వైద్యులకు రక్షణ ఇచ్చే బాధ్యత ప్రభుత్వాలదే
జన సేన అధినేత పవన్ కల్యాణ్
అమరావతి: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న ఈ సమయంలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది ఎంతో సాహసోపేతంగా పనిచేస్తున్నారని జన సేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కరోనా రోగులకు సేవలందిస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. వైద్యులను భగవంతుడితో సమానంగా చూసే సంస్కృతి మనదేశానిదన్నారు. “మానవతామూర్తులైన ఎందరో వైద్యులు తమ వృత్తి ధర్మంతో పేదలకు ఎనలేని సేవలు చేస్తున్నారు. తమకీ, తమ కుటుంబానికీ వైరస్ ముప్పు ఉంటుందని తెలిసీ రోగులకు సేవలు చేస్తున్న వారిని ఎప్పటికీ మరచిపోకూడదు. విధి నిర్వహణలో ఉన్న వైద్యులకు, పారా మెడికల్ సిబ్బందికి ప్రభుత్వం తగిన రక్షణ, భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కోవిడ్-19 విధుల్లో ఉన్న వారందరికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన విధంగా పీపీఈలు సమకూర్చాలి. రోగుల సేవలో ఉన్న నర్సులు, ప్రసూతి ఆయాల ఆర్థిక పరిస్థితి మెరుగు పరచడంతో పాటు ఉద్యోగ భద్రతకు తగిన చట్టాలు తీసుకురావాలి” అని పవన్ కోరారు.