ఫోటో.. కాంగ్రెస్ లోగో..
- – కోటకు.. బీటలు…
- -హేమాహేమీలు దూరం
- – మాజీ మంత్రి సునీతా రెడ్డితో మొదలు
- – అదే మార్గంలో మాజీ ఎమ్మెల్యే శశి ు
- – స్ఠబ్దంగా ఉన్న రాములమ్మ ు
- -ఉన్న కేడర్ తోనే తూతూమంత్రంగా కార్యక్రమాలు ు
- – రోజురోజుకీ బలహీన పడుతున్న హస్తం పార్టీ ు
- మెదక్ ప్రతినిధి- జ్యోతి న్యూస్
చారిత్రక నేపథ్యం కలిగిన గడ్డ… సాక్షాత్తు దివంగత మహానేత ఇందిరా గాంధీ నేతత్వం వహించిన ప్రాంతం…రాజకీయ ఉద్దండులకు నిలయం…ఉమ్మడి మెదక్ జిల్లాలో దివంగత కాంగ్రెస్ నేత బాగారెడ్డి నుండి యువ నాయకులైన శశిధర్ రెడ్డి వరకు బలమైన కేడర్‌ను కలిగి ఉండి,అత్యంత శక్తివంతమైన రాజకీయ పార్టీగా ఓ వెలుగు వెలిగిన ”కాంగ్రెస్ పార్టీ” ఉనికి దాదాపు ప్రశ్నార్థకంగా మారింది. సరైన నాయకత్వ లేమి కొట్టిచ్ఛినట్టు కనిపిస్తోంది. రాజకీయ వ్యూహాలు,ఎత్తుగడలు,దిగువశ్రేణి నాయకత్వంతో సాన్నిహిత్యం, కేడర్‌ను కాపాడుకోవడం లాంటి అంశాలను కాంగ్రెస్‌పార్టీ ఎప్పుడో మర్చిపోయిందన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. దీనికి తోడు గ్రూపు తగాదాలు, నాయకుల మధ్య మనస్పర్థలు,ఆ పార్టీకి శాపంగా మారాయి,బల్దియా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలో ఈ పరిణామాలు ఆ పార్టీ కార్యకర్తల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సోమవారం మెదక్ జిల్లాలో వివిధ అభివద్ధి కార్యక్రమాల కోసం సుడిగాలి పర్యటన నిర్వహించారు. దీంట్లో భాగంగా అర్హులైన రైతులకు ట్రాక్టర్లు పంపిణీ చేశారు. ఐతే ఇదే విషయమై మంగళవారం మంత్రి హరీష్ రావు పర్యటన,ట్రాక్టర్ల పంపిణీపై కాంగ్రెస్ కార్యాలయంలో నాయకులు ధ్వజమెత్తారు. తమ అనుచరగణానికి పైరవీకారులకే ట్రాక్టర్లు ఇచ్చారని విమర్శలు గుప్పించారు.కానీ సీనియర్ నేతలు ఎవరూ ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. గత సార్వత్రిక ఎన్నికల్లో హస్తం తీర్ధం పుచ్చుకున్న ఓ నాయకుడు ఈ కార్యక్రమం చేపట్టడం సుతారమూ ఇష్టం లేని ఇతర సీనియర్ నేతలు ఈ కార్యక్రమానికి గైర్హాజరవ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది.ఓ మాజీ కౌన్సిలర్ ఇతర చోటామోట నాయకులు తప్పితే ఇతర సీనియర్ నేతలు దూరంగా ఉండడం ఆ పార్టీ నేతల్లో సైతం మింగుడుపడడం లేదు.దీంతో ఈ విషయమై దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు హస్తం పార్టీ పెద్దలు పోటాపోటీ సమావేశాలు పెట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది,ఈ పరిణామాలకు కొనసాగింపుగా బుదవారం డీసీసీ అధ్యక్షులు కంఠరెడ్డి తిరుపతి రెడ్డి స్థానిక రాజీవ్ భవన్ లో ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
వరుస దెబ్బలతో కోలుకోలేని దుస్థితి..
సార్వత్రిక ఎన్నికలు,పార్లమెంట్ మొదలు,గ్రామ పంచాయితీ, ప్రాదేశికం,స్థానిక సంస్థలు,ఇలా అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మునుపెన్నడూ లేని రీతిలో ఫలితాలు రావడం ఆశ్చర్యాన్ని కలిగించాయి,ఈ పరిణామాలతో గ్రామీణ స్తాయిలో పార్టీ ప్రాభవం పూర్తిగా తగ్గుతూ వస్తోంది,కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడం లాంటి అంశాలు ఆ పార్టీలో దుమారాన్నే రేపాయి, సంస్థాగతంగా లోటుపాట్లను గుర్తించకపోవడం,ఓటమికి గల కారణాలను లోతుగా అధ్యయనం చేయకపోవడంతో ”హస్తం”పార్టీ జిల్లాలో పూర్తిగా కుదేలయ్యింది.
