మందిరానికి తొలి అడుగు

లోక్‌సభ వేదికగా రామాలయానికి ట్రస్టు ఏర్పాటుపై
కీలక ప్రకటన చేసిన మోదీ

-సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ట్రస్ట్‌ ఏర్పాటు
-ట్రస్ట్‌కు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రగా నామకరణం
-ట్రస్ట్‌ స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటుంది..
-రాజకీయంగా ఎలాంటి జోక్యం ఉండదు
-హర్షం వ్యక్తం చేసిన శివసేన, బీజేపీ శ్రేణులు
-మోదీ ప్రకటన కోడ్‌ ఉల్లంఘన కాదన్న ఈసీ

”నవంబరు 9న వచ్చిన తీర్పు ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మరోసారి నిరూపించింది. అయోధ్య ట్రస్టు ఏర్పాటు చేస్తూ బుధవారం ఉదయం కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని చెప్పడానికి ఎంతగానో సంతోషిస్తున్నా. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి.. ట్రస్టును ఏర్పాటు చేశాం. దీనికి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రగా నామకరణం చేశాం. మందిర నిర్మాణం కోసం 67.703 ఎకరాల భూమిని కేటాయించాలని నిర్ణయించాం. ఈ ట్రస్టు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుంది. భారతదేశంలో నివసిస్తున్న అన్ని మతాల ప్రజలు
వసుదైక కుటుంబంలో భాగమే” -నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ: అయోధ్య రామమందిర నిర్మాణంపై ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం లోక్‌సభ వేదికగా కీలక ప్రకటన చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు రామమందిర ట్రస్టును ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర పేరుతో ఏర్పాటు చేసిన ట్రస్టుకు ఆలయ నిర్మాణ బాధ్యతలు అప్పగించనున్నట్టు పేర్కొన్నారు. భారీ స్థాయిలో రామ మందిరాన్ని నిర్మిస్తామనీ… అందుకు అవసరమైన ప్లాన్‌ కూడా ఇప్పటికే సిద్ధమైనట్టు ప్రధాని వెల్లడించారు. ట్రస్ట్‌ ఏర్పాటుకు కేబినెట్‌ కూడా ఆమోదం తెలిపిందన్నారు. వివాదాస్పద భూమిని ట్రస్టుకు అప్పగిస్తామనీ.. మందిరం నిర్మాణ వ్యవహారాలను ట్రస్టు చూసుకుంటుందని మోదీ పేర్కొన్నారు. కాగా రామమందిర నిర్మాణం కోసం ట్రస్టు ఏర్పాటు చేసినట్టు ప్రకటించగానే లోక్‌సభలో బీజేపీ సభ్యులంతా బల్లలు చరుస్తూ హర్షధ్వానాలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా మూడు రోజులకు ముందే ప్రధాని మోదీ ఈ ప్రకటన చేయడం గమనార్హం. అయోధ్యలో వివాదాస్పద 2.7 ఎకరాల భూమిని రామ మందిర నిర్మాణం కోసం అప్పగిస్తూ గతేడాది నవంబర్‌ 9న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. కూలగొట్టిన బాబ్రీ మసీదు పునర్నిర్మాణం కోసం ప్రత్యమ్నాయంగా సున్నీ వక్ఫ్‌ బోర్డుకు అయోధ్య పరిధిలో 5 ఎకరాల భూమిని ఇవ్వాలంటూ ధర్మాసనం ఆదేశించింది.
అయోధ్యలో శ్రీరాముడి ఆలయ నిర్మాణం కోసం ట్రస్టును ఏర్పాటు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై శివసేన హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ లోక్‌సభలో చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నట్టు తెలిపింది. శివసేన చీఫ్‌, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాకరే తరపున పార్లమెంటు వద్ద ఆ పార్టీ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్‌ రావత్‌ మీడియాతో మాట్లాడారు. ” మహారాష్ట్ర ముఖ్యమంత్రి తరపున ప్రధానమంత్రి ప్రకటనను స్వాగతిస్తున్నాను. అయితే రామ మందిరం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నది సుప్రీంకోర్టు అన్న విషయం మీ అందరికి తెలుసు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని గౌరవించడం ప్రభుత్వం బాధ్యత..” అని సంజయ్‌ రావత్‌ పేర్కొన్నారు. అయితే దీనిపై ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది. మోదీ ప్రకటన కోడ్‌ ఉల్లంఘన కిందకు రాదని వెల్లడించింది. రామమందిర నిర్మాణం కోసం ట్రస్ట్‌ ఏర్పాటుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన మూడు నెలల గడువు ఫిబ్రవరి 9న ముగియనున్న నేపథ్యంలో చేసిన ఈ ప్రకటన ఉల్లంఘన కిందకి రాదని పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పు కావడంతో ఈ ప్రకటనకు ఎలాంటి ముందస్తు అనుమతి అవసరం లేదని తెలిపింది. ఫిబ్రవరి 8న హస్తినలో ఎన్నికలు జరగనున్నాయి.
అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఓ ట్రస్టును ఏర్పాటు చేస్తున్నామన్న ప్రధాని మోదీ ప్రకటనపై బీజేపీ సీనియర్‌ నేత ఉమా భారతి ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ”ట్రస్టు ఏర్పాటు ప్రకటించినందుకు మోదీకి ధన్యవాదాలు. అందుకు చాలా గర్విస్తున్నా. అయోధ్య కేసుకు సంబంధించి రెండోసారి కేసు విచారణకు కూడా హాజరయ్యేందుకు సిద్ధమే.” అని ట్వీట్‌ చేశారు. అంతేకాకుండా రామ మందిరం కోసం ఉరికైనా సిద్ధమేనని మొదటి నుంచీ ప్రకటిస్తూనే ఉన్నానని ఉమా భారతి మరోసారి గుర్తు చేశారు.
రామమందిరంపై ప్రధాని మోదీ బుధవారం పార్లమెంట్‌ వేదికగా కీలక ప్రకటన చేశారు. నిర్మాణం కోసం ఓ ట్రస్టును ఏర్పాటు చేస్తున్నామని,దీనికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు లోకసభలో మోదీ వెల్లడించారు.