యు (కాంట్‌) టర్న్‌

నగరంలో ప్రమాదాలకు నెలవుగా మారిన మధ్య మలుపులు

-ఎక్కడా సూచిక బోర్డులు లేవు
-రహదారుల విస్తరణ లేదు
-ఇరుకు రోడ్లతో ప్రమాదాల్లో వాహనదారులు
-పలు చోట్ల వాహనాలు ముందుకు కదలని పరిస్థితి
-కార్యాలయాలకు ఆలస్యంగా చేరుకుంటున్న ఉద్యోగులు
-విశ్వనగరానికి ఆటంకంగా మారిన యూటర్న్‌లు

హైదరాబాద్‌:
నగరంలో యూటర్న్‌లు ప్రమాదభరితంగా మారుతున్నాయి. అక్కడ సిగ్నల్స్‌, బారికేడ్లు లేకపోవడంతో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. రోడ్లు ఇరుకుగా ఉండటంతో టర్న్‌ తీసుకోవడానికి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ట్రాఫిక్‌ జాం అవుతోంది. కొన్నిచోట్ల ఈ మలుపులు ఉపయోగపడే ప్రాంతాల్లో కాకుండా ఎక్కడో ఉంటున్నాయి. దాని వల్ల చాలా దూరం ప్రయాణించి వెనక్కి తిరిగి రావాల్సి వస్తోంది.
కేపీహెచ్‌బీ నుంచి కూకట్‌పల్లిలోని బాలాజీనగర్‌కు వెళ్లాలంటే ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరకూ వెళ్లి యూటర్న్‌ తీసుకోవాలి. అంటే హనదారుడు దాదాపు 3 కిలోమీటర్లు అదనంగా వెళ్లి మలుపు తీసుకుని రావాలి. దీనివల్ల సమయం, డబ్బు వ థా అవుతోంది. దీనికి తోడు ట్రాఫిక్‌ జాం. దీంతో చాలా మంది వివేకానంద రిహబిలిటేషన్‌ సెంటర్‌ నుంచి రాంగ్‌రూట్‌లో వెళ్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. లేదా చలానాలను భరిస్తున్నారు. అందువల్ల ఈ దూరాభారాలను తగ్గించాలని వాహనదారులు కోరుకుంటున్నారు.
సిగ్నల్స్‌ తొలగించి యూటర్న్‌లు
ఆర్టీసీ క్రాస్‌రోడ్‌, అశోక్‌నగర్‌ చౌరస్తా, ముషీరాబాద్‌ చౌరస్తాలో ట్రాఫిక్‌ సిగ్నల్‌ను తొలగించి యూటర్న్‌లు పెట్టారు. భారీ వాహనాలు మళ్లించే క్రమంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నల్లకుంట డివిజన్‌ పరిధిలోని రత్నానగర్‌ యూటర్న్‌లో ప్రమాదాలు జరుగుతున్నాయి. శంకర్‌మఠ్‌ కూరగాయల మార్కెట్‌ సమీపంలోని ఎస్‌బీఐ బ్యాంక్‌ వద్ద, శివం రోడ్డులో శిరిడీ సాయిబాబా దేవస్థానం సమీపంలో, బతుకమ్మ కుంటల వద్ద ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. ఆబిడ్స్‌ జీపీవో చౌరస్తా, ఎంజేమార్కెట్‌, అఫ్జల్‌గంజ్‌ చౌరస్తా, కోఠి ఉమెన్స్‌ కాలేజీ వద్ద యూటర్న్‌లతో ట్రాఫిక్‌ స్తంభిస్తోంది.
