శ్రీరామా…వినరా…!!

  • – రామాలయం అభివృద్ధికి దూరం
  • – ఆలనపాలన లేని ఆలయం
  • – ఎనిమిదేళ్లుగా లేని ట్రస్టు బోర్డు
  • – కరోనాతో కుదేలైన దేవాలయ ఆదాయం
  • – జీతాలు లేక ఇక్కట్లల్లో ఉద్యోగులు
  • – సీఎం కేసీఆర్‌ దృష్టి సారించాలన్న పట్టణవాసులు

భద్రాచలం,జ్యోతిన్యూస్‌ :
దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం రామాలయం ఆలనాపాలనా లేక అభివృద్ధికి దూరమవుతుందని భక్తులు ఆవేదన చెందుతున్నారు. ఎనిమిదేళ్లుగా ట్రస్టు బోర్డు నియామకం లేకపోవడంతో పాటు స్థిరమైన ఈవో లేకపోవడంతో భద్రాచల రామయ్య దేవాలయంలో సమస్యలు తిష్ట వేశాయి. జగమెరిగిన దేవదేవుడు శ్రీరామచంద్రుడు కొలువైన భద్రాద్రి రామాలయం కొవిడ్‌ దెబ్బకు కుదేలైంది. ఆదాయం రాక కనుచూపు మేరలో పరిస్థితులు చక్కబడే దారి కాన రాక సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం దృష్టి సారించి కఠిన నిర్ణయాలతో ఆలయ పరిస్థితిని గట్టెక్కించా లని భక్తులు కోరుతున్నారు. కొవిడ్‌కు ముందు రామయ్యకు నెలకు అన్ని విధాలుగా సుమారు 3 కోట్ల ఆదాయం ఉండేది. ఇప్పుడు ఆదాయం భారీగా తగ్గి లక్షలకు పడిపోయింది. దీన్ని ఆ స్థాయిలో పెంచాలంటే ఇప్పట్లో కుదిరే పని కాదనేది విమర్శలు వస్తున్నాయి. ఆదాయం తగ్గడంతో రెగ్యులర్‌ ఉద్యోగులకు మూడు నెలల నుంచి జీతాలు రావడం లేదనే విమర్శ ఉంది. విశ్రాంత ఉద్యోగులకు రెండు నెలల నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. పొరుగు సేవల ఉద్యోగులకు ఆరు నెలలుగా జీతం అందడం లేదు.హుండీల కానుకలు కూడా బాగా తగ్గాయి.ఇలాంటి పరిస్థితుల్లో గత్యంతరం లేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ లను నగదుగా మార్చుకోవాల్సి వచ్చిందంటున్నారు.భద్రాచలం రామాలయం సమ స్యలకి నిలయంగా మారుతోంది. ఇక్కడ రెగ్యులర్‌ ఈవో లేకపోవడంతో కొందరు సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరి స్తున్నారు. వారం రోజుల క్రితం కొత్త ఈవోగా శివాజీని నియమించారు. కొత్త ట్రస్టు బోర్డు ఏర్పాటు వ్యవహారం కూడా చర్చకు వస్తోంది. భద్రాచలం దేవాలయం ట్రస్ట్‌ బోర్డ్‌ నియామకానికి ఐదేళ్ల క్రితం ప్రభుత్వం సన్నాహాలు చేసింది. ప్ర భుత్వం మొదటి నుండి యాదాద్రి కి ఇచ్చిన ప్రాముఖ్యత భద్రాద్రికి ఇవ్వడం లేదనే భావన భక్తుల్లో ఉంది.ఇప్పటికే ఆదాయం లేక ఇబ్బందుల్లో ఉన్న పాలన గాడిలో పడాలంటే భద్రాచలం రామాలయం నూతన పాలక మండలి ఏర్పా టు చేసి దేవాలయం అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయాలని భక్తులు కోరుతున్నారు.ఈ విషయంలో దైవ భక్తి ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తక్షణం స్పందించి రామాలయం అభివృద్ధిపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని భద్రాచల పట్టణ ప్రజలు కోరారు.