శ్రీవారి సొమ్ముకు ఎసరు ?
- మళ్లీ స్వామి వారి డబ్బులకు ఎసరు
- అప్పుల్లో ఆంధప్రదేశ్ ప్రభుత్వం
తిరుమల,జ్యోతిన్యూస్ :
ఏపీ ప్రభుత్వానికి ఇప్పుడు అప్పు పుట్టడం లేదు. ఇంకా చెప్పాలంటే ఇప్పటికే చేసిన అప్పులు క్రెడిట్ లిమిట్ దాటిపోగా కొత్తగా అప్పు తెచ్చే మార్గమే లేదు. మరోవైపు ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా పడిపోయింది. కరోనాకు ముందే భారీగా తగ్గిన ఆదాయం కాస్త.. కరోనాతో పూర్తిగా చతికిలా పడింది. అయితే, ప్రభుత్వం మాత్రం ఉచిత పథకాలు, నగదు పంపకాలలో ఏ మాత్రం తగ్గడం లేదు. ఉన్నవి చాలదన్నట్లుగా కొత్త పథకాలను తెస్తున్న సర్కార్ అందుకోసం కొంతమేర తిరిగి ప్రజల వి•దనే పన్నుల బాదుడు కూడా మొదలుపెట్టింది.ప్రజల వి•ద పన్ను భారం మోపినా.. ప్రతి నెలా ప్రభుత్వ బాండ్లను తాకట్టు పెట్టినా ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, సంక్షేమ పథకాలకు నిధుల కొరత వేధిస్తూనే ఉంది. ఇప్పటికే ఏడాదికి ఉండే అప్పులో డెబ్భై శాతం ఇప్పటికే తెచ్చేసుకున్న ప్రభుత్వం ఇప్పుడు అప్పుల బాధలో చెల్లింపులకు కొత్త మార్గాలను వెతుకుతుంది. అందులో భాగంగానే తిరుమల శ్రీవారి సొమ్ముకు ఎసరు పెట్టింది. వెంకన్న సొమ్ముతో ప్రభుత్వ బాండ్లను కోలుగోలు చేయించి టీటీడీ సొమ్మును ప్రభుత్వానికి మళ్లిం చాలని నిర్ణయం తీసుకున్నట్లుగా వినిపిస్తుంది. అందుకొరకు ముచ్చటగా కథా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుతం టీటీడీ సొమ్ము జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తున్నారు. ఈ బ్యాంకుల ద్వారా ప్రస్తుతం 3 నుంచి 4 శాతం మాత్రమే వడ్డీ లభిస్తుంది. అదే ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేస్తే తద్వారా 7 శాతం వడ్డీ లభించే అవకాశం ఉందని టీటీడీ ఆర్థిక మేధావులు అంచనా వేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వ బాండ్లతో పాటు కేంద్ర ప్రభుత్వ బాండ్లను కూడా కొనుగోలు చేస్తామని టీటీడీ పెద్దలు ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే టీటీడీ పాలకమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తుండగా ఇప్పటికే ప్రభుత్వ పెద్దలతో టీటీడీ పెద్దలు చర్చించి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బాండ్లను కొను గోలు చేస్తామని టీటీడీ పెద్దలు చెప్పినా దాని వెనుక మర్మం మాత్రం టీటీడీ సొమ్మును ప్రభుత్వానికి మళ్లించడ మేనని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బ్యాంకులను కాదని ప్రభుత్వంలో శ్రీవారి పెట్టుబడులు పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది.ఇప్పటికే టీటీడీ భూముల అమ్మకంపై వివాదాలు చెలరేగగా ఈ మధ్యనే రాష్ట్రంలో హిందూ ఆలయాలలో దాడులు, ప్రమాదాలు సంచలనంగా మారి తీవ్ర వివాదాలను రేపుతున్నాయి. ఇవి చల్లారేలోపు టీటీడీ సొమ్ము ప్రభుత్వంలోకి మళ్లించడం మరో వివాదంగా మారడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వాన్ని ఆర్ధికంగా ఆదుకొనే సామర్ధ్యం ఒక్క ఆ వెంకన్నకే ఉండగా ఆ మార్గాన్ని ప్రభుత్వం అమలు చేయాలని చూస్తుంది.అయితే, తరతరాలుగా ఎన్నడూ లేని విధంగా టీటీడీ సొమ్ము ప్రభుత్వం వాడుకోవడం మొదలైతే అపరకుభేరుడైన శ్రీవారు సైతం అప్పులపాలు కావడం ఖాయమనే విశ్లేషణలు వినిపిస్తున్నా యి. మరి ప్రభుత్వం ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తుందన్నది చూడాల్సి ఉంది.