దూరాభారం
గచ్చిబౌలి బయోడైవర్సిటీ నుంచి రహేజా మైండ్‌ స్పేస్‌ వరకు వెళ్లాల్సిన వారు సైబర్‌ టవర్‌ సర్కిల్‌ వద్దకెళ్లి యూటర్న్‌ తీసుకోవాల్సిన పరిస్థితి. నాలుగు కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తుంది. దిల్‌సుఖ్‌నగర్‌ ఐడియా కళాశాల యూటర్న్‌ నుంచి రాజధాని థియేటర్‌ యూటర్న్‌ మధ్య 900 మీటర్ల దూరం ఉంది. చైతన్యపురి పుష్పాగార్డెన్‌ నుంచి కొత్తపేట చౌరస్తా యూటర్న్‌ వరకు 800 మీటర్ల దూరం ఉంది. వాహనదారులు అటూఇటూ తిరిగి వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఎల్‌బీనగర్‌లో ఫ్లై ఓవర్ల నిర్మాణ పనుల వల్ల బారీకేడ్లను ఏర్పాటు చేసి చాలా దూరంలో యూటర్న్‌లిచ్చారు.
బైరామల్‌గూడ నుంచి వచ్చే వాహనదారులు డీమార్టు వద్ద యూ టర్న్‌ చేసుకొని ఉప్పల్‌, హయత్‌నగర్‌ వైపు వెళ్లాల్సి వస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఉప్పల్‌, బైరామల్‌గూడ వైపు నుంచి వచ్చే వాహనదారులు ఇలా రోడ్డు మళ్లింపుతో ఆరేడు నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కామినేని జంక్షన్‌లో ఫ్లై ఓవర్ల నిర్మాణం వల్ల యూ టర్న్‌లు దూరంగా ఏర్పాటు చేయటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.
ఎల్‌బీనగర్‌ నుంచి మన్సూరాబాద్‌ వైపు వెళ్లే మార్గంలో యూ టర్న్‌ల మధ్య దూరం సుమారు 800 మీటర్లు ఉంది.
ప్రమాదాల పాయింట్లు
దిల్‌సుఖ్‌నగర్‌ చౌరస్తాలో గతంలోని యూటర్న్‌ను మూసేసి ఐడీయల్‌ జూనియర్‌ కళాశాల ముందు ఏర్పాటు చేశారు. అక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ముసారాంబాగ్‌ నుంచి దిల్‌సుఖ్‌నగర్‌, మలక్‌పేట మార్కెట్‌ నుంచి ముసారాంబాగ్‌ వైపు వెళ్లే మార్గాల్లోనూ ఇదే పరిస్థితి. దిల్‌సుక్‌నగర్‌, గడ్డిఅన్నారం, సలీంనగర్‌, మలక్‌పేటలో చౌరస్తాల్లో వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు సిగ్నల్స్‌ను మొదట్లో ఏర్పాటు చేసినా ఇప్పుడు దిల్‌సుక్‌నగర్‌ చౌరస్తా మినహా ఎక్కడా లేవు. దిల్‌సుఖ్‌నగర్‌లో ఆర్టీసీ బస్సులు యూటర్న్‌ తీసుకునే క్రమంలో ట్రాఫిక్‌ జాం అవుతోంది. సంతోషనగర్‌లోని పిసల్‌బండ చౌరస్తా, రక్షాపురం, డీఆర్‌డీఎల్‌ వద్ద యూ టర్న్‌ ప్రమాదకరంగా మారింది. ఎలాంటి సూచికలూ లేకపోవడంతో ప్రమాదాలై చనిపోయిన ఘటనలున్నాయి. పిసల్‌బండ చౌరస్తాలోని యూటర్న్‌ వద్ద అతి వేగంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వనస్థలిపురం ఆటోనగర్‌లోనూ అదే పరిస్థితి. మల్కాజిగిరి ఆర్‌కేనగర్‌లోని