పేదలను ఆదుకోవడానికి రూ.65 వేల కోట్లు అవసరం
అంచనా వేసిన ఆర్ బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు దాదాపు రూ.65వేల కోట్లు అవసరమని ఆర్ బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అంచనా వేశారు. అంతేకాకుండా సుదీర్ఘకాలం లా డౌన్ పొడగింపు ఆర్థికవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జరిపిన వీడియో కాన్ఫరెన్స్ లో రఘురాం రాజన్ తన అభిప్రాయాలు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పేద ప్రజల ప్రాణాలను రక్షించడానికి రూ.65వేల కోట్లు తక్షణ అవసరమని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో పేదలనుఆదుకునేందుకు ఎంత డబ్బు అవసరమని రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నకు రాజన్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు. సుదీర్ఘకాలం లాక్ డౌన్ కొనసాగించడం సులభమే అయినప్పటికీ.. అది సుస్థిర ఆర్థికవ్యవస్థకు దోహదపడదన్నారు. లాక్ డౌన్ కొనసాగిస్తూ సుదీర్ఘకాలం పాటు ప్రజలను పోషించే స్తోమత భారత్ కు లేదు. ఈ సమయంలో లాక్ డౌన్ ఎత్తివేయడానికి వినూత్న ప్రణాళిక అవసరని రాఘురాం రాజన్ పేర్కొన్నారు. ప్రస్తుతం చికాగో యూనివర్సిటీలో పనిచేస్తున్న రఘరాం రాజన్ యూపీఏ ప్రభుత్వ హయాంలో మూడు సంవత్సరాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా సేవలందించారు.