భాగ్య నగరం

వానొస్తే నరకం
ఏరులు తలపించే వీధులు..ట్రాఫిక్‌ పద్మవ్యూహంలో వాహనదారులు
  • -అరగంట వానొస్తే ఎక్కడికక్కడ నిలిచిపోయే వాహనాలు
  • -నిజాం కాలంనాటి డ్రైనేజీ వ్యవస్థ
  • -ఆక్రమణలకు గురవుతున్న నాలాలు, చెరువులు
  • -అడ్డగోలుగా నిర్మాణాలకు అనుమతులు
  • -అస్తవ్యస్తంగా ట్రాఫిక్‌ రూల్స్‌
  • -లోపభూయిష్టంగా సిగ్నలింగ్‌ వ్యవస్థ
  • -గంటల తరబడి రోడ్లపై వాహనదారుల ఇక్కట్లు
  • -నేలకొరుగుతున్న మహా వృక్షాలు
  • -చేతులెత్తేస్తున్న నగరపాలక సంస్థ సిబ్బంది

హైదరాబాద్‌:
పేరుకు మహా నగరం. వర్షం వస్తే రోడ్లన్నీ జలపాతం. సాయంత్రం వేళ కురిస్తే ఇంటికి చేరుకునే వాహనదారులకు చుక్కలు కనిపిస్తాయి. ఇక ఆ రాత్రంతా ట్రాఫిక్‌ పోలీసులకు, జీహెచ్‌ఎంసీ సిబ్బందికి కాళరాత్రే. నిజాం ప్రభువుల కాలంనాటి డ్రైనేజీ వ్యవస్థ తీరు మారదు. నాలాలు కుచించుకుపోతున్నా పట్టించుకునే నాధుడు లేడు. నిబంధనలకు విరుద్ధంగా చెరువులు, నాలాలు కబ్జాచేసి అక్రమ కట్టడాలు వెలుస్తున్నా నిమ్మకు నీరెత్తని అధికారులు వెరసి సామాన్యుల ప్రాణాలు సమిధలవుతున్నాయి. మంగళవారం కురిసిన కుంభవృష్టికి నాగోల్‌ నాలాలో పడి ఒకరు కొట్టుకుపోగా..ఇంకొకరిని స్థానికులు కాపాడారు. మొన్నటికి మొన్న వర్షం వస్తోందని మౌనిక అనే అమాయకురాలు మెట్రో పిల్లర్‌ కింద నించుంటే ఆ పిల్లరే కిల్లరై ఆమెను కాటేసింది. గతంలోనూ హైదరాబాద్‌ నాలాలలో పడి ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు. నగరం ఎటు చూసినా సురక్షితంగా లేదంటూ ఫిర్యాదులందుతున్నాయి.
కాంట్రాక్టర్లు కూడా వేసవికాలం అంతా ఉట్టిగా గడిపి వర్షాలు మొదలవుతుండగా రోడ్ల నిర్మాణాలు చేపడుతుంటారు. దీనితో కొన్ని కాలనీలలో తెరిచివుంచిన మ్యాన్‌హోల్స్‌లో పడి అనేకులు ప్రాణాలు వదిలిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఎప్పటికప్పుడు పూడికతీత పనులు చేపడుతునే ఉంటామంటారు. కానీ భారీ వర్షాలు వచ్చినప్పుడు మాత్రం నామమాత్రంగా చేతులు దులిపేసుకుంటున్నారు.
మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి దాకా కురిసిన వర్షంతో హైదరాబాద్‌ తడిసి ముద్దయింది. మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకూ జోరు వాన కురిసింది. ఎడతెరపి లేకుండా కురిసిన ఈ వర్షానికి నగరం వణికిపోయింది. సుమారు ఏడు గంటల వాన నగరవాసులను ఆశ్చర్యానికి గురి చేసింది. విరామం లేకుండా కురిసిన వానకు రోడ్లన్నీ చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరి జనం తీవ్ర ఇక్కట్లు పడ్డారు. వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. వరద నీటిలో పలు ప్రాంతాల్లో వాహనాలు కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపై వక్షాలు నేలకొరిగాయి. దాదాపు నగరమంతా నీట మునిగింది. లోతట్టు ప్రాంతాలలో రోడ్లపై మూడడుగుల వరకు నీరు ప్రవహించడంతో ద్విచక్రవాహనదారులు నరకయాతన అనుభవించారు. అనేక చోట్ల కార్లు దాదాపు నీట మునిగాయి. రోడ్లు కనపడనంతగా నీళ్ళు చేరుకోవడంతో నగరంలో అనేకప్రాంతాలలో బారీగా ట్రాఫిక్‌ జామ్స్‌ ఏర్పడ్డాయి. కిలో మీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్‌ లో పలు ప్రాంతాలలో సుమారు 6-8 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు అవడం విశేషం. ఈ భారీ వర్షానికి ఈదురుగాలులు కూడా తోడవడంతో నగరంలో అనేక చోట్ల చెట్లు రోడ్డుకి అడ్డంగా కూలిపోవడంతో వాటి కారణంగా కూడా ట్రాఫిక్‌ జామ్స్‌ అవుతున్నాయి. నగరంలో అంబర్‌ పేట్‌, నల్లకుంట, హిమాయత్‌ నగర్‌, విద్యానగర్‌, నాంపల్లి, చిక్కడపల్లి, గాంధీనగర్‌, ముషీరాబాద్‌, రాంనగర్‌, చార్మినార్‌, గోషామహల్‌ మొదలైన ప్రాంతాలలో రోడ్లపైకి బారీగా నీళ్ళు చేరాయి. నాలాలు పొంగి ప్రవహిస్తుండటంతో అడుగు ముందుకు వేస్తే ప్రాణాలతో చెలగాటం ఆడినట్లే అవుతోంది. మెహిదీపట్నం, మలక్‌ పేట్‌, సంతోష్‌ నగర్‌, ఉప్పల్‌, రామాంతపూర్‌, సనత్‌ నగర్‌ తదితర ప్రాంతాలలో కొన్ని ఇళ్ళలోకి నీళ్ళు ప్రవేశించడంతో అందులో నివసిస్తున్నవారు చాలా ఆందోళనచెందారు. భారీ వర్షం కురియడంతో అనేక చోట్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. మరికొన్ని చోట్ల విద్యుత్‌ శాఖవారే ముందు జాగ్రత్తచర్యగా విద్యుత్‌ నిలిపివేయడంతో ఎప్పుడూ విద్యుత్‌ కాంతులతో ధగధగ మెరిసే హైదరాబాద్‌ నగరంలో చీకట్లు కమ్ముకొన్నాయి. సాయంత్రం ఆఫీసుల నుంచి ఇళ్ళకు బయలుదేరినవారు రాత్రి 8.30 గంటలైనా ఇంకా వర్షంలో, ట్రాఫిక్‌ లో చిక్కుకొనిపోయున్నారు. ఇంకా ఎప్పటికి ట్రాఫిక్‌ క్లియర్‌ అవుతుందో తెలియక రోడ్లపై చాలా ఇబ్బందిపడ్డారు. ముఖ్యంగా మహిళలు, విద్యార్ధులు చాలా ఇబ్బంది పడ్డారు. మరికొన్ని గంటలపాటు ఇదే స్థాయిలో భారీగా వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిసి వాతావరణ శాఖ హెచ్చరించడంతో, ప్రజలను ఇళ్ళలో నుంచి బయటకు రావద్దని జి.హెచ్‌.ఎం.సి., పోలీస్‌ సిబ్బంది హెచ్చరించారు.
మంగళవారం కురిసిన ఈ భారీ వర్షాలు హైదరాబాద్‌ నగరంలో డ్రైనేజీ వ్యవస్థ వైఫల్యానికి అద్దం పట్టాయి. కనుక ఈ స్థాయిలో వర్షాలు కురిసినా తట్టుకొనేవిధంగా నగరంలో డ్రైనేజీ వ్యవస్థను సమూలంగా ఆధునీకరించవలసిన అవసరం ఉందని స్పష్టం అయ్యింది. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ కష్టాలు అన్నీ ఇన్నీ కావు మామూలు రోజుల్లోనే గంటకు పది నుండి ఇరవై కిలోమీటర్ల మేర మాత్రమే వాహనాలు కదిలే పరిస్థితి ఉంటుంది. ఇక వర్షాలు కురిస్తే మాత్రం వాహనదారుల కష్టాలు మాత్రం వర్ణనాతీతం అని చెప్పవచ్చు. వర్షం కారణంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోతాయి. దీంతో ట్రాఫిక్‌ పోలీసులు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రాఫిక్‌ కష్టాలు లేకుండా పలు ప్రాంతాల్లో డైవర్షన్‌ చేపట్టారు.