లక్ష్మీవిలాస్‌ బ్యాంక్‌ వద్ద సైతం యూ టర్న్‌ అత్యంత ప్రమాదకరంగా మారింది. సికింద్రాబాద్‌ – ఉప్పల్‌ మార్గంలో ఫ్లైఓవర్‌ను నిర్మించారు. దీని వల్ల తార్నాక జంక్షన్‌లో ట్రాఫిక్‌ సమస్య తీరింది. ప్రస్తుతం ట్రాఫిక్‌ పోలీసులు ఫ్లైఓవర్‌ కింది నుంచి వాహనాలు వెళ్లకుండా మూసేశారు. ఉస్మానియా వర్శిటీ నుంచి వచ్చే వాహనాలు లాలాగూడ వైపు వెళ్లడానికి గానీ, నాచారం వైపు వెళ్లడానికి గానీ తార్నాక రైల్వే డిగ్రీ కాలేజీ ముందుకెళ్ళి అక్కడ యూటర్న్‌ తీసుకోవాలి. అదేవిధంగా లాలాగూడ నుంచి తార్నాక జంక్షన్‌కు వచ్చి ఉస్మానియా యూనివర్శిటీ రోడ్‌లో వెళ్లాలనుకునే వాహనాలు హబ్సీగూడ వరకు వెళ్ళి యూటర్న్‌ తీసుకోవాలి. కిలోమీటర్ల దూరం వెళ్ళి యూటర్న్‌లు తీసుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. సికింద్రాబాద్‌-ఉప్పల్‌ మార్గంలో వాహనాలు వేగంగా వెళ్తుండడంతో యూటర్న్‌ తీసుకునే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎల్‌బీనగర్‌ నుంచి సిక్రిందాబాద్‌కు వెళ్ళే మార్గంలో కామినేని ఆస్పత్రి, నాగోల్‌, ఉప్పల్‌, ఎన్‌జీఆర్‌ఐ, తార్నాక, మెట్టుగూడ ఉన్న సిగ్నల్స్‌ పూర్తిగా ఎత్తేసి యూటర్న్‌లు పెట్టారు. ఫ్రీ సిగ్నల్‌ సిటీకి నగర ట్రాఫిక్‌, జీహెచ్‌ఎంసీ అధికారులు కొత్త అర్థం తీసుకొచ్చారు. రోడ్లలో యూటర్న్‌లను తీసుకురావడంతో ట్రాఫిక్‌ జామ్‌లు తలెత్తుతున్నాయి. వాహనదారులకు సమయం వ థాతో పాటు వాహన మెయింటనెన్స్‌ ఖర్చు అధికమవుతోంది.
పాతబస్తీలో పాట్లు
పాతబస్తీలో ఘాన్సీబజార్‌, ముర్గీచౌక్‌ నుంచి వచ్చే వాహనదారులు యాకుత్‌పురా, బడాబజార్‌, మీరాలంమండి వెళ్ళాలంటే షెహరాన్‌ హోటల్‌ నుంచి యూ టర్న్‌ తీసుకొని తిరిగి గుల్జార్‌హౌజ్‌కు వచ్చి పంజెషా నుంచి వెళ్ళాల్సి వస్తోంది. ఎతేబార్‌చౌక్‌ నుంచి దారుషిఫా వెళ్ళే మార్గంలో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్‌ జామ్‌లవుతున్నాయి. రక్షాపురం చౌరస్తా వద్ద బారికేడ్ల ఏర్పాటుతో ఉప్పుగూడ, గౌలిపుర, రక్షాపురం కాలనీ, రియాసత్‌నగర్‌, ఈదీబజార్‌, యాకుత్‌పురా వైపు నుంచి చాంద్రాయణగుట్ట వెళ్ళాలంటే డీఆర్‌డీఎల్‌ చౌరస్తాకు వెళ్ళి యూ టర్న్‌ తీసుకోవాల్సి వస్తోంది. హఫీజ్‌బాబానగర్‌ చౌరస్తా మూసివేయడంతోనూ అదే పరిస్థితి. చాంద్రాయణగుట్ట కేశవగిరి చౌరస్తాను మూసి రుమాన్‌ హోటల్‌ వద్ద యూ టర్న్‌ పెట్టడంతో వాహనాలు ఇష్టానుసారంగా వస్తున్నాయి. బారికేడ్లను కూడా పెట్టలేదు
కూకట్‌పల్లిలో కిలోమీటర్ల దూరం..
