‘ప్లాస్మా’తో అనుకూల ఫలితాలు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవాల్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ చికిత్సలో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం చేస్తున్న ప్లాస్మా థెరపీ ట్రయల్స్ లో సానుకూల ఫలితాలు వస్తున్నట్లు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవాల్ వెల్లడించారు. మరికొన్ని ప్రయోగాల అనంతరం వీటిని పెద్దమొత్తంలో చేసేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరనున్నట్లు పేర్కొన్నారు. కేంద్రం అనుమతితో గత కొన్ని రోజులుగా దిల్లీలో ప్లాస్మా థెరపీ పై ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. కాగా ‘లోక్ నాయక్ జయ్ ప్రకాశ్ నారాయణ్ అసుపత్రిలో చికిత్స పొందుతున్న నలుగురు కరోనా బాధితుల పై ప్రయోగించాం. ప్రస్తుతం ఆశించిన స్థాయిలో ఫలితాలొస్తున్నాయి’ అని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవాల్ ప్రయోగ ఫలితాలను మీడియాకి వెల్లడించారు. అయితే ఇవి కేవలం ప్రాథమిక ఫలితాలు మాత్రమే అని.. ఇదే కరోనా వైరసకు పూర్తి చికిత్స కాదన్నారు. అయితే ఈ ఫలితాలు కరోనా పై పోరడగలమనే నమ్మకాన్ని కలిగిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు ఈ చికిత్స పొందిన నలుగురిలో ఇద్దరు కోలుకుని డిశ్చార్జి కావడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. అయితే ఈ చికిత్స ద్వారా కనీసం పదిమంది కోలుకోగలిగితేనే ఉత్తమ ఫలితంగా గుర్తిస్తామన్నారు. ప్రస్తుతం మరో ఇద్దరు, ముగ్గురికి సరిపడా రక్తం, ప్లాస్మా సిద్ధంగా ఉందని..వీటితో అత్యవసర చికిత్స పొందే బాధితులకు ప్లాస్మా థెరపీ చేస్తామని వైద్యాధికారులు వెల్లడించారు. ఈ ప్రయోగం ద్వారా సానుకూల ఫలితాలు రావడం ఊరటనిస్తున్నాయని తెలిపారు. అయితే ఈ సమయంలో కరోనా వైరస్ నుంచి కోలుకున్న వ్యక్తులు ప్లాస్మా దానం చేయడానికి ముందుకు రావాలని అరవింద్ కేజీవాల్ సూచించారు. ఇదే వారి నిజమైన దేశభక్తి అని పేర్కొన్నారు. ఈ థెరపీలో కరోనా సోకి నయమైన వ్యక్తి రక్తాన్ని సేకరించిన అనంతరం దాని నుంచి ప్లాస్మాను వేరుచేస్తారు. ఇలా వేరుచేసిన ప్లాస్మాను అత్యవసర చికిత్స పొందుతున్న కరోనా బాధితునికి ఎక్కిస్తారు. కోలుకున్న వ్యక్తిలో కరోనా వైరస్ పై పోరాడే శక్తి కలిగిన యాంటీబాడీస్ ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇలాంటి వ్యక్తి నుంచి సేకరించిన ప్లాస్మాను కరోనా బాధితుడికి ఎక్కించడం ద్వారా అతడి శరీరంలోని యాంటీబాడీస్ వృద్ధిచెంది వైరస్ పై పోరాడటంలో దోహదపడతాయి. దీంతో అతడు ఈ వైరస్ బారి నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే దిల్లీలో 2376 పాజిటివ్ కేసులు నమోదుకాగా 50మంది మృత్యువాతపడ్డారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య 23వేలు దాటగా మరణాల సంఖ్య 718కి చేరింది.