యురేనియం ‘ఉరే’నియం

యురేనియం తవ్వకాల వల్ల నల్లమల అడవుల్లో ఉన్న అరుదైన ఆదివాసీ తెగ చెంచులు నిరాశ్రయులౌతారు. సహజ వనరులు, ఖనిజ వనరులను కార్పొరేట్‌ సంస్థలకు దోచిపెట్టేందుకే ఈ తవ్వకాలు. ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ‘హరితహారం’ పేరుతో అడవుల నుంచి ఆదివాసీలను గెంటివేసే నిర్ణయాలను ఈ ప్రభుత్వం తీసుకుంటోంది. అణుబాంబులన్నింటినీ నిర్మూలించాలని ప్రపంచ ప్రజలు కోరుతున్నపుడు, యురేనియం ఎందుకు? అణుబాంబులెందుకు? నల్లమల అడవిలో యురేనియం ఖనిజాన్ని తవ్వటానికి ప్రభుత్వం మరోసారి సన్నద్ధమవుతోంది. గ్రామ పంచాయతీల అనుమతి తీసుకోకుండానే ఆ ప్రాంత ప్రజలకు సమాచారం కూడా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం యురేనియం ఖనిజం తవ్వకానికి ‘యురేనియం కార్పొరేషన్‌ (యూ సి ఎల్‌)’ కు అనుమతి ఇచ్చింది.
ఈ యురేనియం మైనింగ్‌ వలన ప్రజానీకం ప్రాణాంతక జబ్బులకు లోను కావలసి వస్తుంది. నల్లమల అడవి నాశనమౌతుంది. అడవిపై ఆధారపడిన జీవరాశులన్నీ నశిస్తాయి. అణు ధూళితో కూడిన మట్టి కుప్పల వలన వాతావరణం నాశనమవుతుంది. అడవులు నాశనమై వర్షాభావం ఏర్పడుతుంది. కురిసిన వర్షపు నీటితో కొట్టుకు పోయిన అణు ధూళి క్రష్ణా నది లోనికి ప్రవేశిస్తుంది. ఆ నీరు తాగిన ప్రాంత ప్రజలందరూ అనారోగ్యం పాలవుతారు. భూమి విషపూరితం కావటం వల్ల పంటలు పండక పొలాలు బీడు పడతాయని ప్రజలు తీవ్ర ఆందోళనలు చేశారు. ఫలితంగా 2003లో నల్లమల అడవులలో నాటి ప్రభుత్వం యురేనియం తవ్వకాలను నిలిపేసింది. అయితే దేశవ్యాప్తంగా యురేనియం వెలికితీతకు ప్రభుత్వాల ప్రయత్నం ఆగలేదు. యురేనియం వెలికితీతకు, శుద్ధి కర్మాగారాల స్థాపనకు తీవ్ర వ్యతిరేకత మొదలయ్యింది. అణు కాలుష్యం లేకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి నాటి వై.యస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం తుమ్మలపల్లి ప్రాంతంలో యురేనియం వెలికి తీసే, శుద్ధి కర్మాగార స్థాపనకు ప్రోత్సాహమిచ్చింది. 2007లో రూ.1103 కోట్ల ఖర్చుతో 1700 ఎకరాల విస్తీర్ణంలో కర్మాగారాన్ని స్థాపించారు. రోజుకు 2000 టన్నుల నుండి 2500 టన్నుల వరకు ముడి ఖనిజాన్ని వెలికితీసి శుద్ధి చేస్తున్నారు. రైతుల వద్ద నుండి 650 ఎకరాలు, ప్రభుత్వ భూమి 1050 ఎకరాలను సేకరించారు. యురేనియం చెడు ప్రభావాలు లేకుండా అన్ని ఆధునిక సాంకేతిక జాగ్రత్తలు తీసుకుంటామని, భూములకు మంచి నష్ట పరిహారం, ఇంటికొక ఉద్యోగం, నిర్వాసితులకు సౌకర్యాలు, యురేనియం వ్యర్ధాల బారిన పడకుండా పూర్తి జాగ్రత్తలు, గ్రామ అభివ ద్ధి లాంటి వాగ్దానాలెన్నో ప్రభుత్వాధికారులు చేశారు. కాని వాస్తవానికి ఈ జాగ్రత్తలు పాటించలేదు. రాష్ట్ర కాలుష్య మండలి నిర్దేశించిన నియమాలు పాటించలేదు. భూగర్భ జలాలు కలుషితమై అడుగంటి పోయాయి. బోరులు అడుగంటి పోయాయి. తాగటానికి మంచి నీరు దొరకటం లేదు. వచ్చిన కొద్ది నీళ్ళతో పండిన పంటల దిగుబడి పడిపోయింది. అరటికాయలు, చేతి వేళ్ళ సైజుకి వచ్చాయి. టమోటాలు గోలీ కాయల సైజుకి వచ్చాయి. యురేనియం రేడియేషన్‌తో నీరు కలుషితమవ్వటమే కాకుండా పొలాలు బీళ్ళయ్యాయి.