కూకట్‌పల్లి పరిధిలోని ఏఎసరాజునగర్‌, సుమిత్రానగర్‌, కూకట్‌పల్లి, బాలాజీనగర్‌, ఎన్‌కేఎన్‌ఆర్‌ గార్డెన్‌ ప్రాంతాలకు కిలోమీటర్ల దూరంలో యూటర్న్‌లు ఉన్నాయి. దీంతో వాహనదారులు రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారు. ఏఎసరాజునగర్‌ వద్ద, కూకట్‌పల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఐడీపీఎల్‌, ఆంధ్రాబ్యాంకు వద్ద గల యూటర్న్‌లతో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. కేపీహెచ్‌బీ కాలనీ, హైటెక్‌ సిటీ నుంచి జాతీయ రహదారిపై జేఎన్‌టీయూ వద్ద యూటర్న్‌ తీసుకుని ప్రగతినగర్‌, కూకట్‌పల్లి వైపు వెళ్లే మార్గంలో ట్రాఫిక్‌ తీవ్రంగా ఉంటోంది. హైదర్‌నగర్‌ భ్రమరాంభ మల్లికార్జున థియేటర్ల వద్ద, మైసమ్మ టెంపుల్‌ ముందు గల యూటర్న్‌లు ట్రాఫిక్‌తో స్తంభిస్తున్నాయి.

ఎర్రగడ్డ నుంచి ఖైరతాబాద్‌ వరకు సూచికల్లేవ్‌
ఎర్రగడ్డ నుంచి ఖైరతాబాద్‌ చౌరస్తా వరకు గల ప్రధాన రహదారిలో ఫ్లై ఓవర్‌ ముందున్న యూటర్న్‌ వద్ద సూచికబోర్డులు లేకపోవడంతో వెనుక నుంచి వచ్చే వాహనాలు వెళ్లే అవకాశం లేకుండా పోతోంది. ఎస్‌ఆర్‌నగర్‌ చౌరస్తా దాటిన అనంతరం ఉన్న యూటర్న్‌ వద్ద వాహనాలు టర్నింగ్‌ తిరుగుతున్నాయి. ఇక్కడ రోడ్డు చిన్నగా ఉండడం, సూచిక బోర్డు లేకపోవడంతో యూటర్న్‌ ఉందనే విషయం తెలియక వాహనదారులు అవస్థలు పడుతున్నారు. బిగ్‌బజార్‌ వద్ద ఉన్న యూటర్న్‌ ప్రమాదకరంగా మారింది.
రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో…
రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలో అత్తాపూర్‌ నుంచి ఆరాంఘర్‌ వరకు ఉన్న పీవీ నర్సింహ్మారావు ఎక్స్‌ప్రెస వే కింద పలు యూ టర్న్‌లున్నాయి. పిల్లర్‌ నెంబర్‌ 156 వద్ద వాహనాలు మలుపు తీసుకునే క్రమంలో ప్రమాదాలవుతున్నాయి. ట్రాఫిక్‌ పోలీసుల్లేకపోవడంతో శివానగర్‌ నుంచి వచ్చే వాహనదారులు రాంగ్‌రూట్‌లో వెళ్తున్నారు. అదే సమయంలో హైదర్‌గూడ వెళ్ళేవారు ఇదే యూ టర్న్‌ నుంచి మలుపు తిరిగి బస్తీకి చేరుకోవాల్సి ఉంటుంది. పిల్లర్‌ నెంబర్‌ 166, 134ల వద్ద బారికేడ్లు సరిగ్గా లేక వాహనదారులు ఇష్టానుసారంగా మలుపు తీసుకుంటున్నారు.