మళ్లీ మొదటికొచ్చిన..
- అయోధ్య వివాదం
- పరిష్కారం చూపలేక పోయిన మధ్యవర్తుల కమిటీ
- 6నుంచి రోజువారి విచారణకు సుప్రీం నిర్ణయం
న్యూఢిల్లీ, ఆగస్టు2- : అయోధ్య రామజన్మభూమి వివాదం మళ్లీ మొదటికొచ్చింది. వివాద పరిష్కారం కోసం మధ్యవర్తిత్వం కమిటీ వేసినప్పటికీ.. పరిష్కారం చూపడంలో కమిటీ ప్రయత్నాలువిఫలమయ్యాయి. మధ్యవర్తుల కమిటీని గురువారం సుప్రీంకోర్టులో సమర్పించగా, శుక్రవారం సుప్రీం కోర్టు విచారించింది. నివేదికను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎఫ్‌ఎంఐ కలీఫుల్లా నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ పరిశీలించిన తర్వాత శుక్రవారం సుప్రీంకోర్టు ఈ ప్రకటన చేసింది. దీనిపై రోజువారీ విచారణ ఈ నెల6 నుంచి జరుగుతుందని తెలిపింది. త్రిసభ్య కమిటీ గురువారం సీల్డు కవర్లో సమర్పించిన నివేదికను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం పరిశీలించింది. ఈ రాజ్యాంగ ధర్మాసనంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్ ఏ బాబ్డే, జస్టిస్ డీ వై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ ఏ నజీర్ ఉన్నారు. అయోధ్య రామ జన్మ భూమి వివాదంపై మధ్యవర్తిత్వం నిర్వహించిన త్రిసభ్య కమిటీ నివేదికను గతంలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా గోప్యంగా ఉంచుతామని సుప్రీంకోర్టు పేర్కొంది. మధ్యవర్తిత్వం ఎటువంటి ఫలితాన్ని సాధించలేకపోయిందని, విఫలమైందని స్పష్టం చేసింది. కేసులోని ముస్లిం పక్షం వినిపించిన వాదనలో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి రిట్ పిటిషన్‌ను వ్యతిరేకించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ మాట్లాడుతూ విచారణ ప్రారంభం కానివ్వాలన్నారు. కేసులో వాదనలు వినిపించేందుకు ఎందుకు సిద్ధమవడం లేదని, కోర్టు చేస్తున్నపనిని ఎందుకు ప్రశ్నిస్తున్నారని అడిగారు. అయోధ్య భూ వివాదంపై 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. 2.77 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డ్, నిర్మోహి అఖాడా, రామ్ లల్లాలకు సరిసమానంగా పంచాలని తీర్పులో పేర్కొంది. దీనిపై 14 అపీళ్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి.
ధ్యవర్తిత్వ కమిటీలో జస్టిస్ కలీఫుల్లాతోపాటు ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్, సీనియర్ అడ్వకేట్ శ్రీరామ్ పంచు ఉన్నారు. మార్చి 8 నుంచి ్గ/జాబాద్‌లో మధ్యవర్తిత్వ పక్రియ జరిగింది. వివిధ వర్గాలతో ఈ కమిటీ చాలా సమావేశాలు నిర్వహించింది. మధ్యవర్తిత్వ ప్రయత్నాల వల్ల ప్రయోజనం లేదని, విచారణ ప్రారంభించాలని ఒరిజినల్ లిటిగెంట్స్‌లో ఒకరైన గోపాల్ సింగ్ విశారద్ వారసుడు రాజేంద్ర సింగ్ కోరడంతో సుప్రీంకోర్టు ఈ కమిటీ నివేదికను సమర్పించాలని కోరిన సంగతి తెలిసిందే.