగన్న మృతదేహాన్ని కొత్తగూడెం నుంచి శుక్రవారం తెల్లవారు జామున 4 గంటలకు గాంధీ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ముగ్గురు వైద్యుల బృందం లింగన్న మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించారు. కాగా ఈ నివేదికను అధికారులు 5వ తేదీన కోర్టుకు సమర్పించనున్నారు. 
గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత.. 
లింగన్న రీ పోస్టుమార్టం నేపథ్యంలో గాంధీ ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గాంధీ ఆస్పత్రి వద్ద నిరసన చేపట్టిన ఆందోళనకారుల్ని పోలీసులు అరెస్ట్‌ చేసి అక్కడి నుంచి తరలించారు. అలాగే లింగన్న మృతదేహాన్ని చూడటానికి గాంధీ ఆస్పత్రికి వచ్చిన న్యూడెమోక్రసీ నాయకులు ప్రదీప్‌, అరుణలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్ట్‌ చేసి నారాయణగూడ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. లింగన్న మృతదేహాన్ని చూసేందుకు గాంధీ ఆస్పత్రి వద్దకు చేరుకున్న పివోడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్యను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, సంధ్యకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కొద్ది సేపటికి సంధ్యను అరెస్ట్‌ చేసిన పోలీసులు ఆమెను బొల్లారం పోలీసు స్టేషన్‌కు తరలించారు. అలాగే గాంధీ ఆస్పత్రి వద్దకు చేరుకున్న విమలక్కను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
మా నాన్నది బూటకు ఎన్‌కౌంటర్‌ ా హరి 
న్యూడెమోక్రసీ నాయకులు లింగన్నది బూటకపు ఎన్‌కౌంటర్‌ అని ఆయన కుమారుడు హరి 
ఆరోపించారు. తన తండ్రిని అక్రమంగా అరెస్ట్‌ చేసి.. ఆ తర్వాత కాల్చి చంపారని హరి చెప్పుకొచ్చారు. తన తండ్రిని పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు. తమకు చెప్పకుండానే ఖమ్మంలో పోస్టుమార్టం నిర్వహించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. తన తండ్రి వద్ద ఎటువంటి ఆయుధాలు లేవని స్పష్టం చేశారు.