హైదరాబాద్‌లో ఫైనాన్స్‌ వ్యాపారి.. కిడ్నాప్‌ కలకలం

  •  రూ.3కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ 
  • – రూ. కోటి ఇవ్వడంతో అబిడ్స్‌లో వదిలివెళ్లిన కిడ్నాపర్లు 
  • – కిడ్నాపర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు 

హైదరాబాద్‌, జులై29 : హైదరాబాద్‌ మహానగరంలో వరుస కిడ్నాప్‌లు కలకలం రేపుతున్నాయి. హయత్‌నగర్‌లో బీఫార్మసీ కిడ్నాప్‌ వ్యవహారంలో ఆరు రోజులైనా ఎలాంటి పురోగతి లేక తలలు పట్టుకున్న పోలీసులకు తాజాగా వ్యాపారి కిడ్నాప్‌ కేసు ఉలిక్కిపడేలా చేసింది. చిక్కడపల్లికి చెందిన గజేంద్ర ప్రసాద్‌ అనే వ్యక్తి ఆటోమొబైల్స్‌ ఫైనాన్స్‌ చేస్తుంటాడు. ఆదివారం రాత్రి ఆయన్ని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారు. రూ.3కోట్ల ఇస్తేనే ఆయన్ని విడుదల చేస్తామని కుటుంబసభ్యులకు ఫోన్‌ చేసి చెప్పారు. సోమవారం ఉదయం రూ.కోటి తీసుకుని గజేంద్ర ప్రసాద్‌ను అబిడ్స్‌లో వదిలి వెళ్లిపోయారు. నగరం నడిబొడ్డున నడిచిన కిడ్నాప్‌ వ్యవహారం గురించి తెలుసుకున్న పోలీసులు బాధితుడు గజేంద్ర ప్రసాద్‌ను ప్రశ్నించారు. అతడు చెప్పిన వివరాలతో కిడ్నాపర్ల కోసం గాలింపు చేపట్టారు. గజేంద్రకు ముంబైలోని వ్యాపారవేత్తలతో గొడవలు ఉన్నాయని, అతడిని వారే కిడ్నాప్‌ చేయించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 
కిడ్నాపర్లతో నాకు ప్రాణహాని ఉంది – గజేంద్ర ప్రసాద్‌ 
తన ప్రాణానికి ముప్పు ఉందని కిడ్నాపర్ల చెర నుంచి బయటపడిన వ్యాపారి గజేంద్ర ప్రసాద్‌ అన్నారు. సోమవారం ఉదయం ఇంటికి చేరుకున్న ఆయన తీవ్ర భయాందోళన వ్యక్తంచేశారు. తన హత్యకు ముంబయి వ్యక్తుల నుంచి సుపారీ తీసుకున్నట్లు కిడ్నాపర్లు తనకు చెప్పారని ఆయన తెలిపారు. ఆదివారం రాత్రి 11.40 గంటలకు తనను కిడ్నాప్‌ చేసి, కళ్లకు గంతలు కట్టి, చేతులు వెనక్కి విరిచేసి కట్టేశారని అన్నారు. కిడ్నాపర్లు రూ.3కోట్లు డిమాండ్‌ చేయగా, బేరమాడితే రూ.కోటికి అంగీకరించారన్నారు. దీంతో తాను ఫ్రెండ్స్‌కు ఫోన్‌ చేసి చిరాగ్‌లైన్‌కు డబ్బులు తీసుకుని రమ్మని చెప్పానని, అక్కడ కిడ్నాపర్లు డబ్బు తీసుకుని తనను వదిలేశారని రాజేంద్ర తెలిపారు.