15 లోగా 1500 పడకల ఆసుపత్రి
సిద్ధం చేయండి గచ్చిబౌలిలో కరోనా రోగుల ఆసుపత్రి పనుల పై మంత్రి కేటీఆర్
హైదరాబాద్: రోజు రోజుకు విజృంభిస్తున్న కరోనా కట్టడికి రాష్ట్రం ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కరోనా బాధితుల కోసం రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలిలో ప్రత్యేకంగా ఓ ఆసుపత్రిని సిద్ధం చేస్తున్నారు. గచ్చిబౌలిలో స్పోర్ట్స్ అథారిటీకి సబంధించిన కాంప్లెక్స్ ను పూర్తిగా కరోనా ప్రత్యేక ఆసుపత్రిగా మార్చేందుకు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు ఆసుపత్రి పనులను ఇవాళ పరిశీలించారు. దాదాపు 15 అంతస్థుల్లో ఉన్న ఈ భవనంలో ఆసుపత్రి ఏర్పాటు పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ భవనంలో పనులు పూర్తయితే దాదాపు 1500 పడకలు ఈ ఆసుపత్రిలో అందుబాటులోకి రానుంది. రోజుకు దాదాపు వెయ్యి మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 364 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 15లోగా ఆసుపత్రిని సిద్ధం చేయాలని మంత్రులు ఆదేశించారు. కరోనా బాధితులకు చికిత్స చేసేందుకు వైరసకు కేంద్ర స్థానమైన వూహాలో 10 రోజుల్లో 1000 పడకల ఆస్పత్రిని చైనా నిర్మించిన విషయం తెలిసిందే. చైనా తరహాలో 1500 పడకల ఆస్పత్రిని తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో వైరస్ బారిన పడుతున్నవారి సంఖ్య అనూహ్యంగా పెరిగితే ఆలస్యం కాకుండా చికిత్స అందించేందుకు ముందు జాగ్రత్త చర్యగా గచ్చిబౌలీలోని స్పోర్ట్స్ సెంటర్ను కరోనా ఆస్పత్రిగా ప్రభుత్వం మారుస్తోంది. గచ్చిబౌలీలో కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు 1500 పడకల కోవిడ్ హాస్పిటల్ సిద్ధంగా ఉందని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఇది తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ నిబద్ధతను చూపిస్తోందని అన్నారు. మరో 22 మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ ను కూడా పూర్తిగా కోవిడ్ హాస్పిటల్స్ గా మార్చినట్లు ఈటెల తెలిపారు. మంగళవారం మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్, వైద్యాధికారులు గచ్చిబౌలీలోనీ స్పోర్ట్స్ టవర్లో ఏర్పాటు చేసిన హాస్పిటల్ ను సందర్శించారు. అనంతరం మొయినాబాద్ లోని భాస్కర్ మెడికల్ కళాశాల ఆస్పత్రిని సందర్శించి వైద్య సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆస్పత్రుల్లోని అన్ని వార్డులను మంత్రి కేటీఆర్ తనిఖీ చేశారు.