చైనాకు అమెరికా బృందం!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిలో చైనా హస్తం ఉందని తేలితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం పై సమగ్ర విచారణ జరిపేందుకు ఓ నిపుణుల బృందాన్ని చైనాకు పంపేందుకు అమెరికా యోచిస్తోందని తెలిపారు. తద్వారా వాస్తవాలేంటో తెలుసుకుంటామని వ్యాఖ్యానించారు. “చైనాలోకి వస్తామని చాలా కాలం క్రితమే మేం వారిని కోరాం. మమ్మల్ని వారు ఆహ్వానించనప్పటికీ.. మేం వెళ్లాలనే అనుకుంటున్నాం. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నాం. వాణిజ్య ఒప్పందం వరకు పరిస్థితులు సుహృద్భావంగానే ఉన్నాయి. కానీ, ఒక్కసారిగా ఈ వైరస్ వెలుగులోకి రావడం మమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. వైరస్ వ్యాప్తి విషయంలో చైనా ప్రపంచాన్ని హెచ్చరించడంలో విఫలమైందని అమెరికా సహా మరికొన్ని దేశాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అలాగే వైరస్ పుట్టుక పై ప్రపంచవ్యాప్తంగా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికాలో ఇప్పటి వరకు 7,70,564 మందికి వైరస్ సోకగా.. వీరిలో 41,114 మంది మరణించారు.