హైదరాబాద్‌లో ఇటీవల కురిసిన వర్షాలతో అలర్ట్‌ అయిన పోలీసులు రానున్న రోజుల్లో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.. ముఖ్యంగా వర్షాకాలం కావడంతోపాటు రోడ్ల పైకి నీరు చేరి ట్రాఫిక్‌ నెమ్మదిగా కదులుతోంది. ఈ నేపథ్యంలోనే వర్షం పడ్డ రోజు గంటకు 10 కిలోమీటర్లు కూడ కదలని పరిస్థితి..ఎందుకంటే రోడ్డుపై నీరు నిలవడంతోపాటు, ఎక్కడ ఏ మ్యాన్‌ హోల్‌ తెరుచుకుని ఉంటుందో తెలియని పరిస్థితి..దీనికి తోడు కార్యాలయాల నుండి ఇంటికి వెళ్లేందుకు ఒక్కసారిగా ఉద్యోగులు రోడ్లమీదకు రావడంతో వేలాదిగా వాహానాలు నిలిచిపోతున్నాయి. దీంతో ట్రాఫిక్‌ను క్లియర్‌ చేసేందుకు పోలీసులు నానా కష్టాలు పడుతున్నారు.ఈ నేపథ్యంలోనే వర్షాలు పడే రోజున ఇప్పటికే యూ టర్న్‌లను మూసివేస్తున్నారు. యూటర్న్‌ల వద్ద పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ జాం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు మెయిన్‌ రోడ్డును తాకే చిన్న చిన్న గల్లీలలో ట్రాఫిక్‌ కూడ డైవర్ట్‌ చేస్తున్నారు. దీంతోపాటు ట్రాఫిక్‌ డైవర్షన్‌ చేపట్టారు..వాహనాదారులు ఒకే రూటులో తమ గమ్యానికి చేరుకోవడం ద్వార మొత్తం ట్రాఫిక్‌ అంతా మెయిన్‌ రోడ్లపై నిలిచిపోతుంది. ఈనేపథ్యంలో ట్రాఫిక్‌ డైవర్షన్‌ను చెపట్టారు. వర్షాలు పడే రోజుతో పాటు ట్రాఫిక్‌ ఎక్కువగా ఉండే ప్రధాన రోడ్ల ట్రాఫిక్‌ను ఇతర రూట్లలోకి మళ్లించనున్నారు.దీంతో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ట్రాఫిక్‌ పోలీసులు.
ముఖ్యంగా హైటెక్‌ సిటీతోపాటు మైండ్‌ స్పేస్‌ గచ్చిబౌలి ప్రాంతాలలో వర్షం కారణంగా ప్రయాణికులు చాల ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను పరిష్కరించేందుకు రూట్‌ మ్యాప్‌లను సిద్దం చేశారు. జేఎన్టీయూ, గచ్చిబౌలి, ట్రిపుల్‌ ఐటీ, నెహ్రూ జంక్షన్‌, జేఎన్టీయూ, మైండ్‌ స్పేస్‌ మధ్య రోజూ వారీ మార్గాలను కాకుండా ఇతర మార్గాలు సూచించారు. ఇందులో భాగంగానే జేఎన్టీయూ నుంచి గచ్చిబౌలి వెళ్లే వాళ్లు మియాపూర్‌, ఆల్వీన్‌, బెల్‌, గుల్మోహర్‌, హెచ్‌సీయూ, ట్రిపుల్‌ ఐటీ జంక్షన్‌, గచ్చిబౌలి చేరుకోవాలని ట్రాఫిక్‌ పోలీసులు సూచించారు. మరోవైపు జేఎన్టీయూ నుంచి మలేషియన్‌ టౌన్‌ షిప్‌ మీదుగా మైండ్‌ స్పేస్‌ వెళ్లే వాళ్లు.. మియాపూర్‌, ఆల్వీన్‌ కాలనీ, హఫీజ్‌ పేట్‌, కొండాపూర్‌, కొత్తగూడ, సైబర్‌ టవర్‌ గుండా మైండ్‌ స్పేస్‌కు చేరుకోవాలని తెలిపారు.ఇక ట్రిపుల్‌ ఐటీ నుంచి గచ్చిబౌలీ, కొత్తగూడ మీదుగా నెహ్రూ జంక్షన్‌కు వెళ్లే వాళ్లు%ౌౌ% గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, ఖాజాగూడ, విస్పర్‌ వ్యాలే, కేబీర్‌ పార్క్‌ మీదుగా నెహ్రూ జంక్షన్‌ చేరుకోవాలని పోలీసులు సూచించారు.
నగరంలో గత ఐదారు సంవత్సరాల్లో ఇంత భారీ స్థాయిలో వర్షం కురవడం ఇదే తొలిసారని తెలుస్తోంది. మధ్యాహ్నం నుంచే హైదరాబాద్‌ చుట్టూ కారుమబ్బులు కమ్ముకున్నాయి. సాయంత్రం 4 గంటలకు ఓ మోస్తరు వర్షం కురిసింది. మళ్లీ రాత్రి ఎనిమిది గంటలకు వర్షం మొదలైంది కుంపోతగా పదకొండు గంటల వరకూ కొనసాగింది. వర్షానికే నగర జీవనం స్తంభించిపోగా.. కాస్త తెరిపి ఇచ్చినట్లే ఇచ్చి ఆకాశానికి చిల్లు పడినట్లుగా వాన కురిసింది. దీంతో రోడ్లపై ఎక్కడివారు అక్కడే చిక్కుకుపోయి.. ఇంటికి వెళ్లే దారి తెలియక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
రోడ్లపై భారీ స్థాయిలో నీరు నిలిచి ఇళ్లలోకి వస్తుండటంతో పలుచోట్ల మ్యాన్‌హోళ్ల మూతలు తెరిచేశారు. దీనికి తోడు చాలా ప్రాంతాల్లో ముందస్తు చర్యగా అధికారులు విద్యుత్‌ సరఫరా నిలిపేశారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. నగర వ్యాప్తంగా అన్ని చోట్లా వర్షం కురిసింది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఖైరతాబాద్‌, నాంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్‌, హైటెక్‌సిటీ, మియాపూర్‌, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఎర్రగడ్డ, సనత్‌ నగర్‌, అమీర్‌పేట, యూసఫ్‌గూడ, సికింద్రాబాద్‌, ఉప్పల్‌, నేరేడ్‌మెట్‌, ఏఎస్‌ రావు నగర్‌, తిరుమలగిరి, బాలానగర్‌, అల్వాల్‌, షేక్‌పేట్‌, పంజాగుట్ట, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్‌బీ నగర్‌, హయత్‌నగర్‌ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఎస్‌ఆర్‌ నగర్‌, అమీర్‌ పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మెహిదీపట్నం, గచ్చిబౌలి, ముషీరాబాద్‌, గాంధీనగర్‌, చిక్కడపల్లి, అశోక్‌నగర్‌, సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి సహా చాలాచోట్ల ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో రహదారులపై భారీగా వర్షపునీరు చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.
శ్రీనగర్‌ కాలనీలో ఏకంగా ఓ చెట్టు విరిగిపడిపోయింది. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్‌ వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఇటు గచ్చిబౌలి-హైటెక్‌ సిటీలో కూడా భారీగా ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. బోయిన్‌ పల్లి హైవేపై కూడా భారీగా వరదనీరు నిలిచింది. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. మరోవైపు యూసఫ్‌ గూడలో కుండపోత వర్సంతో నిలిపిన వాహనాలు వరదనీటిలో కొట్టుకుపోవడం కలకలం రేపింది.
తిరుమలగిరిలో అత్యధికంగా 6.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బాలానగర్‌ 5.5 సెం.మీ., మల్కాజ్‌గిరి 5.1 సెం.మీ., షేక్‌పేట 4.8 సెం.మీ., అసిఫ్‌నగర్‌ 4.5 సెం.మీ., వెస్ట్‌మారెడ్‌పల్లి 3.9 సెం.మీ., అల్వాల్‌ 3.5 సెం.మీ., శేరిలింగంపల్లి 3.1సెం.మీ., ఖైరతాబాద్‌లో 3 సెం.మీ. వర్షం పడినట్లు అధికారులు వెల్లడించారు.
ముందుజాగ్రత్తగా సహాయ చర్యల కోసం అధికారులు జీహెచ్‌ఎంసీ సిబ్బందిని రంగంలోకి దించారు. పలుచోట్ల నీళ్లు నిలిచిన ప్రాంతాల్లో మోటార్ల ద్వారా ఎత్తిపోశారు. మ్యాన్‌హోళ్లను తెరిచి వర్షపు నీటిని కిందికి పంపించారు. హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌.. జీహెచ్‌ఎంపీ ప్రధాన కార్యాలయం కమాండ్‌ కంట్రోల్‌ నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం పరిస్థితిని సమీక్షించారు.