బిగ్‌..లా(బా)స్‌ ప్రసారానికి ముందే వివాదంలో బిగ్గెస్ట్‌ రియాలిటీ షో

* పార్టిసిపెంట్స్‌ ఎంపికనుంచి హోస్ట్‌ వరకూ అంతా వివాదమే 
* రెండు సీజన్లు విజయవంతంగా పూర్తిచేసుకున్న బిగ్‌బాస్‌ 
* మూడో సీజన్‌ బాస్‌ చుట్టూ అల్లుకుంటున్న వివాదాలు 
* హోస్ట్‌గా ఒప్పుకున్న అక్కినేని నాగార్జున 
* నాగ్‌ ఇమేజ్‌కు తలనొప్పిగా మారిన క్యాస్టింగ్‌ కౌచ్‌ వివాదాలు 
* నటి గాయత్రి గుప్తా, జర్నలిస్ట్‌ శ్వేతారెడ్డి ఫిర్యాదులు 
* వివాదాస్పద షోను ఆపేయాలని హైకోర్టులో పిటిషన్లు 
* 21నుంచి ప్రసారం కానున్న బిగ్‌బాస్‌ 
* అసలు ప్రసారం అవుతుందా? ఆలస్యం అవుతుందా? 
* గందరగోళంలో బుల్లితెర వీక్షకాభిమానులు  

హైదరాబాద్‌: 
బిగ్‌ బాస్‌ 3 షో గురించి ఎందుకిన్ని వివాదాలు..? అసలెందుకు ఇంత చర్చ..? ఏం, ఆ షో చూడకపోతే స్కూళ్లకి వెళ్లమని పిల్లలు మారాం చేస్తున్నారా, ఉద్యోగాలు చేయలేమని కుర్రాళ్లు గగ్గోలు పెడుతున్నారా, మాకు ఇదే దిక్కని మహిళలు వాపోతున్నారా, స్టాక్‌ మార్కెట్‌ పడిపోతుందా..? లేదు కదా! ఒక మామూలు రియాలిటీ షో. కొంతమంది ఒక ఇంట్లో పడి వాదులాడుకుంటే, వారానికో పంచాయితీ పెట్టి వాళ్లని ఇంటికి తగిలేయడం.. ఇదేగా కాన్సెప్ట్‌! పక్కింటి జట్టీల మీద ఆసక్తి కనబరచడం అనే మానవ నైజం. ఈ వీక్‌ పాయింటే బిగ్‌ బాస్‌ సక్సెస్‌కి కారణమైన సైకలాజికల్‌ ఫాక్టర్‌. ఆ మాత్రం దానికి ఎందుకింత హైప్‌ క్రియేట్‌ చేసేలా కథనాలు వస్తున్నాయి..? 


రియాలిటీ షో ‘బిగ్‌బాస్‌’పై వివాదం ముదురుతోంది. తెలుగులో రెండు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్‌బాస్‌ షో.. త్వరలో ప్రారంభం కానున్న మూడో సీజన్‌ విషయంలో ఆది నుంచే వివాదాస్పదంగా మారింది. బిగ్‌బాస్‌ షో అంటేనే నచ్చదని చెప్పిన నాగార్జునను హోస్ట్‌గా తీసుకోవడం దగ్గర నుంచి పార్టిసిపెంట్స్‌ ఎంపిక వరకు ప్రతిదీ వివాదాస్పదంగా మారింది. నటి గాయత్రి గుప్తా, జర్నలిస్ట్‌ శ్వేతారెడ్డి బిగ్‌బాస్‌ నిర్వాహకులపై కాస్టింగ్‌ కౌచ్‌ కింద బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా బిగ్‌బాస్‌ షోను ఆపేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అంతకు ముందు మానవహక్కుల సంఘాన్ని కూడా ఆశ్రయించారు. బిగ్‌బాస్‌ షోపై రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో కూడా కేసు నమోదైంది. 


బిగ్‌బాస్‌ టీమ్‌ క్వాష్‌ పిటిషన్‌ 
ఈ నేపథ్యంలో బిగ్‌బాస్‌ కోఆర్టినేషన్‌ టీమ్‌ కూడా హైకోర్టును ఆశ్రయించింది. బంజారాహిల్స్‌, రాయదుర్గం పోలీస్‌ స్టేషన్లలో ‘బిగ్‌బాస్‌’పై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ షో నిర్వాహకులు క్వాష్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు. 
‘బిగ్‌బాస్‌’కు సెన్సార్‌ చేయాలి: కేతిరెడ్డి 
సినిమాలాగే బిగ్‌బాస్‌కు సంబంధించి ప్రతి ఎపిసోడ్‌నూ సెన్సార్‌ చేయాలని దర్శకనిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. రాత్రి 11 గంటల తర్వాతే షోను ప్రసారం చేయాలని ఆ పిటిషన్‌లో కేతిరెడ్డి పేర్కొన్నారు. హోస్ట్‌ నాగార్జునతో పాటు 10 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ కేతిరెడ్డి పిల్‌ను దాఖలు చేశారు. 
