వైరల్ సందేశాలపై
వాట్సాప్ కీలక నిర్ణయం ఒక్కరికే సందేశం షేర్ చేసేలా నిబంధనలు కట్టుదిట్టం
న్యూఢిల్లీ: ఔషధం లేని మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచ ప్రజలను వణికిస్తోంది. దీని గురించి సరైన సమాచారం తెలియక, అంతర్జాలంలో లభిస్తున్న సమాచారం నిజమైందో కాదో నిర్ధారించుకోలేక ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కొవిడ్-19కు సంబంధించి తప్పుడు సమాచారం వ్యాప్తించకుండా ఆ పేందుకు వాట్సప్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తమ యాప్‌లో తరచుగా షేర్ అయ్యే మెసేజ్ లను ఇకమీదట ఒకసారి ఒక్కరికి మాత్రమే షేర్ చేయగలిగే విధంగా వాట్సప్ కట్టుదిట్టం చేసింది. ఇప్పటి వరకూ ఇలాంటి మెసేజ్ లను ఒకేసారి ఐదుగురికి షేర్ చేయగలిగే వీలు ఉంది. తాజా చర్యతో యూజర్లు వాట్సప్‌లో మెసేజ్ లను ఫార్వర్డ్ చేయడం 25 శాతం మేరకు తగ్గుతుందని ఆ సంస్థ వివరించింది. అంతేకాకుండా తమకు వచ్చిన సమాచారాన్ని ధృవీకరించుకునే సదుపాయాన్ని కల్పించేందుకు కూడా వాట్సాప్ కృషిచేస్తోంది. ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే.. ఆ మెసేజ్ లపై మాగ్ని ఫైయింగ్ గ్లాస్ బొమ్మ ఉంటుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలో బీటా వెర్షన్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ సదుపాయం.. త్వరలో అందరికీ అందుబాటులో రానుందని వాట్సప్ తెలిపింది. కరోనా నివారణా చర్యలకు తమ వంతు సాయంగా వాట్సప్ సంస్థ 1 మిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చింది. ‘కొవిడ్-19 వాట్సప్ చాట్ బోట్’ ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించింది. కరోనా గురించిన సమాచారాన్నిచ్చే ‘కరోనా వైరస్ ఇన్ఫర్మేషన్ హబ్’ను కూడా ఈ ఆన్లైన్ సంస్థ ఏర్పాటు చేసింది.