తెలంగాణలో రెండోరోజూ కఠినంగా లాక్‌డౌన్
- అడుగడుగునా పోలీసుల పహారా
- పటిష్టవంతంగా అమలు
- ఉదయం వేళలో కిక్కిరిసిన మార్కెట్లు
- రోడ్లపైకి దూసుకుని వచ్చిన జనాలు
- రంజాన్ పండగ నేపథ్యంలో పెరిగిన కొనుగోళ్లు
- వివాహాలు,అంత్యక్రియల అనుమతులపై అస్పష్టత
- అనుమతులు ఎక్కడ తీసుకోవాలో తెలియక అయోమయం
హైదరాబాద్,జ్యోతిన్యూస్ :
తెలంగాణలో రెండో రోజు లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఉదయం పది గంటల వరకే సమయం ఉండటంతో నిత్యావసరాల కోసం ప్రజలు పెద్ద ఎత్తున మార్కెట్లకు తరలివచ్చారు. దీనికితోడు రంజాన్ కారణంగా మార్కెట్లు కిక్కిరిసి పోయాయి. మరోవైపు.. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు హైదరాబాద్‌ను వీడి సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. లాక్‌డౌన్ ఆంక్షల సడలింపు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే కావడంతో ఈ సమయంలో మార్కెట్లకు రావడం జరిగింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కుకు వేలసంఖ్యలో వలస కార్మికులు చేరుకుంటున్నారు. దీంతో.. రిజర్వేషన్ ఉన్నవారినే చెక్ చేసి రైల్వే అధికారులు వారిని స్టేషన్ లోపలికి అనుమతిస్తున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఒరిస్సా, యూపీ, మహారాష్ట్రలకు కూలీలు తరలివెళ్లారు. స్టేషన్ బయట కిలోటర్ల మేర బారులు తీరారు. నల్గొండ జిల్లాలో రెండోరోజు లాక్ డౌన్ అమలవుతోంది. లాక్ డౌన్ సడలింపు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే ఉండడంతో 65వ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. 4 గంటలల్లోనే 7వేల వాహనాలు వెళుతున్నాయి. తమ గమ్య స్థానాలకు చేరేందుకు సొంత వాహనాల్లో వెళుతున్నారు. టోల్ ప్లాజాల వద్ద పాస్టాగ్ ఉండడంతో వాహనాలు దూసుకుపోతున్నాయి. రోజుకు నాలుగు నుంచి ఐదువేల వాహనాలు మాత్రమే వెళ్లేవి. అలాంటిది ఇప్పుడు కేవలం 6 గంటల నుంచి 10 గంటల సమయంలో 7 వేలకుపైగా వాహనాలు వెళుతున్నాయి.కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి కూరగాయల మార్కెట్‌లో ప్రజలు బారులు తీరారు. రంజాన్ సందర్భంగా నిత్యావసర వస్తువుల కొనుగోలుకు మైనార్టీలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఉదయం 10 వరకే దుకాణాలు తెరిచి ఉండటంతో పలు మార్కెట్లు రద్దీగా మారాయి. కరీంనగర్‌లో పలు చోట్ల మార్కెట్లు కిక్కిరిసిపోయాయి. లాక్‌డౌన్ ఆంక్షల సడలింపు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కేవలం నాలుగు గంటల పాటు ఉండడంతో నిత్యావసర వస్తువులు, కూరగాయల కోసం జనం అధిక సంఖ్యలో మార్కెట్లకు తరలి వస్తున్నారు. దీంతో పలు చోట్ల రోడ్లు ట్రాఫిక్ జామ్‌తో రద్దీగా మారాయి. అయితే తమకు రంజాన్ సందర్భంగా కొనుగోళ్లకు ఈ సమయం సరిపోదని, కనీసం మరో నాలుగు గంటల సమయం కావాలన్నారు. భువనగిరిలో నిత్యవసర వస్తువులు, కూరగాయల కోసం ప్రజల పెద్ద ఎత్తున మార్కెట్లకు తరలివస్తున్నారు. దీంతో కూరగాయల మార్కెట్లు కిక్కిరిసి పోయాయి. దీంతో రోడ్డపై ట్రాఫిక్ జామ్ అయింది. ఇకపోతే రంజాన్ సందర్భంగా రిటైల్ వ్యాపారులు.. లాక్‌డౌన్ పేరిట లూటీ చేయడం ప్రారంభించారు. లాక్‌డౌన్ ప్రారంభమైన రోజే ధరలు పెంచేసి వినియోగదారుడికి చుక్కలు చూపించారు. రైతుబజార్‌తో పోల్చితే అన్ని కూరగాయలు రెట్టింపు ధరలకు అమ్మకాలు జరిగాయి. అరటి పళ్లు డజను రూ.50 నుంచి 60కి అమ్మారు. ఇక ఎండు పళ్ళ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కరోనా వేళ ఖనిజాలు, లవణాలు అందించే వీటిని కొనాలంటే సామాన్యులు భయపడిపోతున్నారు. కిలో బాదం ధర రూ.1000. వాల్ నట్స్ రూ.1600కు తగ్గడం లేదు. కేజీ ఎండు ద్రాక్ష రూ.500. కరోనాకు ముందు ఉండే ధరలు కంటే రెండింతలు పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. ఎండు ద్రాక్ష ఎక్కువగా మహారాష్ట్ర నుంచి, జమ్ము కాశ్మీర్ నుంచి బాదం నగరానికి వస్తాయి.