ఆలస్యం వద్దు…!

  • – ఎస్సీ, ఎస్టీ ప్రొటెక్షన్‌ సెల్‌ను మరింత బలోపేతం
  • – కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు
  • – మానిటరింగ్‌ కమిటీ భేటీలో సీఎం జగన్‌ ఆదేశాలు
  • – సమావేశ వివరాలు వెల్లడించిన మంత్రులు

అమరావతి,జ్యోతిన్యూస్‌ :
పెండింగ్‌ కేసులపై సత్వరం విచారణ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. సీఎం అధ్యక్షతన స్టేట్‌ లెవల్‌ హైపవర్‌ ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ భేటీ గురువారం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు మేకతోటి సుచరిత, పినిపే విశ్వరూప్‌, ఆదిమూలపు సురేష్‌ , సీఎస్‌ ఆదిత్య నాథ్‌ దాస్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పాల్గొన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలు గురించి విూడియా సమావేశంలో మంత్రులు వివరించారు. బాధితులకు రావాల్సిన భూమి, ఇతర పరిహారాలు అందించాలని సీఎం సూచించారని మంత్రి పినిపే విశ్వరూప్‌ వెల్లడించారు. భూమి లేని చోట భూసేకరణ చేసైనా భూమి ఇవ్వాలని ముఖ్యమంత్రి చెప్పారని ఆయన తెలిపారు. అట్రాసిటీ కేసులు పెట్టిన వారికి సత్వర న్యాయం అందించాలని సీఎం జగన్‌ సూచించారని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో సవిూక్ష సమావేశం నిర్వహించాలని తమని సీఎం ఆదేశించారని విశ్వరూప్‌ వెల్లడించారు. కలెక్టర్లు, ఎస్పీలు కూడా వారానికి ఒకరోజు ఎస్సీ వాడల్లో పర్యటించాలని.. తద్వారా ప్రభుత్వం వారి వెంట ఉందని భరోసా కల్పించాలని సీఎం చెప్పారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఇదే మొదటి సమావేశమని, గత టీడీపీ ప్రభుత్వ పాలనలో చంద్రబాబు ఒక్కసారి కూడా సమావేశం ఏర్పాటు చేయలేదన్నారు. ఏడాదికి రెండు సార్లు జరగాల్సిన సమావేశం ఒక్కసారి కూడా జరగలేదని తెలిపారు. దళితుల పట్ల చంద్రబాబు చిత్తశుద్ధి ఏమిటో అర్థం చేసుకోవచ్చని మంత్రి విశ్వరూప్‌ విమర్శించారు. గతంలో పోలిస్తే ఎస్సీ,ఎస్టీ కేసులు తగ్గాయని ¬ంమంత్రి సుచరిత అన్నారు. విచారణ సమయం గతంలో 60 రోజులు ఉంటే ఇప్పుడు 50 రోజులకు తగ్గిందన్నారు. అట్రాసిటీ కేసులపై పోలీసులు వెంటనే స్పందిస్తున్నారని తెలిపారు. గతంలో 3.6 శాతం విచారణలు పూర్తయితే ఇప్పుడు 7 శాతానికి పెరిగిందని సుచరిత పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ ప్రొటెక్షన్‌ సెల్‌ను మరింత బలోపేతం చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. బాధితుల పరిహారంపై దృష్టి పెట్టాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారని తెలిపారు. బాధితులకు ఇవ్వాల్సిన భూమి, ఇతర పరిహారాలు అందించాలని, భూమి లేనిచోట భూసేకరణ చేసైనా భూమి ఇవ్వాలని సూచించారని మంత్రి సురేష్‌ వెల్లడించారు. చట్టం అమలులో చాలా ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. 60 రోజుల్లో ఫైల్‌ చేయాల్సిన ఛార్జ్‌షీట్లు కూడా ఫైల్‌ చేయని పరిస్థితి ఉండేదన్నారు. బాధితులకు పరిహారం చెల్లింపుపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలపై దాడుల గణాంకాలను టీడీపీ ముందుంచడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ప్రతి చిన్న విషయానికి కులం, మతం రంగు పులుముతున్నాయని ఆరోపించారు.