ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు

12 గంటల్లో 17 కేసులు నమోదు..ఢిల్లీ మత ప్రార్ధనలకు వెళ్లినవారి కోసం గాలింపు

విజయవాడ: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 40కి చేరాయి. 12 గంటల్లో 17 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ప్రకాశంలో అత్యధికంగా 11 కేసులు నమోదవ్వగా, చీరాల పట్టణంలో కొత్తగా 5 కేసులు నమోదయ్యాయి. సోమవారం రాత్రి 164 మందికి కరోనా పరీక్షలు చేయగా, 17 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. 147 మందికి నెగిటివ్ వచ్చింది. గుంటూరు – 9, విశాఖ – 6, కృష్ణా – 5, తూ.గో – 4, అనంతపురం – 2, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరికి చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40కి చేరింది. రాత్రి 9గంటల నుంచి ఇప్పటి వరకు కొత్తగా 17 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. బాధితుల్లో దిల్లీలో మత పరమైన ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారే ఎక్కువ మంది ఉన్నారని ప్రభుత్వం హెల్త్ బులెటిన్లో తెలిపింది. ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య జిల్లాల వారీగా ఇలా ఉంది. ప్రకాశం 

11, గుంటూరు 9, విశాఖపట్నం 6, కృష్ణా 5, తూర్పుగోదావరి 4, అనంతపురం 2, చిత్తూరు, నెల్లూరు, కర్నూలు ఒక్కో కేసు నమోదయ్యాయి. దిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారిని ఐసోలేషన్ కేంద్రాలకు తరలిస్తున్నామని, వారితో కలిసిన వారి వివరాలను ఆరా తీస్తున్నామని దక్షిణ కోస్తా ఐజీ ప్రభాకరరావు చెప్పారు. గుంటూరు కొత్తపేటలోని జళగం రామరావు స్మారక పురపాలక పాఠశాలలో వలస కూలీలు, అన్నార్తులకు నిర్వహిస్తున్న శిబిరాన్ని ఆయన సందర్శించారు. వారికి అల్పాహారం, దుప్పట్లు పంపిణీ చేసిన ప్రభాకరరావు.. స్వీయక్రమశిక్షణ, సామాజిక దూరాన్ని పాటించాలని సూచించారు. దిల్లీ నుంచి.. గుంటూరు జిల్లాకు వచ్చిన 79 మందిని, ప్రకాశం నుంచి 83 మందిని, నెల్లూరు నుంచి 103 మందిని ఐసోలేషన్ కేంద్రాలకు తరలించామన్నారు. ఇంకా ఆచూకీ లభించని వారి కోసం అన్వేషణ సాగిస్తున్నామని చెప్పారు. న్యూఢిల్లీకి రాష్ట్రం నుంచి 369 మంది మతపరమైన ప్రార్థనల కోసం రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 369 మంది దిల్లీకి వెళ్లినట్టు అధికారులు గుర్తించారు. వీరంతా మార్చి 15 నుంచి 17వరకు దిల్లీలోనే ఉన్నారని అధికారుల దర్యాప్తులో వెల్లడైంది.