పోలవరం ముహూర్తం బాగాలేదా?
పోలవరం ప్రాజెక్టు పనుల్లో అక్రమాలపై విపక్షంలో ఉండగానే వైకాపా విమర్శలు చేస్తూ వచ్చింది. అలాగే అనేక అవకతవకలు జరిగాయని సర్వత్రా ఆరోపణలు వచ్చాయి. కేంద్రం కూడా ఈ విషయంలో అనేకానేక అనుమానాలు వ్యక్తం చేసింది. విపక్షంలో ఉండగా ప్రస్తు సిఎం వైఎస్ జగన్ ఏనాడూ పోలవరాన్ని సందర్శించక పోవడానికి కూడా ఇదే కారణంగా చెబుతారు. జాతీయ ప్రాజెక్టుగా పోలవరాన్ని కేంద్రం నిర్మించాల్సి ఉన్నా, కావాలనే చంద్రబాబు ముందుకు వచ్చి రాష్ట్రప్రభుత్వమే నిర్మిస్తుందని పనలుఉల చేపట్టడం అనేక అనుమాలనాలకు బలం చేకూరింది. అలాగే ఐదేళ్లలో పనులు చేపట్టిన సందర్భంలో కాంట్రాక్టర్లు మారారు. మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు నేతృత్వంలోని కంపెనీ పనులు చేపట్టి మధ్యలోనే వదిలేసింది. గతంలో కూడా పోలవరం కోసం అనేకానేక కంపెనీలు ముందుకు వచ్చినా ఎందుకనో ఏ ఒక్కరూ నిజాయితీగా పనులు చేపట్టలేదు. ఇది ఏ ముహూర్తాన మొదలు పెట్టారో కానీ సక్రమంగా ముందుకు సాగుతున్న దాఖలాలు కానరాలేదు. మొత్తంగా ఇప్పుడు నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలను ప్రారంభించింది. జలాశయం హెడ్‌వర్క్స్ పనుల నుంచి తప్పు కోవాలని నవయుగ సంస్థకు, గేట్ల తయారీ పనుల నుంచి వైదొలగాలని బీకెమ్ సంస్థకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఒప్పందాన్ని ముందుగానే రద్దు చేసుకోవాలని సూచిస్తూ నవయుగ, బీకెమ్‌లకు పోలవరం ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ సుధాకర్‌బాబు జూలై 29న నోటీసులు జారీ చేశారు. కేంద్రం నుంచి అనుమతి రాగానే ఈ పనులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించేందుకు వీలుగా నోటిఫికేషన్ జారీ చేస్తామని జలవనరుల శాఖ వర్గాలు తెలిపాయి. మొత్తంగా అటు కేంద్రం,ఇటు జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం
పోలవరం అవకతకలపై నిగ్గుతేల్చాలని నిర్ణయించాయి. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో వేలకోట్లు అవకతవకలు జరిగాయన్న ప్రాథమిక నిర్ధారణతో ప్రభుత్వం కంట్రాక్టర్లను తప్పించింది. అలాగే అవకతవకలను నిగ్గు తేల్చేందుకు ఇప్పటికే విచారణ చేపట్టింది. సిబిఐ దర్యాప్తు జరిపించాలన్న డిమాండ్ కూడా ఉంది.
విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వమే వంద శాతం ఖర్చు భరించి పోలవరం ప్రాజెక్టును నిర్మించి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలి. కానీ కవిూషన్ల దాహంతో మాజీ సీఎం చంద్రబాబు పోలవరం బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించాలని కేంద్రాన్ని కోరారని జగన్ నమ్ముతున్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పోలవరం బాధ్యతలను 2016 సెప్టెంబరు 7న కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. పోలవరం హెడ్ వర్క్స్ కాంట్రాక్టు ఒప్పందం గడువు ముగియక ముందే నిబంధనలకు విరుద్ధంగా అంచనా వ్యయాన్ని రూ.1331.91 కోట్లు పెంచేస్తూ 2016 సెప్టెంబరు 8న ఉత్తర్వులు జారీ చేసిన చంద్రబాబు టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌కి లబ్ది చేకూర్చేలా చేశారని ఆరోపణలు ఉన్నాయి. ట్రాన్స్‌ట్రాయ్‌ని అడ్డం పెట్టుకుని పనులన్నీ సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించేసి కవిూషన్లు వసూలు చేసుకున్నట్లు నమ్ముతున్నారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ట్రాన్స్‌ట్రాయ్ 2017 నాటికి దివాలా తీసింది. నిబంధనల ప్రకారం దివాలా తీసిన ట్రాన్స్‌ట్రాయ్‌తో కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసుకుని టెండర్లు పిలిచి కొత్త కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించాల్సి ఉండగా అలాంటిదేవిూ జరగలేదన్న వాదనా ఉంది. పోలవరం జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులను నవయుగకే కట్టబెట్టాలని ముందుగానే నిర్ణయించిన చంద్రబాబు 2017 జనవరి 7న ఏపీ జెన్‌కోతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేయించారు. నిజానికి పోలవరం హెడ్‌వర్క్స్‌లో జలవిద్యుదుత్పత్తి కేంద్రం పునాది పనులు అంతర్భాగమే. హెడ్‌వర్క్స్ ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్‌ట్రాయ్ దివాలా తీసిన నేపథ్యంలో ఆ పనులనూ నవయుగకే అప్పగించి అటు జలవిద్యుదుత్పత్తి కేంద్రం, ఇటు
హెడ్‌వర్క్స్‌లో కవిూషన్లు కాజేయడానికి చంద్రబాబు స్కెచ్ వేశారని వైకాపా నమ్ముతోంది. మొత్తంగా అనుమానాలు రావడం, ఆరోపణలు తోడవ్వడంతో టీడీపీ హయాంలో ఇంజనీరింగ్ పనుల్లో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిపుణుల కమిటీని నియమించారు. పోలవరం పనులపై విచారించిన నిపుణుల కమిటీ ఆర్థికంగా దివాలా తీసిన ట్రాన్స్‌ట్రాయ్‌తో నాటి ప్రభుత్వం ఒప్పందం రద్దు చేసుకోకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఈపీసీ ఒప్పందం గడువు ముగియకుండానే అంచనా వ్యయాన్ని పెంచేయడం, నవయుగ, బీకెమ్ సంస్థలకు ఎల్‌ఎస్ ఓపెన్ పద్ధతిలో నామినేషన్ విధానంలో పనులు అప్పగించడం వంటి వాటిని నిపుణుల కమిటీ ఆక్షేపించింది. పోలవరం హెడ్ వర్క్స్, జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనుల్లో రూ.2,346.85 కోట్ల మేర అవినీతి జరిగినట్లు నిర్దారిస్తూ నిపుణుల కమిటీ గత నెల 24న రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా కుదుర్చుకున్న కాంట్రాక్టు ఒప్పందాలను రద్దుచేసి హెడ్ వర్క్స్, జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులకు ఒకే ప్యాకేజీ కింద రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని కమిటీ సిఫార్సు చేసింది. ఈ పనులను ఒకే కాంట్రాక్టర్‌కు అప్పగించడం వల్ల పనుల్లో సమన్వయం కుదురుతుందని, రెండేళ్లలోగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి సాధ్యపడుతుందని పేర్కొంది. దీంతో సిఎం వైఎస్ జగన్ ఇక పోలవరంపై తోణ నిర్ణయం తీసుకున్నారు. నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్‌ను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో నవయుగతో చేసుకున్న మూడు ఒప్పందాలు, బీకెమ్ సంస్థతో చేసుకున్న మరో ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని సూచిస్తూ ఆ రెండు సంస్థలకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. మొత్తంగా ఇప్పుడు కొత్తగా టెండర్లు పిలవడంతో పాటు గతంలో జరిగిన అవినీతిపై నిగ్గుతేల్చాల్సి ఉంది. ఇలాంటివి చేయడం ద్వారా అవినీతిని బయట పెట్టగలిగితే ప్రజలు హర్షిస్తారు. రాజకీయ అవినీతిని ఎండగట్టేందుకు చిత్తశుద్దితో ముందుకు సాగితే స్వాగతిస్తారు.