వాళ్లే నిజమైన దేశభక్తులు

ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్ వాడీ కార్యకర్తలకు రాహుల్ ప్రశంసలు 

న్యూఢిల్లీ: కరోనా పై పోరులో భాగంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్‌వాడీ కార్యకర్తలు నిజమైన దేశభక్తులని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కొనియాడారు. ఈ విపత్కర పరిస్థితుల్లో సమాజాన్ని కాపాడుకునేందుకు ఎనలేని కృషి చేస్తున్నారని ప్రశంసించారు. వైరస్ కంటే భయం, అసత్యమే ప్రమాదంగా పరిణమించిన వేళ ప్రజల్లో అవగాహన కల్పించడంలో వీరు కీలక పాత్ర పోషిస్తున్నారని గుర్తుచేశారు. ప్రాణాల్ని పణంగా పెట్టి, అత్యంత నిబద్ధతతో కొవిడ్-19 పై పోరును కొనసాగిస్తున్నారన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం వారంతా చేస్తున్న త్యాగాలకు దేశం ఎంతో రుణపడి ఉందని వ్యాఖ్యానించారు. వారి సేవల్ని ఆదర్శప్రాయమైనవిగా అభివర్ణించిన ఆయన వీటికి గుర్తింపుగా ఈ సంక్షోభం ముగిసిన తర్వాత వారి పని పరిస్థితుల్లో సానుకూల మార్పు రావాలని ఆకాంక్షిస్తున్నానని వ్యాఖ్యానించారు. ఈ పోరులో భాగమైన ప్రతిఒక్కరూ సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నానన్నారు.