వేర్వేరుగా కేసులు: 
జర్నలిస్టు శ్వేతా రెడ్డి, నటి గాయత్రి గుప్తా హైదరాబాద్‌లోని వేర్వేరు పోలీస్‌ స్టేషన్లలో ‘బిగ్‌ బాస్‌’ నిర్వాహకులుగా చెబుతున్నవారిపై కేసులు పెట్టారు. నిర్వాహకులు తమతో అసభ్యకరంగా మాట్లాడారని, ‘బిగ్‌ బాస్‌’ షో కోసం ఎంపిక చేసి తరువాత తీసుకోలేదని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. స్టార్‌ మా కోఆర్డినేటర్లు రవికాంత్‌, రఘు, స్టార్‌ మా ముంబై హెడ్‌ అభిషేక్‌, స్టార్‌ మా ప్రొగ్రామింగ్‌ ప్రొడ్యూసర్‌ శ్యామ్‌లపై జులై 13న జి. శ్వేతా రెడ్డి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారిపై ఐపీసీ సెక్షన్‌ 354 (మహిళను కించపరచడం) కింద కేసు నమోదు చేశారు. మార్చి నుంచి ఇప్పటి వరకూ తనకు, బిగ్‌ బాస్‌ బందానికీ మధ్య జరిగిన సంభాషణల్ని ఫిర్యాదులో పేర్కొన్న శ్వేత, జూన్‌ 4వ తేదీన హైదరాబాద్‌లోని శ్రీనగర్‌ కాలనీలో ఒక రెస్టారెంట్లో జరిగిన ఘటనను వార్తాఛానళ్లకు వివరించారు. 
”మీరు బిగ్‌ బాస్‌ను ఎలా సంతప్తి పరుస్తారు? మీరు ఆకర్షణీయంగా కనిపించడానికి లావు తగ్గాలి. ఆకర్షణీయంగా ఉంటేనే బిగ్‌ బాస్‌ ఇంప్రెస్‌ అవుతారు” అని శ్యామ్‌ తనతో అన్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు శ్వేత తెలిపారు. మరోవైపు, జులై 14న రాయదుర్గం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు గాయత్రి గుప్త. అభిషేక్‌, రఘులపై ఈమె ఫిర్యాదు చేశారు. ”మార్చిలో బిగ్‌ బాస్‌ కోసం నాతో ఒప్పందం చేసుకుని, వంద రోజుల పాటు ఏ ప్రాజెక్టూ ఒప్పుకోవద్దని షరతు విధించారు. దానివల్ల ఎన్నో ఆఫర్లను వదులుకున్నాను. కానీ జూన్‌ 25న కాల్‌ చేసి, నేను షోలో ఉండకపోవచ్చని చెప్పారు. దీనివల్ల ఎంతో నష్టపోయాను” అని గాయత్రి తన ఫిర్యాదులో ఆరోపించారు. 
”మీరు వంద రోజులు సెక్స్‌ లేకుండా ఎలా ఉంటారు అని అభిషేక్‌ అనే వ్యక్తి తుది చర్చల సమయంలో అడిగారు” అని తన ఫిర్యాదులో చెప్పారు గాయత్రి. తాము ఇప్పుడు మళ్లీ ఆఫర్‌ వచ్చినా ‘బిగ్‌ బాస్‌’కి వెళ్లబోమనీ, తమలా ఎవరికీ ఇలా కాకూడదనే ఫిర్యాదు చేసినట్టు చెప్పారు శ్వేత. దీనిపై ‘స్టార్‌ మా’ స్పందించాల్సి ఉంది. 
ప్రస్తుతం కేసు విచారణలో ఉందని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు బంజారాహిల్స్‌ పోలీసులు. మరోవైపు బిగ్‌ బాస్‌ గేమ్‌ షోపై శ్వేతా రెడ్డి, గాయత్రి గుప్త రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కి ఫిర్యాదు చేశారు. 