అన్ని ఆధునిక సాంకేతిక జాగ్రత్తలు తీసుకుంటామన్న ప్రభుత్వాధికారుల వాగ్దానాలు గాలిలో కలిసిపోయాయి. నీటి కాలుష్య మండలి చేసిన పరీక్షల ప్రకారం మబ్బు చింతలపల్లి గ్రామ రైతు బోరులో అత్యధికంగా 4000 పీ పీ బీ (పార్ట్స్‌ పర్‌ బిలియన్‌) వరకూ యురేనియం గాఢత వున్నది. అణుశక్తి నియంత్రణ మండలి ప్రమాణాల ప్రకారం తాగు నీటిలో 60 పీ పీ బీ దాటి యురేనియం గాఢత ఉంటే హానికరం. నీరు కలుషితం కావటం వలన, యురేనియం గాఢత 60 పీ పీ బీ కన్నా ఎక్కువగా వుంటే, ఆ నీరు తాగిన వారి కిడ్నీలు చెడిపోతున్నాయి. క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తులవుతున్నారు. నపుంసకులు అవుతున్నారు. ఆడవారికి రుతుక్రమం తప్పుతున్నది. వరస అబార్షన్లయి పిల్లలను కనలేక పోతున్నారు. పిల్లలు కూడా అంగవైకల్యంతో పుడతారు. ఇప్పటికే చర్మ వ్యాధులు, కీళ్ళ నొప్పులతో సతమతమవుతున్నారు. ఈ విధంగా ప్రజారోగ్యాన్ని, భూమిని, నీటిని, గాలిని, పర్యావరణాన్ని నాశనం చేస్తున్న వాస్తవాన్ని విస్మరించటం పెద్ద మోసం.
ఆ ప్రాంత ప్రజలతో సహా మొత్తం జీవావరణ, పర్యావరణాలను ఇంత దారుణంగా నాశనం చేసి వెలికితీసే యురేనియం వలన మానవ కళ్యాణం ఏమన్నా చేకూరుతుందా? యురేనియంను ఇంధనంగా వాడే అణు విద్యుత్‌ కేంద్రాలు అనూహ్యంగా పేలి పోయి, ఏ ప్రమాదం జరగనప్పుడు కూడా అణువిద్యుత్‌ కేంద్రాల నుంచి, క్యాన్సరు మరియు తరతరాల పాటు వివిధ అంగ వైకల్యాలు కలిగించే ఆల్ఫా, బీటా, గామా కిరణాలు వెలువడుతూనే ఉంటాయి. 25-30 సంవత్సరాల తర్వాత ఈ యురేనియం అణువిద్యుత్‌ ఉత్పత్తి లేక అణు బాంబుల తయారీకి పనికి రాకుండా పోతుంది. అణు వ్యర్థ పదార్థాలు మిగులుతాయి. ఈ వ్యర్థ పదార్థాల చెడు ప్రభావాల వలన వచ్చే భయంకర పరణామాల నుండి ప్రజలను, పర్యావరణాన్ని కాపాడటంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయి. ఈ మొత్తం పరిశ్రమ మానవ కళ్యాణానికి కాదు మానవ విధ్వంసానికే కాక సర్వ జీవరాశి వినాశనానికి కారణమని గ్రహించాలి. అమెరికా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్‌, ఇంగ్లాండ్‌, జపాన్‌..దేశాల ప్రజలు పెద్ద ఎత్తున యురేనియం పరిశ్రమకు వ్యతిరేకంగా బ హత్తర ప్రజా ఉద్యమాలు నిర్మిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అణుధార్మిక ఉత్పత్తులకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడుస్తూ వుంటే భారత ప్రభుత్వం మాత్రం తన దుర్మార్గపు విధానాన్ని కొనసాగిస్తూనే వున్నది.
మన దేశంలో కావలసినంత ఎండ, గాలి, నీరు వున్నాయి. తక్కువ ఖర్చుతో ప్రమాద రహిత సౌరశక్తితో విద్యుత్‌ను అందించ వచ్చు. అలాగే ప్రమాద రహిత పవన విద్యుత్‌ను, జలవిద్యుత్‌ను అందించవచ్చు. అణు విద్యుత్‌ లేకుండానే కావలసినంత విద్యుత్‌ ఉత్పత్తి చేయవచ్చని పర్యావరణవేత్తలు ఘోషిస్తున్నారు. పరిశోధనలకు ప్రోత్సాహం, ప్రజారోగ్యంపై శ్రద్ధ కావాలి. యురేనియం తవ్వకాల వల్ల నల్లమల అడవుల్లో ఉన్న అరుదైన ఆదివాసీ తెగ చెంచులు నిరాశ్రయులౌతారు. సహజ వనరులు, ఖనిజ వనరులను కార్పొరేట్‌ సంస్థలకు దోచిపెట్టేందుకే ఈ తవ్వకాలు. ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ‘హరితహారం’ పేరుతో అడవుల నుంచి ఆదివాసీలను గెంటివేసే నిర్ణయాలను ఈ ప్రభుత్వం తీసుకుంటోంది. అణుబాంబులన్నింటినీ నిర్మూలించాలని ప్రపంచ ప్రజలు కోరుతున్నపుడు, యురేనియం ఎందుకు? అణుబాంబులెందుకు? ప్రజలను శాంతంగా బతకనివ్వరా? నల్లమలను కాపాడేందుకు ఆంధ్ర, తెలంగాణ ప్రజలు ముందుకు రావాలి. రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాలి. ఈ బాధ్యత ప్రగతిశీల శక్తుల పైనే వుంది.