ఉత్తర్‌-దక్షిణ్‌ అనుసంధాన

మెట్రో రైలు షురూ
నగరంలో రేపటి నుంచి అందుబాటులోకి రానున్న జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మెట్రో రైలు మార్గం

-జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకూ..
-ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌
-జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు 11 కిలోమీటర్లు
-మొత్తం 69 కిలోమీటర్ల మెట్రోమార్గం అందుబాటులోకి
-2017 నుంచి దశలవారీగా వివిధ కారిడార్లు
-మెట్రో ప్రాజెక్ట్‌లోనే అత్యంత ఎత్తైన ప్రత్యేక స్టేషన్‌ జేబీఎస్‌

హైదరాబాద్‌:
హైదరాబాద్‌ నగర ఉత్తర, దక్షిణ ప్రాంతాలను అనుసంధానం చేసే జేబీఎస్‌ (జూబ్లీ బస్‌స్టేషన్‌) – ఎంజీబీఎస్‌ (మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌) మెట్రోరైలు మార్గాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ రేపు ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జేబీఎస్‌ వద్ద ఏర్పాటుచేస్తున్నారు. ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు కారిడార్‌-2 మార్గంలో కమర్షియల్‌ ఆపరేషన్‌లో భాగంగా తొలిరైలు ప్రారంభమవుతుందని, ట్విట్టర్‌ వేదికగా ఐటీ, పట్టణాభివద్ధిశాఖ మంత్రి కేటీఆర్‌ మంగళవారం వెల్లడించారు. ఈ మార్గంలో ప్రయాణికులకు మెట్రోరైలు శనివారం (8వ తేదీ) నుంచి అందుబాటులోకి వస్తుంది.
అందుబాటులోకి
69 కిలోమీటర్ల మెట్రోమార్గం
జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు గల కారిడార్‌-2 మార్గం 11 కిలోమీటర్లు ప్రారంభమైతే నగరంలోని మొత్తం 69 కిలోమీటర్ల మెట్రోమార్గం అందుబాటులోకి వస్తుందని హైదరాబాద్‌ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు మియాపూర్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు 29 కిలోమీటర్లు, నాగోల్‌ నుంచి రాయదుర్గ్‌ వరకు 29 కిలోమీటర్లు, జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు 11 కిలోమీటర్లు కలిపి 69 కిలోమీటర్లు అందుబాటులోకి వస్తుందని చెప్పారు. దీంతో దేశంలో రెండో అతిపెద్ద ప్రాజెక్టుగా ఢిల్లీ తర్వాత స్థానాన్ని హైదరాబాద్‌ మెట్రోరైలు దక్కించుకుంటుందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ ప్రాజెక్టుగా కూడా ఇది విజయవంతమైందని అన్నారు. 2017 నవంబర్‌లో మెట్రో రైలు తొలిసారి హైదరాబాద్‌లో కూతపెట్టింది. అనంతరం దశలవారీగా వివిధ కారిడార్లను ప్రారంభించారు. జేబీఎస్‌ టు ఎంజీబీఎస్‌ ప్రారంభమైతే మొదటిదశ హైదరాబాద్‌ మెట్రోరైలు దాదాపు పూర్తయినట్టే. ప్రస్తుతం నిత్యం నగరంలో 4 లక్షల మంది మెట్రో రైలులో ప్రయాణిస్తుండగా, జేబీఎస్‌ టు ఎంజీబీఎస్‌ మార్గం అందుబాటులోకి వస్తే మరో లక్ష మంది పెరుగుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. 2017 నవంబర్‌ నుంచి ఇప్పటివరకు 9.3 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చినట్టు గణాంకాలు చెప్తున్నాయి. నాగోల్‌ నుంచి రాయదుర్గ్‌, ఎల్బీనగర్‌ నుంచి మియాపూర్‌తో నగర తూర్పు, పడమర ప్రాంతాలను కలుపుతుండగా, జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ కారిడార్‌ ఉత్తర, దక్షిణ ప్రాంతాలను కలుపుతున్నది.
2017 నవంబర్‌ 28న సీఎం కేసీఆర్‌తో కలిసి ప్రధాని మోదీ మియాపూర్‌ నుంచి అమీర్‌పేట వరకు 13 కిలోమీటర్లు, అమీర్‌పేట నుంచి నాగోల్‌ వరకు 17 కిలోమీటర్లు.. మొత్తం 30 కిలోమీటర్ల మార్గాన్ని మియాపూర్‌ స్టేషన్‌ వద్ద ప్రారంభించారు. 2018 సెప్టెంబర్‌ 24న అమీర్‌పేట నుంచి ఎల్బీనగర్‌ వరకు మంత్రి కేటీఆర్‌తో కలిసి అప్పటి గవర్నర్‌ నరసింహన్‌ ప్రారంభించారు. 2019 మార్చి 20న అమీర్‌పేట నుంచి హైటెక్‌సిటీ వరకు పదికిలోమీటర్ల మార్గాన్ని అప్పటి గవర్నర్‌ నరసింహన్‌ ప్రారంభించారు. 2019 నవంబర్‌ 29న హైటెక్‌సిటీ నుంచి రాయ్‌దుర్గ్‌ వరకు 1.5 కిలోమీటర్ల మార్గాన్ని మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రారంభించారు.
జేబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా మెట్రోరైలు కారిడార్‌ పేరుకు గ్రీన్‌లైన్‌ అయినా అడుగడుగున రెడ్‌ సిగ్నలే పడింది. ఆటంకాలన్నీ అధిగమించి మూడేళ్లు ఆలస్యంగా ప్రయాణికులకు ఈ మార్గం శుక్రవారం నుంచి అందుబాటులోకి రాబోతుంది. అది కూడా పూర్తిగా కాదు. జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు మాత్రమే. ఆస్తుల సేకరణ, అలైన్‌మెంట్‌ వివాదాలతో ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు ఐదు కి.మీ. పాతబస్తీ మార్గాన్ని మెట్రో మొదటిదశ పీపీపీ ప్రాజెక్ట్‌ నుంచి తప్పించారు.
మెట్రోరైలు తొలిదశలో 71.16 కి.మీ. మేర సిటీలోని ప్రధాన ప్రాంతాలను కలిపేలా మూడు మార్గాల్లో ప్రతిపాదించారు. రూ.14,132 కోట్ల అంచనా వ్యయంతో 2012 ఏప్రిల్‌లో పనులు మొదలెట్టారు. ఎల్‌ అండ్‌ టీ మెట్రో వారి నిధులతోనే ఐదేళ్లలో ప్రాజెక్ట్‌ను పూర్తిచేసి 30 ఏళ్ల పాటూ నిర్వహించే ఒప్పందంతో ముందుకొచ్చింది. 2017 జులై నాటికే ప్రాజెక్ట్‌ పూర్తి కావాల్సి ఉండగా ఆస్తుల సేకరణ, కోర్టు కేసులు, అలైన్‌మెంట్‌ వివాదాలతో ప్రాజెక్ట్‌ జాప్యమైంది. జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ 2016 డిసెంబరు నాటికే పూర్తికావాల్సి ఉండగా ఇప్పటికీ పూర్తైంది. దీంతో 69 కి.మీ. మార్గం పూర్తైంది.
మార్పులు చేర్పులు..
తొలుత ప్రతిపాదించింది 71.16 కి.మీ. అయినా ఎనిమిదేళ్లలో అలైన్‌మెంట్లలో కొద్దిగా మార్పులు చేర్పులు చేపట్టారు. కారిడార్‌-2లో పాతబస్తీలో ఐదు కి.మీ. పనుల నుంచి నిర్మాణ సంస్థ వైదొలిగింది. జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ 10కి.మీ. దూరమే అయినా.. ఇక్కడ మూసీలో రివర్సల్‌ నిర్మాణంతో మరో కిలోమీటర్‌ పెరిగిందని మెట్రో అధికారులు అంటున్నారు. మొత్తంగా 11 కి.మీ.గా చెబుతున్నారు. కారిడార్‌-3లో నాగోల్‌ నుంచి హైటెక్‌సిటీ వరకు మొదట ప్రతిపాదించగా..హైటెక్‌సిటీ నుంచి రాయదుర్గం వరకు ఒకటిన్నర కిలోమీటర్‌ పొడిగించారు. దీంతో ఈ కారిడార్‌ 29 కి.మీ. పెరిగిందని అధికారులు చెబుతున్నారు. నాగోల్‌ స్టేషన్‌ నుంచి రాయదుర్గం స్టేషన్‌ వరకు 26.75 కి.మీ. మాత్రమే. లి కారిడార్‌-2 మియాపూర్‌ నుంచి ఎల్‌బీనగర్‌ వరకు 29 కి.మీ. యథాతథంగా నిర్మించారు. ఎల్‌బీనగర్‌ స్టేషన్‌ నుంచి మియాపూర్‌ స్టేషన్‌ వరకు 27.99 కి.మీ. మాత్రమే. మూడు కారిడార్లు కలిపి 69 కి.మీ.అని మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి ఇటీవల తెలిపారు. ప్రయాణికులకు అందుబాటులో ఉండే మెట్రో మార్గం మాత్రం 64.74 కి.మీ.గా ఉంది. మిగతా 4.26 కి.మీ. ట్రాక్‌ చివరి స్టేషన్లలో రివర్సల్‌ ట్రాక్‌, డిపోలకు చేరుకునే ట్రాక్‌ కావడం గమనార్హం.
ఒకే స్టేషన్‌కు రెండుపేర్లు.. ప్రారంభోత్సవ వేడుక జరుపుకోబోయే జేబీఎస్‌ మెట్రో స్టేషన్‌కు పలు ప్రత్యేకతలు ఉన్నాయి. మెట్రో ప్రాజెక్ట్‌లోనే అత్యంత ఎత్తైన ప్రత్యేక స్టేషన్‌ ఇది. ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన స్టేషన్లలో ఒకటి నుంచి నాలుగు అంతస్తుల వరకు ఉంటే.. ఈస్టేషన్‌ మాత్రం ఐదు అంతస్తుల్లో ఉంది. వాస్తవంగా జేబీఎస్‌ స్టేషన్‌, పరేడ్‌గ్రౌండ్‌ స్టేషన్లు వేర్వేరు ప్రాంతాల్లో కట్టాల్సి ఉంది. వీటి మధ్య దూరం తక్కువగా ఉండటంతో రెండింటి స్థానంలో ఒకటే నిర్మించి దానికే జేబీఎస్‌-పరేడ్‌గ్రౌండ్‌ పేరు పెట్టారు. ఇక్కడ దిగిన వారు జేబీఎస్‌ స్టేషన్‌ చేరుకోవచ్చు. పక్కనే కారిడార్‌-3లో ఉన్న పరేడ్‌గ్రౌండ్‌ స్టేషన్‌కు స్కైవే మీదుగా వెళ్లొచ్చు. రెండు కారిడార్లను కలిపే ఇంటర్‌ఛేంజ్‌ స్టేషన్‌ కూడా ఉండటం గమనార్హం.