భారత్ స్ఫూర్తికి ప్రశంసలు
హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఉదారత పై యుఎజ్ కితాబు
న్యూయార్క్: కరోనా వైరస్ పై పోరులో ఇతర దేశాలకు అండగా నిలుస్తున్న భారత్ ను ఐక్యరాజ్య సమితి ప్రశంసించింది. ఐరాస పిలుపునకు అనుగుణంగా ఇతర దేశాలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రల్ని అందిస్తూ భారత్ ఆదర్శంగా నిలుస్తోందని సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అభిప్రాయపడ్డారు. కొవిడ్-19 చికిత్సలో మంచి ఫలితాలిస్తుందని భావిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రల్ని ఇప్పటి వరకు భారత్ అనేక దేశాలకు పంపింది. వీటిలో అమెరికా, అనిస్థాన్, శ్రీలంక, మారిషస్ సహా పలు ఐరోపా, ఆఫ్రికా దేశాలు ఉన్నాయి. రెండు లక్షల క్లోరోక్విన్ మాత్రల్ని అందుకున్న డొమినిక్ రిపబ్లిక్ సైతం ఈ సందర్భంగా భారత్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. మరోవైపు రష్యా సైతం భారత సంఘీభావం పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది. తమకు క్లోరోక్విన్ మాత్రల్ని అందించాలన్న రష్యా అభ్యర్థనను భారత్ ఇటీవల అంగీకరించింది. ఆగని కరోనా కేళి భారత్ లో సగటున రోజుకు వెయ్యి కేసులు నమోదు..24 గంటల్లో 43 మరణాలు న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా ప్రతిరోజు సరాసరి వెయ్యి కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 43 మంది మరణించగా మరో 991 పాజిటివ్ కేసులు నమోదయ్యా యి. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14,378కి చేరింది. ఈ వైరస్ బారినపడి ఇప్పటివరకు 480మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. మొత్తం బాధితుల్లో 1992 మంది కోలుకోగా ప్రస్తుతం మరో 11,906మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజే 243మంది కోలుకున్నారు. ప్రతిరోజు కోలుకుంటున్నవారి శాతం పెరగడం కాస్త ఉపశమనం కలిగిస్తోంది. మహారాష్ట్రలో 200 దాటిన మరణాలు… మహారాష్ట్రలో కరోనా వైరస్ తీవ్రత ఆందోళనకరంగా ఉంది. తాజాగా రాష్ట్రంలో కొవిడ్ మృతుల సంఖ్య 201కి చేరింది. గడచిన 24గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 118 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3323కి చేరింది. ముంబయిలో కొవిడ్-19 తీవ్రత ఆందోళనకరంగా ఉంది. కేవలం ఈ ఒక్కనగరంలోనే 2073 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇక మురికివాడ ధారవిలోనూ కరోనా తీవ్రత కలవర పెడుతోంది. తాజాగా ఇక్కడ కేసుల సంఖ్య 101కి చేరింది. ఇదిలా ఉంటే తాజాగా నేవీ సిబ్బందికి కరోనా నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది. ముంబయిలోని భారత నావికాదళంలో దాదాపు 21మందికి కరోనా నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే భారత సైన్యంలోనూ ఎనిమిది పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. దేశ రాజధాని దిల్లీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా పాజిటివ్ కేసులు సంఖ్య 1707కి చేరింది. వీరిలో 42మంది మృత్యువాతపడ్డారు. వైరస్ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి ప్రజలను ఇళ్లనుంచి బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇక తమిళనాడులో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 1323కి చేరింది. రాజస్థాన్ లో కొవిడ్ పాజిటివ్ కేసులు 1229 నిర్ధారణ కాగా 11మంది మృత్యువాతపడ్డారు. మధ్యప్రదేశ్ లో నిన్న ఒక్కరోజే 16 మంది మరణించగా మొత్తం మరణాలసంఖ్య 69కి చేరింది. కొత్తగా నిన్న ఒక్కరోజే 190కేసులు నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 1310గా నమోదైంది. గుజరాత్ లోనూ నిన్న ఒక్కరోజే 169 కేసులు నమోదుకాగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1099కి చేరింది. ఈ వైరస్ సోకి 41మంది బలయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో 572, తెలంగాణలో 766 కేసులు… తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్రాలు వెల్లడించిన వివరాల ప్రకారం..తెలంగాణలో 766 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా 18మంది మరణించారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఈ వైరస్ సోకి 14మంది మరణించగా మొత్తం 572మందికి సోకింది. హైదరాబాద్ తోపాటు గుంటూరు, కర్నూలు జిల్లాల్లో వైరస్ తీవ్రత అధికంగా ఉంది.