ఆరోపణల్ని ఖండించిన బిగ్‌ బాస్‌ బందం 
బిగ్‌ బాస్‌ 3 లైంగిక వేధింపుల ఆరోపణలను బిగ్‌ బాస్‌ బందం ఖండించింది. శ్వేత, గాయత్రీలు చేసిన ఆరోపణలన్నీ తప్పని పేరు చెప్పడానికి ఇష్టపడని బంద సభ్యులు ఒకరు అన్నారు. దీనిపై తాము కూడా చట్టపరంగా ముందుకు వెళ్తామని, అన్ని సాక్ష్యాలనూ పోలీసులకూ, కోర్టుకూ అందిస్తామనీ చెప్పారు. బిగ్‌ బాస్‌ ఎంపిక ప్రక్రియలో భాగంగా ఎన్నో వ్యక్తిగత ప్రశ్నలు అడుగుతామనీ, హౌస్‌కి వచ్చే వ్యక్తి మానసికంగా, శారీరకంగా సన్నద్ధంగా ఉన్నారా లేదా అని తెలుసుకోవడం కోసమే అలా చేస్తామని వివరించారు. అయితే వాటిలో ఏవీ కించపరిచే ప్రశ్నలుండవని వివరించారు. గతంలో ఎవరికీ ఇలాంటి అనుభవం ఎదురుకాలేదనీ, కావాలంటే గతంలో బిగ్‌ బాస్‌లో పాల్గొన్న మహిళలను సంప్రదించవచ్చన్నారు. మహిళలను కించపరిచే, అగౌరవపరిచే, లైంగికంగా వేధించే ఎటువంటి మాటలూ, చర్యలు తాము చేయలేదని వారు వివరణ ఇచ్చారు. దీనిపై సంస్థ చట్టపరమైన చర్యలు తీసుకుంటుందన్నారు. బిగ్‌ బాస్‌కి ఎంపిక కానందువల్లే, చర్చలు జరిగిన ఇంతకాలం తరువాత వారు తప్పుడు ఆరోపణలతో ఫిర్యాదు చేస్తున్నారని ఆరోపించారు. ”లైంగిక వేధింపులు జరిగితే వారు అసలు షోలో పాల్గొనడానికి ఎలా ఒప్పుకున్నారు? షోలో తమ పేరు ఉండదనేసరికి ఇదంతా చేస్తున్నారంటేనే అవి అసత్య ఆరోపణలని అర్థం చేసుకోవచ్చు కదా.. వారికి ఒకవేళ షోలో పాల్గొనే అవకాశం వస్తే, వారు ఎప్పటికీ కేసులు పెట్టేవారు కాదు కదా” అని బిగ్‌ బాస్‌ బందం చెబుతోంది. 
మరోవైపు బిగ్‌ బాస్‌ 1 లో పాల్గొన్న కత్తి కార్తీక మాత్రం బిగ్‌ బాస్‌ బందంపై ప్రశంసలు కురిపించారు. తాను యన్టీఆర్‌తో దిగిన సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఆమె, ప్రొఫెషనలిజం, ఆతిథ్యం వల్లే ఆ షోకి సంతకం పెట్టానన్నారు. ఆ షో వల్లే తనను తెలుగు ప్రేక్షకులు గుర్తుంచుకున్నారని వ్యాఖ్యానించారు. బిగ్‌ బాస్‌2 లో పాల్గొన్న, పేరు వెల్లడించేందుకు ఇష్టపడని మరో మహిళతో మాట్లాడగా, తనకు ఎలాంటి వేధింపులూ ఎదురు కాలేదని సమాధానం ఇచ్చారు. 
ప్రసార సమయం మార్చాలని పిటిషన్‌: 
మోస్ట్‌ పాపులర్‌ రియాలిటీ షో బిగ్‌ బాస్‌ను రోజుకో వివాదం వెంటాడుతోంది. బిగ్‌ బాస్‌ త్రీ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతోంది. అయితే..బిగ్‌ బాస్‌ బూతు షో అంటూ హైకోర్టులో పిటీషన్‌ దాఖలైంది. రియాలిటీ షో ముసుగులో అశ్లీలత ఎక్కువగా చూపిస్తున్నారన్నది పిటీషనర్‌ వాదన. బిగ్‌ బాస్‌ త్రీలో ప్రసారం అయ్యే ప్రతీ ఎపిసోడ్‌ సినిమా తరహాలోనే సెన్సార్‌ చేయాలని కోరారు. ఇక షో ప్రసారం చేసే సమయంపైనా పిటీషనర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. అశ్లీలత ఎక్కువగా ఉంటుంన్నందున రాత్రి పదకొండు గంటల తర్వాతే ప్రసారం చేయాలన్నారు. బిగ్‌ బాస్‌ త్రీ హోస్ట్‌ నాగార్జునతో పాటు 10 మందిని ప్రతివాదులుగా చేర్చారు పిటీషనర్‌. 
గతంలో బిగ్‌ బాస్‌ షో ప్రారంభం అయ్యాక వివాదాలు ప్రారంభం అయ్యేవి. కానీ, బిగ్‌ బాస్‌ త్రీకి మాత్రం హౌజ్‌ మేట్స్‌ ఎంపిక దశలోనే కాంట్రవర్సీకి కేరాఫ్‌గా మారింది. బిగ్‌ బాస్‌కు సెలక్ట్‌ చేయాలంటే కమిట్‌మెంట్‌ అడుగుతున్నారంటూ కో-ఆర్డినేటర్లు, ప్రొడ్యూసర్లపై ఆరోపణలు వచ్చాయి. గతంలో న్యూస్‌ రీడర్‌, జర్నలిస్ట్‌ అయిన శ్వేతారెడ్డితో పాటు గాయిత్రి గుప్త ఏకంగా పోలీసులు ఫిర్యాదు చేశారు. కో-ఆర్డినేటర్‌ రవికాంత్‌ తనను కమిట్‌ మెంట్‌ అడుగుతున్నట్లు శ్వేతారెడ్డి తొలిసారి బిగ్‌ బాస్‌ త్రీ సెలక్షన్స్‌పై ఆరోపణలు చేశారు. బిగ్‌ బాస్‌ నిర్వాహాకులపై చర్యలు తీసుకోవాలంటూ ప్రోగ్రాం ఇన్‌ఛార్జ్‌లు శ్యామ్‌, రఘుపై జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.