తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు
పొంగుతున్న వాగులు వంకలు
బొగత జలపాతం వద్ద పెరుగుతున్న వరద
ఉధృతంగా ప్రవహిస్తోన్న ప్రాణహిత నది
పోలవరం వద్ద గోదావరి పరుగులు
పశ్చిమలో నీటమునిగిన పంటపొలాలు
శ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ పరుగులు
వర్షాలతో ఓపెన్ కాస్టుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
హైదరాబాద్,ఆగస్ట్2-: బంగాళాఖాతంలో అల్పపడీనానికి తోడు రుతపవనాలు చురుకుగా ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్‌లో గురువారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. జోరుగా వానలుపడుతుండడంతో వాగులువంకలు పొర్లుతున్నాయి. ప్రధాన జలాశయాల్లో నీరు వచ్చి చేరుతోంది. సింగరేణి బొగ్గు గనుల్లో ఓపెన్‌కాస్టుల్లో నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ములుగు జిల్లాలోని అందాల బొగత జలపాతం వద్ద భారీగా నీరు చేరడంతో పర్యాటకప్రాంతం జలమయమయ్యింది. కొన్ని రోజులుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో జలపాతానికి భారీగా వరద నీరు చేరి ఉద్ధృతంగా పొంగుతోంది. ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో పర్యాటకులను రావొద్దని అటవీశాఖ సిబ్బంది సూచిస్తున్నారు. వర్షాల ధాటికి బొగత జలపాతం వద్దకు భారీగా వరద నీరు చేరుకుంది. వరద తీవ్రత తగ్గే వరకూ పర్యాటకులు ఇక్కడికి రాకపోవడం మంచిది. ఒకవేళ వచ్చినా అటవీ సిబ్బంది సూచనల మేరకు ఫెన్సింగ్ దాటి వెళ్లకూడదని హెచ్చరించారు. మద్యం సేవించి వచ్చే పర్యాటకులను అనుమతించేది లేదు. నిబంధనల విషయంలో సిబ్బందికి సహకరిస్తారని కోరుకుంటున్నామని అటవీశాఖ సిబ్బంది తెలిపారు. మరోవైపు ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. మేడిగడ్డ బ్యారేజీ వద్ద 65 గేట్లను అధికారులు ఎత్తివేశారు. గోదావరిలోకి 3.4లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మేడిగడ్డ నుంచి 4.02లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.అన్నారం బ్యారేజీలో 8.88 టీఎంసీలు.. మేడిగడ్డలో 6.23టీఎంసీల నీటి నిల్వ, కన్నెపల్లిలో మోటార్ల నిలిపివేశారు. ఇకపోతే పశ్చిమగోదావరి జిల్లాలో గోదావరి వరద నీరు పోలవరం ప్రాజెక్టును చుట్టుముట్టింది. స్పిల్‌వే వైపునకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. కాఫర్ డ్యాం ప్రభావం వల్ల ముంపు గ్రామాలకు ముప్పు ఉండడం వల్ల వరదను స్పిల్‌వే విూదుగా మళ్లించారు. దాదాపు 2 వేల క్యూసెక్కుల వరద నీరు స్పిల్‌వే రివర్స్ స్లూయిజ్ గేట్ల ద్వారా బయటకు వెళ్తోంది. స్పిల్‌వే గేట్ల క్లస్టర్ లెవెల్ ఎత్తు 25.72 విూటర్లుకాగా.. ప్రస్తుతం నీరు గరిష్ఠ స్థాయికి చేరుకుంది. మరో అరవిూటరు ఎత్తు పెరిగితే వరద నీటిని విడుదల చేయనున్నారు. స్పిల్‌వేపై నుంచి వరద నీరు సాఫీగా వెళ్తుండటం వల్ల ముంపు గ్రామాలకు కొంత వరకు ముప్పు తప్పిందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఇన్‌ప్లో స్వల్పంగా పెరిగింది. బ్యారేజీ లోకి 6.5 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా.. 6.39లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ఇకపోతే గురువారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి మండలంలోని పలు గ్రామల్లో పంట పొలాలు నీట మునిగాయి. కొవ్వలిలో వాలకోడు, జిల్లేడుదిబ్బ, దోసపాడులోని కొల్లేటిదిబ్బ, పోతునూరులోని లోతట్టు పొలాలు నీట
మునిగాయి. మరోవైపు మొండికోడు, పవ్వలి డ్రైన్‌లలో వరదనీటి ప్రవాహం పెరుగుతోంది. శుక్రవారం కూడా వర్షం పడుతూనే ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మెట్టమండలాలైన పెదవేగి వంటి మండలాల్లో కూడా వర్షాలు పడటంతో గుండేరులో నీటి ప్రవాహం మొదలైంది. ఎడతెరిపి లేని వర్షంతో మెట్ట ప్రాంత రైతులు సంతోషం వ్యక్తం చేస్తుండగా.. డెల్టా రైతులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణమ్మ వేగం పెరుగడంతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు దిగువకు 2,10,000 క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా.. శ్రీశైలం జలాశయానికి 1,75,656 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ఎగువ నుంచి వరద ఎక్కువగా వచ్చి చేరుతుండటంతో దిగువకు ప్రవాహం పెరుగుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 832.30అడుగులుగా ఉంది. జలాశయ పూర్తిస్థాయి సామర్థ్యం 215.80 టీఎంసీలుకాగా.. మూడు రోజుల కిందట ప్రారంభమైన వరదతో 51.96 టీఎంసీల నీటి నిల్వ నమోదైంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 2400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు ఆల్మట్టి నుంచి వస్తున్న ప్రవాహం కూడా 2 లక్షల క్యూసెక్కులను దాటింది. నారాయణపూర్ నుంచి 19 గేట్లను 2 విూటర్లు ఎత్తి 2.10 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. ఖమ్మం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో జన జీవనం స్తంభించింది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా సత్తుపల్లి జేవీఆర్ సింగరేణి ఓపెన్ కాస్ట్‌లో నీరు చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. మరోవైపు ఇల్లందు జేకే 5ఓసీ, టేకులపల్లి మండలం కోయాగుడెం ఓసీలో ఎడతెరిపి లేని వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతోంది.