ఆన్‌లైన్‌ చార్జీలను ఎత్తివేసిన ఎస్బీఐ బ్యాంక్‌

న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్బీఐ) ఖాతాదారులకు శుభవార్తను చేరవేసింది. డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా ఆర్టీజీఎస్‌, నెఫ్ట్‌, ఐఎంపీఎస్‌ల ద్వారా జరిపే అన్ని రకాల లావాదేవీలపై చార్జీలను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు శుక్రవారం బ్యాంక్‌ ప్రకటించింది. బ్యాంక్‌ తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, ఎస్బీఐ యాప్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ ద్వారా లావాదేవీలు జరిపే ఖాతాదారులు ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా రిజర్వు బ్యాంక్‌ ఆన్‌లైన్‌ చార్జీలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటనకు అనుకూలంగా బ్యాంక్‌ ఈ నిర్ణయం తీసుకున్నది. బ్యాంకింగ్‌ రంగంలో 25 శాతం వాటా కలిగిన ఎస్బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇతర బ్యాంకులు కూడా ఈ చార్జీలను ఎత్తివేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఆన్‌లైన్లో అధికమొత్తంలో లావాదేవీలు జరిపేవారు రియల్‌ టైం గ్రాస్‌ సెటిల్‌మెంట్‌(ఆర్టీజీఎస్‌)ను, రూ.2 లక్షల వరకు లావాదేవీలు జరిపేవారు నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌(నెఫ్ట్‌)ను వినియోగిస్తున్నారు. ఈ నెల 1 నుంచి ఈ చార్జీల ఎత్తివేత అమలులోకి వచ్చింది. 
అలాగే అత్యవసరంగా చెల్లింపుల సేవలు(ఐఎంపీఎస్‌)ను వినియోగించి మొబై ల్‌ ఫోన్‌ ద్వారా నగదును బదిలీ చేసే వారిపై విధించే చార్జీలను సైతం బ్యాంక్‌ ఎత్తివేసింది. ఆగస్టు 1 నుంచి ఇవి అమలులోకి రానున్నాయి. గతంలో నెఫ్ట్‌ ద్వారా జరిపే ప్రతి లావాదేవీపై రూపాయి నుంచి రూ.5 వరకు, ఆర్టీజీఎస్‌ ద్వారా జరిపే లావాదేవీలపై రూ.5 నుంచి రూ.50 వరకు చార్జీలు విధిస్తుండేది. మార్చి 2019 చివరినాటికి బ్యాంక్‌కు ఉన్న మొత్తం ఖాతాదారుల్లో ఆరు కోట్ల మంది ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సేవలను వినియోగిస్తుండగా, వీరిలో 1.41 కోట్ల మంది మొబైల్‌ బ్యాంక్‌ సేవలు పొందుతున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న మొబైల్‌ బ్యాంకింగ్‌ లావాదేవీల్లో ఎస్బీఐకి 18 శాతం వాటా ఉన్నది. డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా ఇప్పటికే బ్యాంక్‌ యోనో (మీకు మాత్రమే అవసరం) యాప్‌ను ఆవిష్కరించింది. దీంతో మరింత మందిని వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఈ నిర్ణయం దోహదం చేయనున్నదని బ్యాంక్‌ వర్గాలు వెల్లడించాయి. బ్యాంక్‌ ఇప్పటికే శాఖల ద్వారా జరిపే నెఫ్ట్‌, ఆర్టీజీఎస్‌ లావాదేవీలను చార్జీలను 20 శాతం తగ్గించిన విషయం తెలిసిందే. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు, దీంతో యోనోకు మరింత ప్రచారం కల్పించడానికి లైన్‌క్లియర్‌ అయిందని బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌(రిటైల్‌, డిజిటల్‌ బ్యాంకింగ్‌) పీకే గుప్తా తెలిపారు.