చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం
నలుగురు తిరుమల భక్తుల దుర్మరణం
చిత్తూరు,జులై24: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జిల్లాలోని నగరి సవిూపంలోని కన్నమెట్ట వద్ద జరిగిన ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తిరుమల నుంచి తిరిగివస్తున్న కారు, ఓ ప్రయివేటు బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు.. గాయపడ్డ ఇద్దరు మహిళలను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితులంతా తమిళనాడులోని అయ్యప్పతంగల్కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని వస్తున్న సందర్భంలో రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మంగళవారం రాత్రి తిరుపతి-చెనై జాతీయ రహదారి నగరి పట్టణం సవిూపంలోని కన్నామిట్ట ప్రాంతంలో చోటు చేసుకుంది. తమిళనాడులోని నంగనెల్లూరుకు చెందిన అనంతకుమార్(45), బాలాజీ(40), ముత్తుకుమార్(50), మూర్తి(55), హేమలత, జనరంజని తిరుమల దైవదర్శనానికి వ్యానులో వెళ్లారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుగు ప్రయాణంలో మంగళవారం రాత్రి 9.15 నిమిషాలకు చెనై నుంచి తిరుపతికి వస్తున్న తమిళనాడు ఆర్టీసీ బస్సును వ్యాను ఢీకొంది. జాతీయ రహదారిలో ఏర్పడిన గొయ్యిని వ్యాను తప్పించ బోయి బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో అనంతకుమార్, బాలాజీ, ముత్తుకుమార్, మూర్తి అక్కడికక్కడే మృతి చెందారు. వ్యానులో ఉన్న హేమలత, జనరంజని తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను నగరి ప్రభుత్వ
ఆసుపత్రికి తరలించారు. అనంతరం జేసీబీ వాహనంతో వ్యానులో ఇరుక్కు పోయిన మృతదేహాలను బయటకు తీశారు. మృత దేహాలను పోస్టుమార్టర నిమిత్తం నగరి ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు పుత్తూరు సీఐ వెంకటరామిరెడ్డి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆగివున్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
విశాఖపట్నం జిల్లా కశింకోట మండలం ఎన్.జి.పాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని పలాస నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో 12 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు తమ వాహనాల్లో క్షతగాత్రులను అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన బస్సును పలాస డిపోకు చెందినదిగా గుర్తించారు. ఘటనా సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.