తెలంగాణలో తుగ్లక్‌ పాలన

కొత్త భవనాల నిర్మాణాలతో డబ్బు వృధా
ప్రజల సమస్యలు పట్టని సిఎం కెసిఆర్‌
ప్రగతి భవన్‌ పేరుతో ప్రజల సొమ్మునీళ్లపాలు
ఇందిరాపార్క్‌ ధర్నా వద్ద విమర్శలు గుప్పించిన నేతలు
హైదరాబాద్‌,జూలై25: తెలంగాణలో తుగ్లక్‌ పాలన నడుస్తోందని మాజీ ఎంపి, తెలంగాణ ఐక్యవేదిక నాయకులు వివేక్‌ మండిపడ్డారు. పేదలకు ఇళ్లు కట్టించడం, వారికి భూములు ఇవ్వడం లాంటి పనుల పక్కన పెట్టి కొత్తగా సచివాలయం, అసెంబ్లీ కట్టాలా అని ప్రశ్నించారు. వందలకోట్లు పెట్టి ఇప్పటికే ప్రగతిభవన్‌ కట్టుకున్నారని అన్నారు. ఇందరిపార్క్‌ వద్ద జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ కెసిఆర్‌ తీరుకారణంగా తెలంగాణలో సమస్యలు వచ్చాయన్నారు. ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని అన్నారు. వందలకోట్ల ప్రజాధనం వృధా చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ హయాంలో తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని విమర్శించారు. కేసీఆర్‌ నాలుగేండ్ల పాలనలో రూ.లక్ష కోట్లకు పైగా అదనంగా అప్పులు చేశారని అన్నారు. దళితుల మనోభావాలు దెబ్బతీసేలా అంబేద్కర్‌ విగ్రహాన్ని పంజాగుట్టలో తొలగించారనీ.. ప్రజా అవసరాలు పక్కకు పెట్టి ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ నిద్ర పోతున్నారని విమర్శించారు. ప్రతిపక్షాల పోరాటానికి ఇది ఆరంభం మాత్రమే అన్నారు. తెలంగాణ ఉద్యమ స్థాయిలో కెసిఆర్‌ నిరంకుశంపై పోరాడుతామని అన్నారు. కొత్త అసెంబ్లీ, కొత్త సెక్రటేరియట్‌ ఎందుకు కడుతున్నారని హైకోర్టు వేసే ప్రశ్నలకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదన్నారు. కొత్త అసెంబ్లీ, కొత్త సెక్రటేరియట్‌ నిర్మాణంపై కూడా గవర్నర్‌ స్పందించాలని డిమాండ్‌ చేశారు. హెరిటేజ్‌ భవనాలను కూల్చి కొత్త సెక్రటేరియట్‌, అసెంబ్లీ భవనాలు నిర్మించాలను కుంటున్న కేసీఆర్‌ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మాజీ మంత్రి డీకే అరుణ డిమాండ్‌ చేశారు. జనం డబ్బు వేస్ట్‌ చేస్తూ భవనాల నిర్మాణానికి అడుగు ముందుకేస్తే మాత్రం ప్రతిపక్షాలన్నీ ఒక్కటై ఆ కూల్చివేతలు, నిర్మాణాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఉద్యమ ఆకాంక్షలు, ఉద్యమకారులను పక్కకు పెట్టి ఒక్క కుటుంబం కోసం పాలన చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణకు ఉపయోగపడే పని ఒక్కటి కూడా కేసీఆర్‌ చేయలేదన్నారు. కేసీఆర్‌ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేక నిర్ణయాలే తీసుకుంటున్నారన్నారు. చింతమడకను హరీష్‌ రావు కాదు? తానే అభివృద్ధి చేస్తున్నా అని చెప్పడానికి కేసీఆర్‌ ఆ ఊరికి వెళ్లారని డీకే అరుణచెప్పారు. ప్రజాస్వామిక తెలంగాణ వేదిక ఆధ్వర్యంలో ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడారు. తాము బందీల తెలంగాణలో ఉన్నామని, అందుకు సిగ్గుపడుతున్నామని టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్‌ పేర్కొన్నారు. ఉద్యమంలో ఆంధ్ర నాయకులను ప్రశ్నించినట్టు ఇప్పుడు ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలపై పోలీసులు కేసీఆర్‌ను ప్రశ్నించాలన్నారు. హరీష్‌రావు వెన్నుపోటు పొడుస్తాడనే భయంతోనే కేసీఆర్‌ చింతమడకకు వెళ్లారని ఇందిరా శోభన్‌ ఆరోపించారు. కేసీఆర్‌ నియంతలా పాలిస్తున్నాడని, ఆయనను అధికారం నుంచి ప్రజలే తరిమివేస్తారని ఇందిరా శోభన్‌ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామిక తెలంగాణ వేదిక ఆధ్వర్యంలో సెక్రటేరియట్‌ వరకు ర్యాలీని పోలీసులు ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ వద్దే అడ్డుకున్నారు. మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సహా.. మరో 30 మంది నాయకులను ముషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ కు తీసుకెళ్లారు. టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు పీఎల్‌ విశ్వేశ్వర్‌ రావు సహా..
మరో 25 మంది నాయకులను నారాయణ గూడ స్టేషన్‌ కు తీసుకెళ్లారు. పోలీసుల తీరును నాయకులు తప్పుపట్టారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేవరకు తమ పోరాటం ఆగదన్నారు. ఎంత పెట్టి కొత్త అసెంబ్లీ, సెక్రటేరియట్‌ కడతారో చెప్పడం లేదని టీడీపీ అధ్యక్షుడు రమణ అన్నారు. పటిష్టమైన భవనాలను కూల్చి కొత్తవి కట్టడం వలన పబ్లిక్‌ సొమ్ము వృథా అవుతుందని అన్నారు. కొత్త సెక్రటేరియట్‌, కొత్త అసెంబ్లీ కట్టడం మానుకోవాలని డిమాండ్‌ చేశారు. హెరిటేజ్‌ కట్టడాలను కూల్చి వేసే కుట్ర జరుగుతుంని ఆరోపించిన రమణ.. రాష్ట్రంలో లాఠీలతో పాలన కొనసాగుతుందని విమర్శించారు.