ముస్లిం మహిళల విజయంముస్లిం మహిళల విజయం

ముమ్మారు తలాక్‌ బిల్లు విషయంలో మోదీ ప్రభుత్వం ఘనవిజయం సాధించిందనే కంటే భరాతీయ ముస్లిం మహిళలు తమ హక్కులను సాధించారని అనాలి. ఎంతోకాలంగా అనాగిరక చట్టంతో తమను తన్ని తగలేసినా భరిస్తూ వచ్చిన మహిళలకు ఇప్పుడు చట్టం అండగా నిలవబోతున్నది. ఈ చట్టం ఇప్పుడు తలాక్‌కు తలాక్‌ చెప్పేసింది. ముమ్మారు తలాక్‌ చెప్పి విడాకులిచ్చే దుష్ట సంప్రదాయం ఇక భారత్‌లో కొనసాగదు. ఈ బిల్లు సందర్బంగా అనేక విషయాలు గుర్తించాలి. ఇంతకాలం మనుషులంతా ఒక్కటే..మన రక్తమంతా ఒక్కటే… కులాల, మతాల అడ్డుగోడలు పగులగొట్టాలన్న కుహనా రాజకీయవాదులు తలాక్‌ బిల్లుపై చర్చ ద్వారా తమ ఫాసిస్ట్‌ విధానాలను బహిరంగ పరిచారు. త్రిపుల్‌ తలాక్‌ చెప్పి మహిళలను వదిలించుకునే వదిలించుకునే పద్దతిని అరికట్టేందుకు చట్టం తీసుకుని వచ్చే ప్రయత్నంలో బిల్లుకు మద్దతు ఇవ్వాల్సిన రాజకయీ పార్టీలు దీనిని వ్యతిరేకించాయి. దేశంలో రాజకీయ పార్టీల నైజం ఏమిటో బయట పడింది. నిజానికి ముస్లిం మహిళలు ఇలాంటి పార్టీలకు ఇక తలాక్‌ చెప్పాలి. రాజ్యసభలో తమకు తగినంత బలం లేకపోయినా రాజకీయ వ్యూహచతురతతో ఈ బిల్లును ఆమోదింపజేయడం ద్వారా బిజెపి ఓ రకంగా ము/-లిం మహిళల పక్షాన పోరాడిందని గుర్తించాలి.కొన్ని పక్షాలు ఓటింగ్‌కు దూరంగా ఉండటం, కొందరు వాకౌట్‌ చేయడం, బిజూజనతాదళ్‌ లాంటి పక్షాల నుంచి అందిన మద్దతు కారణంగా ఉద్దేశించిన తలాక్‌ బిల్లు చట్టంగా బయటకు వచ్చింది. ముమ్మారు తలాక్‌ విధానం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు 2017లోనే తీర్పునిచ్చినా, ఇంకా అది కొనసాగుతుండటంతో ఎన్డీయే ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించి ఈ చట్టం విషయంలో ముందడుగు వేసింది. 99-84 ఓట్ల తేడాతో ‘తలాక్‌ బిల్లు’ను రాజ్యసభ ఆమోదించడం తో ఇక తలాక్‌ పేరుతో మహిళలను గెంటేసే ప్రయత్నాలు సాగవు. లోక్‌సభ ఆమోదించిన ఈ బిల్లు ఇపుడు రాజ్యసభలోనూ ఆమోదం పొందడంతో త్వరలోనే ఇది రాష్ట్రపతి వద్దకు వెళ్లనుంది. ఆయన ఆమోదించిన తర్వాత, ఫిబ్రవరి 21న జారీచేసిన ఆర్డినెన్సు స్థానే చట్టం అమల్లోకి వస్తుంది. మొత్తంగా భారతీయ ముస్లిం మహిళు ఘన విజయాన్ని సాధించారనే చెప్పాలి. ఈ చట్టంతో ఎట్టకేలకు ముస్లిం మహిళలకు అండ దొరికింది. మతఛాందస చట్టాలతో ఇంతకాలం బానిసలుగా చూస్తూ, తాళిని ఎగతాళి చేసే విధానానికి చట్టం ద్వారా అడ్డుకట్టపడింది. నిజానికి పెళ్లి, విడాకులు అన్నవి మానవ సంబధాలు. వీటికి మతంతో సంబంధం లేదు. మహిళలు ఏ మతం, వర్గం వారైనా అందరికీ ఒకే చట్టం ఉండాలి. కానీ మన దౌర్భాగ్యం ఏమంటే మతాలవారిగా మహిళలను చిన్నచూపు చూస్తున్నాం. వారిని ఆదరించాలన్న జ్ఞానం పురుష జాతిలో ఉండడం లేదు. మనకు జన్మనిచ్చిన మన తల్లులను గౌరవించే సంస్కారం ఉన్న ఈ దేశంలో పూర్తిగా మృగ్యం కావడం దారుణం కాక మరోటి కాదు. ఆలస్యంగా అయినా ముస్లిం మహిళలకు కొత్త చట్టంతో ఊరట దక్కనుంది. ఒకేసారి ముమ్మారు తలాక్‌ చెప్పి విడాకులిచ్చే పద్ధతిని నిషేధించే ప్రవేశపెట్టిన బిల్లు చట్టరూపం దాల్చడంతో ఇకముందు కూడా నేక ఛాందసవాడ చట్టాలకు పాతరవేయాల్సిన అవసరం ఏర్పడింది. తక్షణ, ముమ్మారు తలాక్‌ చెప్పడం చట్ట విరుద్ధమని, అలా చేసిన భర్తకు మూడేళ్ల వరకు కారాగార శిక్ష విధించ వచ్చని ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు-2018 పేర్కొంటోంది. ఇదివరకే లోక్‌సభ ఆమోదం తెలిపి, రాజ్యసభలో ఆమోదం కోసం నిరీక్షిస్తున్న బిల్లు ఆమోదంతో దేశంలో నవశకం మొదలయ్యిందనే చెప్పాలి. తీవ్ర చర్చోపల నేపథ్యంలో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. ఈ ముసాయిదాను క్షుణ్నంగా పరిశీలించాల్సి ఉన్నందున పార్లమెంటు ఉభయసభల సభ్యులతో కూడిన సెలెక్ట్‌ కమిటీ పరిశీలనకు దీనిని పంపించాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించలేదు. నిజంగానే విపక్షాలకు 
అంత శ్రద్ద ఉంటే దీనిపై పార్లమెంటులోనే చర్చకు అవకాశం కల్పించే వాతావరణం ఉండేది. నిర్దిష్టంగా ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకోవాలనే ఉద్దేశమేదీ లేదని ప్రభుత్వం స్పష్టం చేసినా విపక్షాలు విజ్ఞత ప్రదర్శించ లేకపోయాయి. ఓటు బ్యాంక్‌ రాజకీయాలకు అలవాటు పడిన నేతలకు విశాల ప్రయోజనాలు కానరావ నడానికి ఈ బిల్లును ఉదాహరణగా చూడాలి. ముస్లిం మహిళలకు న్యాయం చేకూర్చి,గౌరవాన్ని కల్పించా లనేదే బిల్లు వెనుక ప్రయత్నమని న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ వివరించారు. సతి ఆచారాన్ని వరకట్నాన్ని, పార్లమెంటు నిషేధించ గలిగినప్పుడు తక్షణ తలాక్‌నూ నిషేధించవచ్చని మంత్రి స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలు కూడా గమనార్హం. స్వలింగ సంపరాన్ని, వివాహేతర సంబంధాలను నేరం కాదని చెప్పి ముమ్మారు తలాక్‌ను నేరమని ఎలా అంటారని మజ్లిస్‌ ఎంపి ఒవైసీ ప్రశ్నించడంలోనూ ఔచిత్యం లేదు. ముమ్మారు తలాక్‌ పద్ధతి రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు చెప్పాక దానిని ఆమోదించడం మినహా మరో మార్గం ప్రభుత్వం ముందు లేకపోయిందనే భావించాలి. అలాగే మత జాడ్యం వదిలించే ఇలాంటి చట్టాలతో మహిళలకు అండగా నిలవాలన్న విశాల దృక్పథాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాలి. ఈ బిల్లుతో ముస్లిం మహిళలను కట్టుబానిసత్వం నుంచి బయటపడేసే చర్యలకు ఓ సువర్ణావకాశం వచ్చింది. భారత దేశంలో కులమతాలకు అతీతంగా మహిళల పట్ల గౌరవభావం ఉంది. వారిపట్ల ఆరాధనా భావం ఉంది. ముస్లిం మహిళలు అయినంత మాత్రాన కట్టుబానిసలుగా ఉండాల్సిన అవసరం లేదు వారంతా ఆధునిక భావాలతో తమ మహిళలకు కూడా సమ గౌరవం ఇచ్చేలా చూడాల్సిన అవసరాన్ని గుర్తించాలి. ముస్లిం మహిళలు కేవలం కట్టుబానిసలుగా, సెక్స్‌ బానిసలుగా జీవనం వెల్లదీస్తున్న ఘటనలు కోకొల్లలు. వారి జీవితాల్లో వెలుగు నింపేందుకు విడాకులను ఏకపక్షంగా తలాక్‌ విధానాన్ని తొలగించే మహత్తర చారిత్రక ఘట్టాన్ని ఆహ్వానించాల్సిన బాధ్యత ముస్లిం మేధావులపైనే ఉంది.