అధినేత ”ఆకర్ష్”తో నేతల వలసలు..
గులాబీ అధినేత సీఎం కేసీఆర్ సంధించిన ఆపరేషన్ ఆకర్ష్ మంత్రం జిల్లాలో బాగానే పనిచేసింది,ఏకంగా అప్పటి డీసీసీ అధినేత కాంగ్రెస్ పార్టీకి రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేసి,నర్సాపూర్ నియోజక వర్గంలో తిరుగులేని శక్తిగా ఉన్న కాంగ్రెస్ అనంతరం సునీతా రెడ్డి పార్టీ ఫిరాయించడంతో బలమైన నియోజక వర్గంగా పేరున్న నర్సాపూర్ ప్రస్తుతం ఉనికిని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని స్వయంగా ఆ పార్టీ నాయకులే పేర్కొనడం గమనార్హం.మీ వెంటే మేమంటూ కొంతమంది ముఖ్య నేతలు మినహాయిస్తే కాంగ్రెస్ కేడర్ ఆ నియోజక వర్గంలో ఖాళీ అయ్యింది,ఇక అప్పటి నుండి వరుస వలసలు ఆ పార్టీకి కోలుకోని విధంగా తయారయ్యాయి.ఈ లోపే డీసీసీ పదవులు ప్రకటించడం అనేక మంది సీనియర్ నాయకులు ఆశలు పెట్టుకున్నా,చివరికి మరో నేత ‘కంఠ రెడ్డి తిరుపతి రెడ్డి’కి ఈ పదవిని కట్టబెట్టారు.దీంతో సహజంగానే ఇతర నాయకుల్లో సైతం అసంతప్తి మొదలైంది. సరిగ్గా ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలచుకోవడంలో అధికార పార్టీ సక్సెస్ అయ్యిందని విశ్లేషకుల అంచనా. పీసీసీ పెద్దల తీరుతో మెదక్ నియోజక వర్గంలో మరో మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత శశిధర్‌రెడ్డి హస్తం పార్టీకి స్వస్తి చెప్పి”కమలం”గూటికి చేరారు.ఈయనతో పాటు కేడర్ కూడా వెళ్లిపోవడంతో మెదక్ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది.
మౌనమేల రాములమ్మ
సార్వత్రిక ఎన్నికల సమయంలో మెదక్ లోని చిల్డ్రన్స్ పార్కులో నిర్వహించిన బహిరంగ సభలో మాజీ ఎంపీ ఫైర్ బ్రాండ్ రాములమ్మ అధికార పార్టీపై నిప్పులు చెరిగారు,తన పదునైన మాటలతో కార్యకర్తల్లో కొత్త ఉత్తేజాన్ని నింపారు,కానీ ఎన్నికలు ముగిసిన అనంతరం కాంగ్రెస్ పార్టీకి మిశ్రమ ఫలితాలు రావడంతో ఆమె సైలెంట్‌గా ఉంటున్నారు.కాంగ్రెస్ ను వీడి బీజేపీలోకి చేరేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో మరోసారి ఆందోళన మొదలైంది. గత కొన్ని రోజులుగా బీజేపీ అగ్రనాయకులతో ఆమె సన్నిహితంగా ఉంటున్నారు,దీంతో ఆమె కమలం గూటికి చేరడం ఖాయమని తెలుస్తోంది,ఐతే సరైన సమయం కోసం వేచి చూస్తున్నట్టు రాజకీయ వర్గాల భోగట్ట.
నాయకత్వ లోపం కేడర్‌కు శాపం
జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితి పట్ల కింది స్థాయి నేతల్లో అయోమయం నెలకొంది,జిల్లా నాయకులకు కింది స్థాయి కార్యకర్తలకు సమన్వయ లోపం కూడా కనిపిస్తోంది,జిల్లా అధ్యక్షుడి తీరుతో నియోజక వర్గంలోని రామాయంపేట, చిన్నశంకరం పేట,తదితర మండలాల్లో గ్రూపులను ప్రోత్సహిస్తున్నాడని వారు ఆరోపిస్తున్నారు,దీంతో పీసీసీ పిలుపులు జిల్లా కేంద్రం మినహాయిస్తే ఇతర మండలాల్లో కార్యక్రమాలు జరగడం లేదు,ఈ తీరుతో మనస్తాపానికి గురైన మండల నాయకులు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.