తెల్లరేషన్ కార్డు లేని వారి జాబితాను సిద్ధం చేయాలి

పేదలకు ఇబ్బంది లేకుండా సరుకుల పంపిణీ అధికారులతో సమీక్షలో మంత్రి తలసాని ఆదేశాలు 

హైదరాబాద్,జ్యోతిన్యూస్ : తెలంగాణలో లాక్ డౌన్ సమయంలో నిరు పేదలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వపరంగా అందే సాయం వారికి అందేలా చూడాలని అధికారులు, ప్రజా ప్రతినిధులకు పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఆదేశించారు. ముఖ్యంగా వలస కార్మికుల కష్టాలు ఎక్కువగా ఉన్నాయని వారిని ఆదుకునేందుకు మరింతగా కృషి చేయాలన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో కరోనా నియంత్రణ చర్యలు, బియ్యం పంపిణీ, వలస కార్మికుల సమస్యలు తదితర అంశాల పై జీహెచ్ఎంసి పరిధిలోని మంత్రులు, ఎంపి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మేయర్ తో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ రకాల సమస్యలన చర్చించారు. తెలంగాణ రాష్టాన్రికి చెందిన తెల్లరేషన్ కార్డు లేని వారి జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. బియ్యం పంపిణీ చేయాల్సిన వలస కూలీల వివరాలతో సమగ్ర సమాచారం సేకరించాలని అన్నారు. నగర పరిధిలో ఆహారం పంపిణీ, జీహెచ్ఎంసి ఆధ్వర్యంలోనే చేపట్టాలని అన్నారు. ఇష్టానుసారంగా పంపిణీతో రోడ్ల పై యాచకులు పెద్ద సంఖ్యలో గుమిగూడుతున్నారు. దీని వల్ల సమస్యలు పెరుగుతున్నాయని చెప్పారు. రోడ్లపై ఉన్న యాచకులను సమీపంలోని షెల్టర్ హోమ్ కు తరలించాలని అన్నారు. యాచకులకు ఆశ్రయం కల్పించేందుకు ఫంక్షన్‌హాల్స్, ప్రభుత్వ పాఠశాలలను షెల్టర్‌గా వినియోగించాలన్నారు. షెల్టర్లకు తరలించిన వారికి జీహెచ్ఎంసి ఆధ్వర్యంలో భోజన సౌకర్యం కల్పించడంతో పాటు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. లాక్ డౌన్ కారణంగా ట్రాఫిక్ రద్దీ లేనందున నూతన రహదారుల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు రోడ్ల నిర్మాణం జరుగుతున్న తీరును పరిశీలించాలన్నారు. ఐదు సంవత్సరాల పాటు రోడ్ల నిర్వహణ గుత్తేదారుదే బాద్యత అన్నారు. ఈ సమావేశంలో మేయర్ బొంతు రామ్మోహన్, మంత్రులు మహమూర్ఎలీ, మల్లారెడ్డి, ఎంపి రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.