భారత నేవీలో కరోనా కలకలం
15 నుంచి 20 మంది నేవీ సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ముంబయి: ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడు భారత నావికాదళంలోకి ప్రవేశించింది. దాదాపు 15 నుంచి 20 మంది నేవీ సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు సమాచారం. వైరస్ సోకినప్పుడు వీరంతా ‘ఐఎన్ఎస్ యాంగ్రీ’ కి చెందిన నివాస స్థావరాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిని ముంబయిలోని ఐఎన్ హెచ్ఎస్ అశ్వినీ నేవీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నట్లు సమాచారం. భారత నేవీలో కరోనా కేసులు వెలుగులోకి రావడం ఇదే తొలిసారి. దీంతో అప్రమత్తమైన అధికారులు వైరస్ సోకిన వారితో కలిసిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. అలాగే ఆ చుట్టుపక్కల విధులు నిర్వర్తించిన సైనికుల్ని కూడా గుర్తించేందుకు యత్నిస్తున్నారు. అమెరికా, ఫ్రాన్స్ లోనూ.. అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాల నేవీలో వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే అమెరికాకు చెందిన అణుసామర్థ్యం గల థియోడర్ రూజ్ వెల్ట్ విమాన వాహక నౌకలో 660 మందికి వైరస్ సోకింది. అలాగే ఫ్రాన్సకు చెందిన విమాన వాహక నౌకలోనూ 1081 మందిలో వైరస్ ఉన్నట్లు గుర్తించారు. ఈ తరుణంలో భారత నావికాదళంలోనూ కేసులు వెలుగులోకి రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఆర్మీలో 8 మందికి.. ఇక భారత సైనికాదళంలో ఇప్పటి వరకు 8 మందికి వైరస్ సోకినట్లు ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నరవణే శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. వీరిలో ఇద్దరు వైద్యులు, ఒకరు నర్స్ కాగా.. మిగిలిన వారు సైనికులు. ప్రస్తుతం వీరంతా కోలుకుంటున్నారు. ఏప్రిల్ 9నే సందేశం.. అమెరికా నేవీ వైరస్ తో ఇక్కట్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో భారత నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ అప్రమత్తమయ్యారు. భారత యుద్ధనౌకలు, జలాంతర్గాముల సిబ్బందిని వైరస్ నుంచి కాపాడుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ మేరకు 15 నిమిషాల విడిది గల వీడియో సందేశాన్ని ఏప్రిల్ 9న విడుదల చేశారు. వైరస్ ఇంకా భారత నేవీలోకి ప్రవేశించనప్పటికీ.. అత్యంత గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు సైతం సన్నద్ధంగా ఉండాలని సూచించారు. ముందే అప్రమత్తం.. ప్రపంచవ్యాప్తంగా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో భారత త్రివిధ దళాలు అప్రమత్తమయ్యాయి. ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించాయి. అందులో భాగంగా అత్యవసరం కాని శిక్షణాకార్యక్రమాలు, సమావేశాలు, ప్రయాణాలను వాయిదా వేశారు. 50 మంది కంటే ఎక్కువ గుమిగూడొద్దని ఆదేశాలు జారీ చేశారు. వీలైన ప్రాంతాల్లో సిబ్బందిని ఇంటి నుంచే విధులు నిర్వర్తించాలని కోరారు. ఒకవేళ వైరస్ ప్రవేశించినా… ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.