‘రేషన్‌’‌కు ఓకే…

  • రేషన్‌ ‌డోర్‌ ‌డెలివరీకి హైకోర్ట్ ‌గ్రీన్‌ ‌సిగ్నల్‌
  • ‌యధావిధిగా పంపిణీకి ఆదేశాలు

అమరావతి,జ్యోతిన్యూస్‌ :
‌రేషన్‌ ‌డోర్‌ ‌డెలివరీకి హైకోర్టు గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో వైసీపీ ప్రభుత్వానికి పెద్ద ఊరట లభించిన్టటైంది. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండడంతో రేషన్‌ ‌డోర్‌ ‌డెలివిరీ వాహనాల వ్యవహారంపై సందిగ్ధం ఏర్పడింది. ఈ వాహనాలను పరిశీలించిన రమేష్‌ ‌కుమార్‌.. ‌వైసీపీ జెండా రంగులను మార్చాలని ఆదేశించారు. అయితే ఈ నిర్ణయాన్ని వైసీపీ ప్రభుత్వం సవాల్‌ ‌చేస్తూ కోర్టును ఆశ్రయించింది. రేషన్‌ ‌వాహనాల రంగు మార్చాలన్న ఎస్‌ఈసీ ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. మార్చి 15 వరకు మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. వాహనాల రంగులు మార్చాలంటే కనీసం మూడు నెలల సమయం పడుతుందని పిటిషన్లో ప్రభుత్వం పేర్కొంది. దీనికి భారీ ఖర్చు కూడా అవుతుందని.. అది ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుందని పిటిషన్‌ ‌లో పేర్కొన్నారు. రేషన్‌ ‌డోర్‌ ‌డెలవరీ పథకం కింద రాష్టా వ్యాప్తంగా సుమారు నాలుగున్నర కోట్ల లబ్దిదారులు ఉన్నారని.. పేదలకు రేషన్‌ ‌పంపిణీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. అలాగే ఈ పథకాన్ని ఎన్నికల కోడ్‌ ‌రాకముందే ప్రారంభించామని పిటిషనలో ప్రభుత్వం పేర్కొంది. పేదల అవస్థలను గుర్తించి రేషన్‌ ‌పంపిణీ అడ్డుకోకుండా ఎస్‌ఈసీని ఆదేశించాలని పిటిషనర్‌ ‌కోరారు. ఈ పిటిషన్‌ ‌కు సంబంధించి తదుపరి విచారణ మార్చి 15కు హైకోర్టు వాయిదా వేసింది. ఇంటింటికీ రేషన్‌ ‌పథకాన్ని గ్రాణ ప్రాంతాల్లో అడ్డుకోకుండా ఎన్నికల కమిషనర్‌ను ఆదేశించాలని కోరుతూ వైసీపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఎస్‌ఈసీ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ ‌చేస్తూ పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ ఈ ‌వ్యాజ్యం దాఖలు చేశారు. దీంతో ఎస్‌ఈసీ ఉత్వర్వులపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరు వర్గాల వాదనల విన్న కోర్టు రేషన్‌ ‌డోర్‌ ‌డెలివరీకి గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. అలాగే రేషన్‌ ‌వాహనాల రంగు మార్చాలన్న ఎస్‌ఈసీ ఆదేశాలపైనా స్టే ఇచ్చింది. హైకోర్టు తాజా ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా వెంటనే రేషన్‌ ‌డోర్‌ ‌డెలివరీకి పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి జిల్లాల్లో ఏర్పాట్లపై ఉన్నతాధికారులు సక్షిస్తున్నారు. ఇటు పంచాయతీ ఎన్నికలు, తాజాగా మున్సిపల్‌ ఎన్నికలతో కోడ్‌ అమల్లో ఉన్నప్పటికీ ఇక నుంచి ఇంటింటికీ రేషన్‌ ‌డోర్‌ ‌డెలివరీ జరగనుంది.