నేటినుంచి వనదేవతల కుంభమేళా

కోటి మందికి పైగా వచ్చే భక్తులకు తెలంగాణ సర్కారు ఏర్పాట్లు

-జాతర ఏర్పాట్లకు రూ.75 కోట్ల కేటాయింపు
-అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు
-కరోనా వైరస్‌ను దృష్టిలోపెట్టుకుని ముందుజాగ్రత్త చర్యలు
-ఎక్కడికక్కడ అందుబాటులో తాత్కాలిక ప్రాధమిక చికిత్స కేంద్రాలు
-భక్తులకు అసౌకర్యాలు కలగకుండా 21 శాఖల సేవలు
-మేడారం అంతటా రంగుల పెయింటింగ్స్‌తో శోభ
-భక్తుల సౌకర్యార్థం 500 ప్రత్యేక బస్సులు
-పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్యాకేజీ టూర్లు

హైదరాబాద్‌:
తెలంగాణా మహా కుంభమేళా… మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర నేటినుండి ప్రారంభం కానుంది. ఎనిమిదవ తేదీ వరకు ఈ జాతర జరగనుంది. రెండేళ్ళకోమారు జరిగే ఈ జాతరకు ఈ దఫా కోటి మంది హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ములుగు జిల్లా మేడారంలో ఈ జాతర జరుగుతుంది. ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా ఈ జాతరకు పేరుంది. తాడ్వాయి మండలంలోని కీకారణ్యం నుంచి సాగే దారిలో ఉన్న మేడారంలో మాఘశుద్ధ్య పౌర్ణమి రోజు ప్రారంభమయ్యే ఈ జాతరకు పలు జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు హాజరవుతారు.
పూర్తిగా గిరిజన సాంప్రదాయంలో జరిగే ఈ జాతరలో సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లకు ఏ విధమైన విగ్రహాలు గాని, ప్రతిరూపాలుగాని ఉండవు. కాశీ పుష్కర మేళాలకు, పూరీ జగన్నాధ రథయాత్రకు, తిరుమల తిరుపతి బ్రహ్మూెత్సవాలకు భిన్నమైన రీతిలో మేడారం జాతర జరుగుతుంది.
ఈ జాతరకు వచ్చే భక్తులు పసుపు, కుంకుమ, బెల్లం లాంటి వస్తువులతో అమ్మవార్లకు మొక్కులు చెల్లిస్తారు. తెలంగాణా కుంభమేళాగా పిలిచే మేడారం జాతరకు ఆంద్రప్రదేశ్‌, ఛత్తీస్‌ఘడ్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, జార్ఖండ్‌ తదితర రాష్ట్రాలల్లోని గిరిజనులు, గిరిజనేతరులే కాకుండా విదేశీ భక్తులు కూడా వస్తారు. తొలిరోజు సాయంత్రం నాలుగు గంటలకు కన్నేపల్లి నుంచి సారలమ్మను, కొత్తగూడ మండలం పూనుగుండ్ల నుంచి పగిడిద్దరాజును, తాడ్వాయి మండలం కొండాయి నుంచి గోవిందరాజులును గద్దెల వద్దకు తెచ్చి ప్రతిష్టిస్తారు. మరుసటి రోజు గురువారం సమ్మక్కను చిలుకల గుట్ట నుంచి తెచ్చి ప్రతిష్టిస్తారు. శుక్రవారం దేవతలకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. శనివారం దేవతలు వనప్రవేశం చేస్తారు. ఈ నాలుగు రోజులు మేడారంలో ఒకటే సందడి నెలకొంటుంది. సమ్మక్క, సారలమ్మ ఆగమనం, దేవతలను గద్దెల వద్ద ప్రతిష్టించడం, వన దేవతల పూజలు, వన ప్రవేశం లాంటి ఘట్టాలు అత్యంత ఆసక్తికరంగా ఉంటాయి.
జాతరకు ప్రభుత్వం రూ. 75 కోట్లను కేటాయించింది. అదనపు స్నాన ఘట్టాల ఏర్పాటు, తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణం, అంతర్గత రోడ్ల నిర్మాణం, పారిశుధ్య కార్యక్రమాలు, నిరంతర విద్యుత్తు సరఫరా, వైద్య సదుపాయాల కల్పన, విస్త త బందోబస్తు, రవాణా సౌకర్యాలు తదితర ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. రెవిన్యూ, రోడ్లు, భవనాల శాఖతోపాటు నీటిపారుదల, పోలీస్‌, వైద్య, ఆరోగ్య, పంచాయతీరాజ్‌, దేవాదాయ, గిరిజన శాఖలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయి.
మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన వనదేవతల ఉత్సవం. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర. రెండేళ్లకోసారి జరిగే మేడారం ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసింది. జాతర కోసం 75 కోట్లు కేటాయించింది. నేటి నుంచి 8వ తేదీ వరకు మేడారం జాతర జరుగనుంది. తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. జంపన్న వాగులో స్నానాలాచరించి వనదేవతల దర్శనం చేసుకోనున్నారు. వారి కోసం సర్కారు సర్వం సిద్ధం చేసింది. తాగునీరు, వైద్యం, రవాణా, పార్కింగ్‌ తదితర వసతులు కల్పించింది. అన్ని శాఖల సమన్వయంతో జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంది. 21 శాఖలు జాతర నిర్వహణలో భాగస్వాములవుతున్నాయి. దాదాపు కోటి మంది భక్తులు సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకోనున్నారు. అమ్మవార్లను సేవించుకుని మొక్కులు చెల్లిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని వారి విశ్వాసం. అందుకే మన రాష్ట్రం నుంచే కాకుండా పలు రాష్ట్రాలనుంచి వారంతా మేడారం తరలివస్తున్నారు. దీంతో, ఆ ప్రాంతం జన సంద్రంగా మారుతోంది. మేడారం జాతరలో ఐటీడీఏ విభాగం కీలక పాత్ర పోషిస్తోంది. గత నాలుగు నెలలుగా ఐటీడీఏ సిబ్బంది ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. కలెక్టర్‌ తో పాటు ఇతర ఉన్నతాధికారుల సూచనల మేరకు జాతర ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సకల సౌకర్యాలు కల్పించారు. ఒకవైపు భక్తుల తాడికి మరోవైపు అందమైన వాల్‌ పెయింటింగ్‌ లతో మేడారం సరికొత్త శోభను సంతరించుకుంది. జాతర ప్రాశస్త్రాన్ని గిరిజనుల సంస్క తి, సంప్రదాయాలను వారి జీవన విధానాన్ని తెలియజేస్తూ గీసిన కళారూపాలు మనసు దోచేస్తున్నాయి. రంగు రంగుల పెయింటింగ్‌ లు భక్తలను కట్టిపడేస్తున్నాయి.
ప్రత్యేక బస్సులు..
దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరు గడించిన మేడారం జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుండడంతో టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నగరంలోని పది ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపేందుకు సిద్ధమైంది. ఇప్పటికే గత నెల 26న 40 వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ప్రయోగాత్మకంగా నడిపారు. ఈ క్రమంలో ఆదివారం నుంచి ఈ నెల 8 వరకు మరో 500 బస్సు సర్వీసులను నడిపేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. బస్సుల్లో మేడారం సీట్ల బుకింగ్‌ ప్రక్రియను ప్రారంభించిన సందర్భంలో 50 మంది ఒకేసారి బుక్‌ చేసుకుంటే వారికి అనువైన ప్రాంతానికి బస్సును పంపిస్తామని గ్రేటర్‌ ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.
తెలంగాణ పర్యటక శాఖ కూడా మేడారం జాతరకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్‌- మేడారం- హైదరాబాద్‌ (వన్‌ డే ప్యాకేజీ టూర్‌) ఉదయం 6 గంటలకు యాత్రి నివాస్‌, సికింద్రాబాద్‌ నుంచి మొదలు కానుంది. అదే రాత్రి 10.30 హైదరాబాద్‌ చేరుకుంటారు. మేడారంతోపాటు వేయి స్తంభాల గుడి సందర్శన ఉంటుంది. బస్సు ఛార్జీలు వోల్వో బస్సు అయితే పెద్దలకు రూ.1,500.. పిల్లలకు రూ.1,200 వసూలు చేస్తారు. ఏసీ హైటెక్‌ కోచ్‌ బస్సులో పిలలకు రూ.800, పెద్దలకు రూ.వెయ్యి ఛార్జి చేస్తారు.