బాలీవుడ్ రొమాంటిక్ హీరో రిషీకపూర్ మృతి

పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం 

ముంబయి: బాలీవుడ్ అగ్ర నటుడు రిషీకపూర్(67) కన్నుమూశారు. క్యాన్సర్ తో గత కొంతకాలం నుంచి పోరాటం చేస్తున్న ఆయన గురువారం ఉదయం ముంబయిలోని హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. నిన్న రాత్రి రిషీ కపూర్ శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతూ తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రికి తరలించినట్లు ఆయన సోదరుడు రణ్ ధీర్ కపూర్ తెలిపారు. చికిత్స కొనసాగుతుండగానే ఇవాళ ఉదయం మృతి చెందారు. గతేడాది సెప్టెంబరులోనే క్యాన్సర్‌కు చికిత్స తీసుకుని అమెరికా నుంచి భారత్ కు తిరిగి వచ్చారు రిషీ కపూర్?. ఆ తర్వాత వైరల్ ఫీవర్, ఇన్ ఫెక్షన్ వంటి సమస్యలతో ఫిబ్రవరిలో రెండు సార్లు ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఎప్పుడు సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే రిషి కపూర్.. ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఆయన ట్విటర్ ఖాతాలో ఎటువంటి పోస్ట్ చేయలేదు.1952 సెప్టెంబరు 4న ముంబయిలో జన్మించిన రిషీ కపూర్..బాలీవుడ్ దిగ్గజం రాజ్ కపూర్ రెండో కుమారుడు. ఆర్.కె.ఫిలిమ్స్ బ్యానర్ పై పలు చిత్రాలు నిర్మించారు. ఉత్తమ బాలనటుడిగా జాతీయ పురస్కారం అందుకున్నారు.1973లో తొలిసారి హీరోగా రిషీ కపూర్ బాబీ చిత్రంలో నటించారు. దాదాపు 51 చిత్రాల్లో కథానాయకుడిగా నటించిమెప్పించారు. 41 చిత్రాల్లో మల్టీ స్టారర్ కథానాయకుడిగా నటించారు. బాబీ, లైలా మజ్నూ, సర్గమ్, నగీనా, చాందినీ, హనీమూన్, దీవానా, గురుదేవ్ చిత్రాలు రిషీకపూర్‌కు మంచి గుర్తింపు తెచ్చాయి. రిషీ కపూర్ హఠాన్మరణంతో బాలీవుడ్మూగబోయింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు