కేంద్ర నిర్ణయాలు అమలు చేయం

ముఖ్యమంత్రి అరవింద్ కేజీవాల్

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన లాక్ డౌన్ సడలింపులను ఢిల్లీ ప్రభుత్వం పక్కన పెట్టింది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉందని, అందుకే కేంద్ర ప్రభుత్వ సడలింపులను ఢిల్లీలో అమలు చేయబోమని ముఖ్యమంత్రి అరవింద్ కేజీవాల్ స్పష్టం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న నిబంధనల అమలు అన్ని ప్రాంతాల్లోను కొనసాగుతాయని వెల్లడించారు. ఓ వైపు దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తుంటే.. ఆంక్షలు సడలిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం సరైనది కాదని కేజీవాల్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో వైరస్ వ్యాప్తి ఇంకా అదుపులోకి రానందున దుకాణాలను తెరిచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఏప్రిల్ 27న జరిగే ప్రధానమంత్రి వీడియో సమావేశంలో సడలింపులపై నిర్ణయం తీసుకుంటామని కేజీవాల్ పేర్కొన్నారు. కాగా ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. ఇపటి వరకు కేసుల సంఖ్య 2,514కి చేరింది. ఢిల్లీలో 92కు పైగా కరోనా హాట్ స్పాట్ జోన్లను ఏర్పాటు చేశారు. గ్రీన్ జోన్ ప్రాంతాల్లో కూడా కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ అలర్ట్ ప్రకటించింది.