పోషకాల అంజీర్ కిలో రూ. 1600 పలుకుతోంది. హైదరాబాద్‌లో జనం భారీగా రోడ్లపైకి వచ్చేశారు. ఉదయం నుంచే రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. రేపు రంజాన్ కావడంతో పాతబస్తీలో రద్దీ పెరిగిపోయింది. నిత్యావసరాలు, ఇతర వస్తువుల కోసం పెద్దసంఖ్యలో జనం రోడ్లపైకి వచ్చారు. రాంనగర్ చేపల మార్కెట్‌లో రద్దీ బాగా కనిపించింది. మార్కెట్లలో భౌతికదూరం కొరవడటమే కాకుండా మాస్కులు పెట్టుకున్నవారు సైతం పెద్దగా కనిపించకపోవడం గమనార్హం. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో మరింత కఠినంగా లాక్‌డౌన్ నిర్వహిస్తామని పోలీసులు చెబుతున్నారు.
రోడ్లపైకి భారీగా వచ్చిన జనం
కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పది రోజులపాటు లాక్‌డౌన్ విధించింది. ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సడలింపునిచ్చింది. దీంతో వివిధ అవసరాల నిమిత్తం ప్రజలు భారీగా రోడ్లపైకి వస్తున్నారు. దీంతో ఉదయం 6 గంటల నుంచే నగరంలోని పలు ప్రధాన కూడళ్లలో వాహనాల రద్దీ నెలకొన్నది. నగరంలోని పలు మార్కెట్లు, దుకాణాల వద్ద జనం బారులు తీరారు. రాంనగర్ చేపల మార్కెట్‌లో రద్దీ ఎక్కువగా ఉన్నది. ఉదయం 10 గంటలకు ప్రజా రవాణా సహా అన్ని బంద్‌కానున్నాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో బ్యాంకులు, పోస్టాఫీసుల పనివేళల్లో మార్పులు చేశారు. బ్యాంకులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పనిచేయనున్నాయి. అదేవిధంగా పోస్టాఫీసుల్లో వినియోగదారుల సేవల సమయాలను తపాలా శాఖ కుదించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెద్ద పోస్టాఫీసుల్లో కౌంటర్లు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, చిన్న పోస్టాఫీసుల్లో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు పనిచేయనున్నాయి. డెలివరీ సహా ఇతర సేవలు గతంలో మాదిరిగానే కొనసాగుతాయి.
వివాహాలు, అంత్యక్రియల అనుమతులపై అస్పష్టత
లాక్‌డౌన్‌లో వివాహాలకు 40 మంది, అంత్యక్రియలకు 20 మంది హాజరుకావొచ్చంటూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలో పేర్కొంది. ముందస్తు అనుమతి తీసుకోవాలని ఇచ్చిన ఆదేశాలపై పోలీసులు, రెవెన్యూ సిబ్బందిలో స్పష్ట కానరావడం లేదు. వీటికి ముందస్తు అనుమతి ఎవరు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ముందుగా స్థానిక పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలా, లేక మండల రెవెన్యూ కార్యాలయం నుంచి అనుమతి తీసుకోవాలా లేక ఈ రెండు కార్యాలయాల నుంచి అనుమతి తీసుకోవాలా అనే విషయాలపై ప్రభుత్వపరంగా వివరాలు కొరవడ్డాయి. వివాహాలు, అంత్యక్రియలు నిర్వహించేవారు ముందస్తు అనుమతి కోసం ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో తెలియక ముందుగా పోలీస్‌స్టేషన్‌కు, మండల రెవెన్యూ కార్యాలయాలకు వెళ్తున్నా సరైన మార్గదర్శకాలు లేని కారణంగా ప్రస్తుతానికి దరఖాస్తు తీసుకుని రషీదులు ఇస్తున్నారు. అయినా వీటి తనిఖీలకు ఎవరు వస్తారు, ఎవరి నుంచి అనుమతి పొందాలనే వివరాలపై నిర్వాహకుల్లో అయోమయం తొలగించడానికి సరైన మార్గదర్శకాలు విడుదల చేయాలని కోరుతున్నారు.